Friday, March 24, 2023

History of World TB Day in Telugu | ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం - మార్చి 24

History of World TB Day in Telugu | ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం - మార్చి 24
History of World TB Day in Telugu |
ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం - మార్చి 24

ప్రపంచ క్షయ వ్యాధి
నివారణ దినోత్సవం (World TB Day)


ఉద్దేశ్యం :-

  • ముఖ్యంగా ఊపిరితిత్తులను తీవ్రంగా ప్రభావితం చేసే క్షయ వ్యాధి గురించి అవ‌గాహ‌న క‌ల్పించ‌డం, ర‌క్ష‌ణ, చికిత్స విష‌యాల‌ను అంద‌రికి తెలియ‌జేయడం మరియు TB మహమ్మారిని అంతం చేయడానికి ప్రయత్నాలను వేగవంతం చేయడం ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం (World Tuberculosis Day) యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు?

  • 1982లో the International Union Against Tuberculosis and Lung Disease (IUATLD) మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం జరుపుకోవాలని ప్రతిపాదించింది. అప్ప‌టి నుంచి క్ష‌య‌వ్యాధి నివారణ దినోత్స‌వాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం జ‌రుపుకుంటున్నారు.

మార్చి 24 నే ఎందుకు జరుపుకుంటారు?

  • జర్మనీ దేశానికి చెందిన డాక్ట‌ర్ రాబర్ట్ కోచ్ (Dr. Robert Koch) అనే శాస్త్రవేత్త క్షయ వ్యాధికి కారణమైన మైకోబ్యాక్టీరియమ్ ట్యూబర్‌ క్యులోసిస్ (Mycobacterium tuberculosis) అనే బ్యాక్టీరియాను 1882 మార్చి 24న కనుగొన్నాడు. అందుకే ఏటా మార్చి 24న ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.  
  • క్షయ వ్యాధి క్రిమిని కనుగొన్నందుకుగాను రాబర్ట్‌ కోచ్ కు వైద్యశాస్త్రంలో 1905లో నోబెల్‌ పురస్కారం లభించింది.
History of World TB Day in Telugu | ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం - మార్చి 24
డాక్ట‌ర్ రాబర్ట్ కోచ్ (Dr. Robert Koch)

క్షయ (TB) :-

  • క్షయ అనేది ఒక అంటు వ్యాధి. ఇది మైకోబ్యాక్టీరియం  ట్యూబర్‌ క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. టీబీ రోగులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే తుంపర్లతో ఈ బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. 
  • శరీరంలో రక్త ప్రసరణ లేని తల వెంట్రుకలు, గోళ్లకు తప్ప మిగిలిన రక్త ప్రసరణ జరిగే శరీరంలో అన్ని భాగాలకు క్షయ వ్యాధి రావచ్చు. క్షయ క్రిమికి ఆక్సిజన్‌ చాలా అవసరం కాబట్టి సాధారణంగా ఇది ఆక్సిజన్‌ ఎక్కువగా లభించే ఊపిరితిత్తులకు సోకుతుంది. ఊపిరితిత్తులకు సోకే క్షయ వ్యాధిని వైద్య భాషలో పల్మనరీ టిబి (Pulmonary TB) అని పిలుస్తారు. దీనినే శ్వాస కోశ టిబి అని కూడా అంటారు. ఊపిరితిత్తులకు శరీరంలోని ఇతర అవయవాలకు సోకే క్షయను ఎక్స్‌ట్రా పల్మనరీ టిబి (Extrapulmonary TB) అని అంటారు.
  • ఈ బ్యాక్టీరియా ఒక్కసారి ఒంట్లోకి చేరిందంటే జీవితకాలం మనలోపలే ఉంటుంది. క్షయ కారక సూక్ష్మ క్రిమి మానవ శరీరంలో ప్రవేశించినా వెంటనే వ్యాధి బయట పడదు. సుమారు 95 శాతం మందిలో రోగ నిరోధక వ్యవస్థ దీనిపై పోరాటం చేసి వ్యాధి సోకకుండా అడ్డుకుంటుంది. అయితే మిగిలిన ఐదు శాతం మందిలో రోగ నిరోధక శక్తి చాలకపోవడంతో వారు క్షయ బారిన పడుతుంటారు. ముఖ్యంగా హెచ్‌ఐవి కారణంగా లేదా పోషకాహార లోపం లేదా మరేదైనా కారణాలతో శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలహీనమైనప్పుడు క్షయ వ్యాధి విజృంభిస్తుంది.
  • టీబీకి పూర్తిస్థాయిలో చికిత్స ఉన్నది. వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటిస్తే తప్పకుండా నయమవుతుంది.

TB వ్యాధి లక్షణాలు :-

  • కనీసం 3 వారాల పాటు కొనసాగే నిరంతర దగ్గు క్షయవ్యాధి ప్రధాన లక్షణం. దగ్గు సమయంలో రక్తంతో పాటు కఫం వ‌స్తుంది. 
  • చలి, జ్వరం, ఆకలి లేకపోవడం మరియు బరువు తగ్గి రోగి అస్తిపంజరంలా తయారవడం, ఆయాసం, త్వరగా అలసిపోవడం.
  • రాత్రి చెమటలు మరియు ఛాతీ నొప్పి కూడా వ్యాధిలో భాగమే.
  • కడుపు నొప్పి, కీళ్ల నొప్పులు, మూర్ఛలు మరియు నిరంతర తలనొప్పికి కూడా ఈ వ్యాధి కారణమవుతుంది.

ఏం చేయాలి ?

  • క్షయ లక్షణాలు కనిపించిన వారిని ప్రాథమిక దశలోనే గుర్తించి సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి అవసరమైన Designated Microscopy Centre (DMC) ద్వారా వైద్య పరీక్షలను నిపుణుల సమక్షంలో జరపాలి. 2021 నాటికి దేశవ్యాప్తంగా 22,198 DMC లు ఉన్నాయి. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో నిర్ణీత కాల వ్యవధి కోర్సులలో ఔషధ సేవనం ద్వారా సులభంగా ఈ వ్యాధిని నయం చేసుకోవచ్చు. ఆరోగ్య కేంద్రాలలో కళ్లె (తెమడ) పరీక్షలు చేయించుకోవడం, ఛాతీ ఎక్స్‌రే ద్వారా క్షయ వ్యాధిని నిర్ధారణ చేసుకోవాలి. అటువంటి పరీక్షలను ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా చేస్తున్నారు.
  • ఈ వ్యాధిని పూర్తిగా నియంత్రించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వల్పకాలిక చికిత్సా విధానాన్ని (DOTS - Directly Observed Treatment, Short-course) రూపొందించింది. దీని ద్వారా శిక్షణ పొందిన ప్రొవైడర్లు, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న క్షయ రోగులను ప్రత్యేకంగా పర్యవేక్షించాలి. వ్యాధి తీవ్రతను బట్టి ఆరు నుంచి తొమ్మిది నెలల వరకు చికిత్సకు అవసరమైన నాణ్యత కలిగిన డాట్స్‌ మందులను తమ సమక్షంలోనే దగ్గరుండి మింగించడం, వ్యాధి పూర్తిగా నయం అయ్యేంత వరకు చూడటం ఈ విధానం ప్రత్యేకత. 

గణాంకాలు :-

  • WHO 1997 నుండి ప్రతి సంవత్సరం గ్లోబల్ ట్యూబర్‌క్యులోసిస్ నివేదిక (Global TB Report) ను ప్రచురిస్తుంది.
  • WHO ప్రకారం ప్రతిరోజూ 4100 మందికి పైగా ప్రజలు TB బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు మరియు దాదాపు 28,000 మంది అనారోగ్యం పాలవుతున్నారు
  • 2020లో WHO నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 99,00,000 మంది TB బారిన పడ్డారు (ఇందులో 5.6 మిలియన్ పురుషులు, 3.3 మిలియన్ మహిళలు మరియు 1.1 మిలియన్ పిల్లలు ఉన్నారు).  అందులో 15,00,000 మంది మరణించారు (HIV ఉన్నవారు 2,14,000 మంది, పిల్లలు 2,26,000 మంది ఉన్నారు)
  • 2000 - 2020 మధ్య TB కి చికిత్స చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా 66 మిలియన్ల మంది ప్రాణాలను కాపాడారు.
  • కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 2020లో మొత్తం క్షయవ్యాధి కేసులు 18.12 లక్షలు (2019లో 24 లక్షల కేసులు) (Nikshay Report)
  • వైద్య విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా మన దేశంలో అవగాహన లోపం, నిర్లక్ష్యం, పేదరికంతో క్షయ వ్యాధి మరణాలు వాటిల్లుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

థీమ్ (Theme) :-

  • 2023 : Yes! We can end TB
  • 2022 : Invest to End TB. Save Lives
  • 2021 : The clock is ticking
  • 2020 : It's time to end TB

మరికొన్ని ముఖ్యమైన అంశాలు :-

  • క్షయవ్యాధి కేసుల్లో భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది.
  • TB అధ్యయనం - థిసియాలజీ 
  • TB నిర్ధారణ పరీక్ష - మాంటాక్స్
  • దీనికి ఇచ్చే డ్రగ్స్ : ఐసోనిజైడ్, పైరాజినమైడ్, రిఫాంపిసిన్, ఇథాంబ్యుటాల్ మరియు P - అమైనో సాలిసిలిక్ ఆమ్లం.
  • End TB 2035 : ప్రపంచ ఆరోగ్య సంస్థ 2035 నాటికి క్షయ వ్యాధిని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నది దీనిలో భాగంగా భారత ప్రభుత్వం 2018 లో End TB సదస్సును నిర్వహించింది. 2019 లో TB హరేగా దేశ్ జీతేగా కార్యక్రమాన్ని చేపట్టింది. భారత ప్రభుత్వం క్షయ వ్యాధిగ్రస్తులకు చికిత్సకు గాను నెలకు రూ.500 లను నిక్షయ్ పోషణ్ యోజన (Nikshay Poshan Yojana) లో  భాగంగా అందిస్తున్నది. ఈ యోజనను 2018 ఏప్రిల్ లో ప్రారంభించబడింది.
History of World TB Day in Telugu | ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం - మార్చి 24

External Links :-


No comments:

Post a Comment