History of National Consumer Rights Day in Telugu | జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం - డిసెంబర్ 24 |
జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం - డిసెంబర్ 24
ఉద్దేశ్యం:
- వినియోగదారులకు తమ హక్కులు, చట్టాల గురించి అవగాహన కల్పించడం జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం (National Consumer Rights Day) యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
ఎప్పటి నుండి?
- 1986 నుండి ప్రతీ సంవత్సరం డిసెంబరు 24న జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
డిసెంబరు 24నే ఎందుకు?
- దేశంలో వినియోగదారుల రక్షణ చట్టం 1986 డిసెంబరు 24న అమల్లోకి వచ్చినందున ఆ రోజున జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
థీమ్ (Theme):
- 2020: The Sustainable Consumer
- 2019: Alternate Consumer Grievance /Dispute Redressal
- 2018: Timely Disposal of Consumer Complaints
వినియోగదారులెవరు?
- వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం-1986 ప్రకారం తమ అవసరార్థం వస్తువులు లేదా సేవలు కొనుగోలు చేసిన వారు వినియోగదారులు. అలాగే కొనుగోలుదారుల అనుమతితో ఆ వస్తువుల లేదా సేవలను వినియోగించుకునేవారు సైతం వినియోగదారులే.
చరిత్ర:
- వినియోగదారుల ఉద్యమ పితామహుడిగా పేరుగాంచిన అమెరికా దేశానికి చెందిన 'రాల్ఫ్‌నాడార్' (Ralph Nader) వినయోగదారుల ఉద్యమానికి మూల పురుషుడు. ఓ సంస్థ తయారు చేస్తున్న కార్లలో నాణ్యత లోపంపై ఆయన ఉద్యమించారు. ఆ తర్వాత వస్తువుల తయారీ, అమ్మకాల్లో అక్కడి వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు.
- ఈయన కృషివల్లే ప్రపంచమంతటా వినియోగదారుల ఉద్యమ సంఘాలు ఏర్పడ్డాయి.ఇవి వినియోగదారుల సంరక్షణ, సంక్షేమం, సేవలు, విద్య తదితర అంశాల్లో నెలకొన్న అనిశ్చితి వల్లే ప్రత్యేక హక్కుల కోసం గతంలో ప్రపంచవ్యాప్తంగా అనేక ఉద్యమాలు జరిపాయి.
- మొదటిసారిగా 1920 లో అమెరికాలో ప్రారంభమైన వినియోగదారుల ఉద్యమం క్రమక్రమంగా వివిధ దేశాలకు వ్యాపించింది.
- 1962 లో మార్చి 15న అప్పటి అమెరికా దేశాధ్యక్షుడు జాన్ ఎఫ్.కెన్నెడి దేశ పౌరుల కోసం ప్రప్రథమంగా వినియోగదారుల హక్కులు ప్రకటించారు.
- 1972 లో అంతర్జాతీయ వినియోగదారుల సంఘాల సంస్థ ప్రాంతీయ సంచాలకుడు అన్వర్ ఫజల్ మార్చి 15 తేదీనే ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా పరిగణించాలని తీర్మానించాడు.
- దాంతో 1973 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ సంవత్సరం మార్చి15 న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
- భారతదేశంలో వినియోగదారుల రక్షణ చట్టం 1986 డిసెంబరు 24 వ తేదీన అమల్లోకి వచ్చినందున డిసెంబరు 24న జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
Jago Grahak Jago:
- Jago Grahak Jago (Wake Up Consumer Wake Up - మేలుకో వినియోగదారుడా మేలుకో) కార్యక్రమం 2005 లో ప్రారంభించబడింది.
- జాగో గ్రాహక్ జాగో అనేది వినియోగదారుగా తన హక్కుల గురించి సామాన్యులకు తెలియజేయడానికి భారత ప్రభుత్వం (Ministry of Consumer Affairs, and Public Distribution) చేపట్టిన ప్రచార కార్యక్రమం. ఈ ప్రచారం ప్రత్యేకంగా మారుమూల మరియు గ్రామీణ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటుంది. ఇది ప్రింట్ మరియు విజువల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయబడింది.
వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టాలు:
మనం నిత్యం ఎన్నో రకాల వస్తువులను కొనుగోలు చేస్తుంటాం. తూనికలు, కొలతల విషయంలో మోసానికి గురి కాకుండా నాణ్యమైన వస్తువులను పొందడం వినియోగదారులుగా మనహక్కు. వస్తువులపై ముద్రించిన ధర కంటే ఎక్కువ వ్యాపారులు వసూలు చేస్తూనే ఉన్నారు. కిలో అని కళ్ల ముందే తూసి ఇచ్చే వస్తువు వాస్తవానికి 900 గ్రాములే ఉంటోంది. పాలు, కిరోసిన్ విషయంలోనూ తరుగు ఉంటోంది. పెట్రోల్ బంకుల్లో ఆపరేటర్ల హస్తవాసి వల్ల వాహనదారులు ఎంతో కొంతనష్టపోక తప్పడం లేదు. రైతు లు రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన ధాన్యాన్ని అమ్మేటపుడు 70కిలోల బస్తాకు దాదాపు 6 నుంచి 7 కిలోలు తూకంలో మోసాల కారణంగా నష్టపోతున్నారు. కనుక ఈ విషయంలో వినియోగదారుల రక్షణ కోసం ప్రవేశ పెట్టిందే వినియోగదారుల చట్టం-1986. దేశవ్యాప్తంగా ఈ చట్టాన్ని ఒకే విధంగా అమలు చేసేందుకు స్టాండర్స్ ఆఫ్ వెయిట్ అండ్ మెజర్స్ చట్టాన్ని ప్రవేశ పెట్టారు. తూనికలు కొలతల చట్టాన్ని అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉంది.
వినియోగదారుల రక్షణ చట్టం-1986:(Consumer Protection Act-1986)
- ఈ చట్టంలోని 6వ సెక్షన్ ప్రకారం వినియోగదారుడిని సాధికారుడిని చేయడానికి 6 ప్రాథమిక హక్కులను కలిగించింది.
వినియోగదారుడు తన జీవితానికి, ఆస్తులకు ప్రమాదకరమైన సేవలు మరియు వస్తువుల నుండి రక్షణ పొందడానికి సాధికారుడు. ఒకవేళ సేవల వలన, వస్తువుల వలన ఏదైనా ప్రమాదము సంభవించేదుంటే అలాంటి వాటిని జాగ్రత్తగా ఎలా ఉపయోగించుకోవాలో వినియోగదారుడికి తెలియబడాలి.(2) సమాచార హక్కు (Right to Information):
ఒక ఉత్పత్తి యొక్క నాణ్యత, పరిమాణము, సామర్థ్యం, స్వచ్ఛత, ప్రమాణం మరియు సేవలు లేక వస్తువుల యొక్క వెల తెలుసుకునే హక్కు వినియోగదారుడికి ఉంది. దీని వలన ఉత్పత్తిదారులు, సేవలందించే వారు వినియోగదారుడితో నిజాయితీగా వ్యాపారం చేసే అవకాశముంటుంది. అలా చేయని వారి నుండి ఈ హక్కు వినిమయదారులను రక్షిస్తుంది.(3) ఎంపిక చేసుకునే హక్కు (Right to Choose):
వినియోగదారులు తాము పొందాలనుకున్న సేవలను, వస్తువులను పోటీపడగల ధరలలో ఎంచుకోవచ్చు. వ్యాపారస్తుల మధ్య సముచితమైన పోటీని ప్రోత్సహించినపుడు వినియోగదారులకు సేవలు లేక వస్తువులు సరసమైన ధరలలో మన్నికైనవి లభించే అవకాశ ముంటుంది.(4) తమ వాదనను వినిపించే హక్కు (Right to be Heard):
వినియోగదారుల రక్షణ చట్టంలో ఈ హక్కు ఒక కీలకాంశం. ఎందుకంటే ఈ హక్కు ఆధారంగా వినియోగదారుల పట్ల ఏదైనా పొరపాటు జరిగినట్లయితే వారి ప్రయోజనాల రక్షణకై సంబంధిత వినియోగదారుల ఫోరంలో శ్రద్ధ తీసుకోబడుతుంది.(5) పరిష్కారం పొందే హక్కు (Right to Seek Redressal):
ఒక వ్యాపార సంస్థ యొక్క అనుచిత వ్యాపారం వలన వినియోగదారుడు నష్టపోవడం కాని గాయపడటం కాని జరిగినపుడు సంబంధిత వినియోగదారుల ఫోరంలో ఆ వ్యాపార సంస్థపై ఫిర్యాదు చేసి అది నిజం అని నిరూపించబడినపుడు ఆ వ్యాపార సంస్థ సదరు వినియోగదారుడికి నష్ట పరిహారం చెల్లించవలసి ఉంటుంది.(6) తెలియబరిచే హక్కు ( Right to Consumer Education):
ఈ హక్కు వినియోగదారుడికి ఈ విషయము తెలియజేస్తుంది. విపణిలో నెలకొన్న స్థితులు వాటికి వ్యతిరేకంగా ఏ చర్యలు తీసుకొవచ్చు అనేది తెలుపుతుంది. ఇలాంటి శిక్షణను వ్యాప్తి చేయడానికి మీడియా లేక పాఠశాలలో బోధన వంటి చర్యలు ఉపయోగపడతాయి.
వినియోగదారుల రక్షణ చట్టం-2019:
(Consumer Protection Act-2019)
- ప్రస్తుత ఆధునిక డిజిటల్ యుగంలో వినియోగదారులు అనేక రూపాల్లో మోసాలకు గురవుతున్నారు. ఉత్పత్తిదారుడు, అమ్మకందారుడు ఎక్కడా కనిపించని ఆన్‌లైన్ యుగంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం-2019 కొనుగోలుదారులకు పెద్ద ఆసరా, ఆయుధమని చెప్పక తప్పదు.
- ఈ చట్టం లో 8 అధ్యాయాలు, 107 సెక్షన్లు ఉన్నాయి.
- ఈ చట్టంలో ఏడు ముఖ్య రక్షణలున్నాయి. అవి
(1) అక్రమ పద్ధతులు, లావాదేవీలను ఈ చట్టం నిరోధిస్తుంది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది.
(2) ఆన్‌లైన్ అమ్మకాలు, టెలీ షాపింగ్, మల్టీ మార్కెటింగ్, ప్రత్యక్ష అమ్మకాలు లాంటివన్నీ ఈ చట్టపరిధిలోకి వస్తాయి.
(3) వస్తువులు, సేవలు, నిర్మాణాలు, ఇండ్ల నిర్మాణా లు, ఫ్లాట్ల అమ్మకాల వంటివన్నీ కూడా వినియోగదారుల చట్టపరిధిలోకి వస్తాయి.
(4) వస్తు ఉత్పత్తిలో నాణ్యతాలోపం, ఉత్పత్తి లోపం తదితర విషయాల్లో వినియోగదారునికి హానీ, లేదా నష్టం జరిగినప్పుడు చట్టం వినియోగదారునికి రక్షణగా నిలుస్తుంది.
(5) ఏ సందర్భంలోనైనా అవసరమని భావించినప్పుడు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) నిర్దిష్ట వస్తు సముదాయాన్ని సాంతం వెనక్కిపిలిపించే హక్కు కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఉన్నవి కేవలం సలహా, సూచనల వరకే పరిమితమై ఉండేవి. కొత్త చట్టం పూర్తిగా చట్టబద్ధత కలిగిన సంస్థగా సర్వాధికారాలు కలిగి ఉన్నది.
(6) వివాదాల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం కూడా ఈ చట్టం ద్వారా ఏర్పడింది. ఇవన్నీ జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయిలో కూడా పనిచేస్తూ వినియోగదారులకు సత్వర న్యాయం అందిస్తాయి.
(7) ప్రచార ప్రలోభాల ద్వారా వినియోగదారులను మోసపుచ్చే విధానాలకు చెక్‌పెట్టే విధంగా కొత్త చట్టం అధికారాలు కలిగి ఉన్నది.
వీటితో పాటు వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం-2019లో మరిన్ని హక్కులు పొందుపర్చబడినాయి.
(1) కొత్త చట్టం ప్రకారం వినియోగదారుడు వస్తువును కొనుగోలు చేసిన తర్వాత మోసం జరిగిందని భావించినప్పుడు, ఆ వస్తువును ఎక్కడ కొనుగోలు చేసినాసరే ఎక్కడినుంచైనా ఫిర్యాదు చేయవచ్చు. గతంలో అయితే ఎక్కడ వస్తువును కొనుగోలు చేశారో అక్కడే ఫిర్యాదు చేయటానికి అవకాశం ఉండేది. కొత్త చట్టం కారణంగా వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఎక్కడి నుంచైనా ఆ వస్తు ఉత్పత్తి/ తయారీదారులపై ఫిర్యాదుచేసే అవకాశం ఉన్నది.
(2) వస్తువును కొనుగోలు చేసిన తర్వాత తనకు తగురీతిలో న్యాయం జరుగలేదని భావించినప్పుడు అతనికి నష్టపరిహారం పొందే హక్కు కొత్త చట్టం కల్పించింది. ఈ వెసులుబాటు కారణంగా కొనుగోలుదారులు వస్తు నాణ్యతా ప్రమాణాలపై, ఉపయోగ విలువపై వస్తు ఉత్పత్తిదారులు లేదా అమ్మకందారులపై కేసువేసి నష్టపరిహారం పొందవచ్చు. వస్తు నాణ్యతలో లోపాలున్నప్పుడు వారెంటీతో సంబంధం లేకుండానే తగురీతిలో నష్టపరిహారం కోరవచ్చు. దానికి అమ్మకందారు, తయారీదారులు బాధ్యత వహించాలి.
(3) అపసవ్య, అక్రమ వ్యాపార పద్ధతుల ద్వారా వినియోగదారులకు నష్టం జరిగినప్పుడు కొనుగోలుదారులను ఒక సామాజిక సమూహం (తరగతి)గా పరిగణించి వారి రక్షణకు కొత్తచట్టం అండగా నిలుస్తుంది.
(4) వినియోగ దారులు తమ ఫిర్యాదులను జిల్లాస్థాయి కన్స్యూమర్ కోర్టులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.
(5) వినియోగదారుడు ఏ విషయంపై అయినా ఫిర్యాదు చేసినప్పుడు అదెందుకు తిరస్కరించబడిం దో తెలుసుకునే హక్కు ఉంటుంది. ఫిర్యాదుదారుని వాదన లేదా ఫిర్యాదు వినకుండా ఏ స్థాయిలో కూడా తిరస్కరించే అధికారం ఎవరికీ లేదు.
వినియోగదారుల హక్కుల పరిరక్షణకు సంబంధించి భారతదేశంలోని కొన్ని ప్రధాన చట్టాలు:
(1) వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం - 1986
(2) ఆహార భద్రత, ప్రమాణాల చట్టం -2006
(3) బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ చట్టం - 1986
(4) డ్రగ్స్, కొస్మొటిక్స్ చట్టం - 1940
(5) డ్రగ్స్ (కంట్రోల్) చట్టం - 1950
(6) డ్రగ్స్, మాజిక్ రెమిడీస్ ( అభ్యంతరకర ప్రకటనల) చట్టం - 1954
(7) నిత్యావసర వస్తువుల చట్టం - 1955
(8) బ్లాక్ మార్కెటింగ్ నియంత్రణ, నిత్యావసర సరకుల సరఫరా నిర్వహణ చట్టం - 1980
(9) వ్యవసాయ ఉత్పత్తుల (గ్రేడింగ్, మార్కెటింగ్) చట్టం - 1937
(10) తూనికలు, కొలతల ప్రమాణాల చట్టం - 1976 (11) తూనికలు, కొలతల ప్రమాణాలు (పేకెట్లలోని వస్తువుల) నిబంధనలు -1977
(12) కాంపిటిషన్ చట్టం - 2002
(13) ట్రేడ్ మార్క్ చట్టం - 1999 (2003 సెప్టెంబర్ నుంచి అమలులోకి)
(14) సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల (ప్రకటనల నిషేధం, వాటి వ్యాపారం, వాణిజ్యం, ఉత్పత్తి, సరఫరా, పంపిణీ నియంత్రణ) చట్టం - 2003.
ఫిర్యాదు (complaint):
- వినియోగదారుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వము National Consumer Helpline (NCH) ను ఒక టోల్ ఫ్రీ నంబరుతో ఏర్పాటు చేశారు. ఆ టోల్ ఫ్రీ నంబరు 1800114000 లేక 14404.
- వినియోగదారుల చట్టం 1986 క్రింద వినియోగదారుని హక్కులకు భంగం వాటిల్లినపుడు జిల్లా ఫోరం, స్టేట్ కమీషన్, నేషనల్ కమీషనులలో ఫిర్యాదు చేయవచ్చు.
- కొనుగోలు చేసే సమయంలో సరైన రశీదును (బిల్లు) అడిగి తీసుకోవాలి. కొన్ని వస్తువుల విషయంలో గ్యారెంటీ, వారెంటీ కార్డులను షాపు యజమాని సంతకం, ముద్రతో సహా తీసుకోవాలి. ఇవి వినియోగదారుల ఫోరంలో సమర్పించడానికి ఉపయోగపడతాయి. నాసిరకం వస్తువులను విక్రయించిన వారిపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయడానికి వెనుకాడొద్దు.
- ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు నాణ్యత లేదనో, ధర ఎక్కువగా తీసుకున్నారనో, ముగింపు తేదీ గడిచిందనో, తూకంలో తేడా ఉందనో నిర్ధారణకు వచ్చినప్పుడు జిల్లా కేంద్రంలో ఉండే వినియోగదారుల ఫోరంలో నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.
- ఫిర్యాదు చేసే విధానం చాలా సులభం. తెల్లకాగితంపై వివరాలు రాసి ఫిర్యాదు చేయవచ్చు. న్యాయవాది అవసరం కూడా లేదు.
- ఫిర్యాదుదారుడైనా లేదా అతని ఏజెంట్ ఫోరంలో నేరుగా ఫిర్యాదు ఇవ్వవచ్చు. లేదా పోస్టు ద్వారా కూడా పంపుకునే అవకాశం ఉంది.
- వినియోగదారుడి ఫిర్యాదుపై త్వరగానే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తూకంలో మోసాలపై స్థానికంగా ఉన్న తూనికలు, కొలతల శాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేయవచ్చు. వారు చర్యలు తీసుకోకపోతే వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించవచ్చు.
- ఫిర్యాదుపత్రంలో ఫిర్యాదుదారుని పూర్తి పేరు, చిరునామా తప్పనిసరిగా ఫిర్యాదులో పేర్కొనాలి. అవతలి పార్టీపూర్తి పేరు, చిరునామా, ఫిర్యాదు చేయడానికి గల కారణాలు.. ఎప్పుడు ఏ విధంగా మోసం లేదా నష్టం జరిగిందో పేర్కొనాలి. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు, రశీదు, ఇతర వివరాలు జత చేయాలి.
- మనం కొనే వస్తువు లేదా సేవల విలువ రూ.20 లక్షల వరకు ఉంటే జిల్లా ఫోరంలో, రూ.20 లక్షలకు మించి రూ.1కోటి వరకు ఉంటే రాష్ట్ర కమిషన్ లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.
- కొనుగోలు చేసిన, నష్టం జరిగిన నాటి నుంచి రెండేళ్లలోపు ఫిర్యాదు చేయవచ్చు. ఆలస్యానికి తగిన కారణాలు చూపితే రెండేళ్లు దాటిన తరువాత ఫిర్యాదు చేసేందుకు కూడా అవకాశం ఉంది.
వీటిని కూడా చూడండీ: