Tabble of Content |
ప్రాజెక్ట్ టైగర్ (Project Tiger):
- ప్రాజెక్ట్ టైగర్ ను అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో 1 ఏప్రిల్ 1973న ప్రారంభించారు.
- ఇది కేంద్ర ప్రాయోజిత పథకం (CSS).
- దేశంలో అంతరించిపోతున్న పులుల జనాభాను పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడానికి దీనిని చేపట్టారు.
- ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పులుల సంరక్షణ ప్రాజెక్ట్.
- ప్రాజెక్ట్ టైగర్ మొదట 18,278 చ.కి.మీ కవర్ చేసే 9 టైగర్ రిజర్వుల నుండి 75,796 చ.కి.మీ కవర్ చేసే 53 రిజర్వులకు విస్తరించింది.
- దీని కార్యాక్రమాలను నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటి (NTCA) నిర్వహిస్తుంది.
NTCA:
- నేషనల్ కన్జర్వేషన్ అథారిటి ఆఫ్ ఇండియా (NTCA) అనేది భారతదేశంలో పులుల సంరక్షణ కోసం ఏర్పాటు చేయబడిన చట్టబద్ధమైన సంస్థ.
- రాజస్థాన్ లోని సరిస్కా పులుల సంరక్షణ కేంద్రంలో 2005లో అత్యధికంగా పులులు అంతరించిపోవడంతో అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది.
- ఈ టాస్క్ ఫోర్స్ చేసిన సిఫారస్సు ఆధారంగా 2005లో NTCA ఏర్పాటు చేయబడింది.
- దీని ఏర్పాటుకై 2006లో వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972ను సవరించారు. దీంతో NTCA 4 సెప్టెంబర్ 2006నుండి అమలులోకి వచ్చింది.
- ఇది వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లోని సెక్షన్ 38 L(1) ప్రకారం ఏర్పడింది మరియు సెక్షన్ 38 L(2) ప్రకారం కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి NTCA కు చైర్మన్ గా, కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి వైస్ చైర్మన్ గా ఉంటారు.
- ఇది భారతదేశంలో పులుల జనాభా లెక్కలను 2006నుంచి ప్రతి నాలుగేళ్లకొకసారి విడుదల చేస్తుంది.
- ఇది టైగర్ రిజర్వ్‌ల పర్యవేక్షణ మరియు నిర్వహణ బాధ్యతను నిర్వహిస్తుంది.
- Website: www.ntca.gov.in
NTCA యొక్క ప్రాథమిక విధులు:
- ప్రాజెక్ట్ టైగర్ ను అమలు చేయడం.
- భారతదేశంలో పులుల సంరక్షణ ప్రయత్నాలను బలోపేతం చేయడం.
- టైగర్ రిజర్వుల అభివృద్ధి, పర్యవేక్షణ, నిర్వహణ.
- పులుల జనాభా మరియు వాటి ఆవాసాలను పర్యవేక్షించడం.
- పులుల సంరక్షణ కార్యకలాపాల కోసం రాష్ట్రాలకు ఆర్థిక సహాయం అందించడం.
- పులుల సంరక్షణలో శాస్త్రీయ పరిశోధన మరియు శిక్షణను ప్రోత్సాహించడం.
- పులుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించడం.
IBCA:
- ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించి ఏప్రిల్ 1 నాటికి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా, దీని జ్ఞాపకార్థం 9 ఏప్రిల్ 2023న కర్ణాటకలోని మైసూరులో జరిగిన మెగా ఇంటర్నేషనల్ ఈవెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏడు పెద్ద పిల్లుల సంరక్షణ కోసం అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ (IBCA) ను ప్రారంభించారు.
- IBCA అనేది పిల్లుల వర్గానికి చెందిన ఏడు జంతువులను రక్షించడానికి అంతర్జాతీయంగా పని చేస్తుంది. అవి: (1) పులి (2) సింహం (3) చిరుత పులి (4) మంచు చిరుత (5) చీతా (6) జాగ్వార్ (7) ప్యూమా.
- వీటి ఆవాసాలను కవర్ చేసే 97 దేశాలను ఈ కూటమిలో చేర్చుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
- IBCA ద్వారా వన్యప్రాణులను సంరక్షించేందుకు అవసరమైన సాంకేతికత సాయం, అనుభవాన్ని సభ్య దేశాలు పంచుకుంటాయి.