Banner 160x300

About Ugadi Festival in Telugu | ఉగాది పండుగ విశిష్టత | Student Soula


About Ugadi Festival in Telugu | ఉగాది పండుగ | Student Soula


ఉగాది (Ugadi):

  • ఉగ అంటే నక్షత్ర గమనం లేదా జన్మ ఆయుష్షు అని అర్థాలు కూడా ఉన్నాయి. వీటికి ఆది యుగాది (ఉగాది).  ఇదే రోజు బ్రహ్మ విశ్వ సృష్టిని ప్రారంభించాడు అని పురాణాల ప్రవచనం. 
  • తెలుగువారు ఉగాది, కన్నడిగులు యుగాది, మరాఠీలు గుడి పాడ్వా, తమిళులు పుత్తాండు, మలయాళీలు విషు, సిక్కులు వైశాఖీ, బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్ అనే పేర్లతో ఈ పండగని జరుపుకుంటారు.
  • ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ.
  • శిశిర ఋతువు ఆకురాలు కాలం. శిశిరం తరువాత వసంతం వస్తుంది. చెట్లు చిగుర్చి ప్రకృతి శోభాయమానంగా వుంటుంది. కోయిలలు కుహూకుహూ అని పాడుతాయి. 
  • ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఆ రోజున ప్రాతః కాలమున లేచి ఇళ్లు, వాకిళ్లు, శుభ్ర పరచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు మరియు పంచాంగ శ్రవణం వింటారు.

పంచాంగ శ్రవణం:

  • మనకు తెలిసిన ఖగోళ శాస్త్రం ఆధారంగా ఏ గ్రహాలు ఏ రాశిలో సంచరిస్తున్నాయో లెక్కించి, ఆ ప్రకారం ఫలితాలను అంచనా వేయడమే పంచాంగం ప్రధాన ఉద్దేశం.
  • పంచాంగం అంటే అయిదు విభాగాలని అర్థం. అవే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు.
  • 15 తిథులు, 7 వారాలు, 27 నక్షత్రాలు, 27 యోగాలు, 11 కరణాలన్నింటి గురించి తెలియజేసేదే పంచాంగం. తిథి విషయంలో జాగ్రత్త పడితే సంపద, వారం వల్ల ఆయుషు, నక్షత్రం వల్ల పాప పరిహారం, యోగం వల్ల ఆరోగ్యం, కరణం వల్ల విజయం ప్రాప్తిస్తాయని అంటారు.
  • పంచాంగ శ్రవణ సమయంలో ఎన్నో సార్లు గ్రహాల పేర్లు పలుకుతారు. అందువల్ల ఆయా గ్రహాలు సంతోషిస్తాయట. ఫలితంగా పంచాంగ శ్రవణం చేసినవాళ్లకీ, విన్న వాళ్లకీ సూర్యుడి వల్ల తేజస్సూ, చంద్రుడి వల్ల వైభవం, కుజుడి వల్ల సర్వమంగళం, బుధుడి వల్ల బుద్ధి వికాసం, గురుడి వల్ల జ్ఞానం, శుక్రుడి వల్ల సుఖం, శనివల్ల దుఃఖరాహిత్యం, రాహువు వల్ల ప్రాబల్యం, కేతువు వల్ల ప్రాధాన్యం కలుగుతాయనీ, దేవతలూ అనుగ్రహిస్తారనీ శాస్త్రాలు చెబుతున్నాయి.

ఉగాది పచ్చడి:

  • ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనంతో తయారుచేసే శ్రేష్టమైన పదార్ధమే ఉగాది పచ్చడి.
  • జీవితంలో సుఖ దుఃఖాలుంటాయి. అన్నింటినీ సమచిత్తంతో స్వీకరించే ఆత్మస్తైర్యం ఉండాలన్నది ఉగాది పచ్చడి మన కిచ్చే సందేశం.
  • ఉగాది పచ్చడి, జఠరాగ్నిని ప్రవృత్తం చేసి, శ్లేష్మాన్ని హరించి, పిత్తాన్ని తగ్గించి, రక్తశుద్ధిని చేసి, ఆకలిని పెంపొందించి మనోవ్యాధుల్ని నశింపజేసి, చిత్త శాంతిని కలిగిస్తుందని శతాయుర్వజ్ర దేహాయ సర్వ సంపత్క రాయచ, సర్వారిష్ట వినాశాయ నింబకందళ భక్షణం అనే శ్లోకాన్ని పఠిస్తూ సేవిస్తే, ఆయుర్వృద్ధి జరుగుతుందని ఆయుర్వేద విజ్ఞానశాస్త్రం పేర్కొన్నది.
  • తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రకాల రుచులు (షడ్రుచులు) కలపి ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తారు.
  • తీపి (బెల్లం): ప్రతి మనిషి జీవితంలో మధురానుభూతులు అన్నివేళలా ఉంటే, ఎప్పుడైనా ఏ చిన్న దుఃఖం ఎదురైనా తట్టుకునే శక్తి ఉండదు. అందుకే తీపి కూడా మితంగానే తీసుకోవాలని ఉగాది పచ్చడి తెలియజేస్తుంది. అప్పుడే మనసూ ఆహ్లాదంగా ఉంటుంది. బెల్లం శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలను అందిస్తుంది. దగ్గూ, అజీర్తీ, మలబద్దకం, అలర్జీ వంటి సమస్యలను నివారిస్తుంది.
  • పులుపు (చింతపండు): చింతపండులోని పులుపు నేర్పుకు సంకేతం. నేర్పు లేకుండా జీవితంలో నెగ్గుకురాలేం. ఆరోగ్యపరంగా చెప్పాలంటే ఇది ఉష్ణాన్ని తగ్గిస్తుంది. వాత, పైత్య, శ్లేష్మ రోగాల్ని నివారిస్తుంది. జ్వరం రాకుండా చేస్తుంది. గుండెకు బలాన్ని కలిగిస్తుంది. జీర్ణశక్తిని పెంచడంతో పాటు విరోచనకారిగాను పనిచేస్తుంది.
  • కారం: ఇందుకోసం కొందరు నేరుగా కారం వాడితే, మరి కొందరు మిరియాల పొడిని వేస్తారు. ఇలా ఏ పదార్థంలోనైనా కారం వాడినప్పుడు దాన్నుంచి వచ్చే మంటను తట్టుకోవాలి. అంటే జీవితంలో ఎదురయ్యే సందర్భాలను ధైర్యంగా తట్టుకునే శక్తిని సొంతంచే సుకోవాలి. కారం ఆకలిని పెంచుతుంది. కొవ్వునీ కరిగిస్తుంది.
  • ఉప్పు: ఏ పదార్థమైనా రుచిగా ఉండాలంటే అందులోని ఉప్పే కీలకం. దీన్ని ఉత్సాహానికి ప్రతీకగా చెబుతారు. అయితే ఇది సరైన పాళ్లలోనే ఉండాలి లేదంటే జీవితంలో ఆందోళనే కాదు, ఆరోగ్యపరంగానూ ముప్పు తప్పదు.
  • వగరు (మామిడి): మామిడి వగరు రుచిని ఇస్తుంది. అంటే సవాళ్లను స్వీకరించేందుకు సదా సిద్ధంగా ఉండాలన్నదే దీని సారాంశం. ఆరోగ్యపరంగా మామిడి పిందెలు శరీరంలోని మలినాలనూ, పొట్టలో పేరుకున్న వాయువులనూ పోగొడతాయి. పెద్ద పేగుకు బలాన్ని చేకూర్చడంతోపాటూ శరీరాన్ని చల్లబరిచి, వడదెబ్బ రాకుండా చేస్తాయి.
  • చేదు (వేపపూత): వేపపూత చేదుగా ఉంటుంది. జీవితంలో బాధ కలిగించే సంఘటనలన్నీ చేదుగానే ఉంటాయి. వాటిని తట్టుకోవాలనేదే ఈ చేదు అంతరార్థం. ఆరోగ్యపరంగా చెప్పాలంటే ఈ చేదు కడుపులోని క్రిముల్ని నాశనం చేస్తుంది. రక్తశుద్ధికి తోడ్పడుతుంది. చర్మ వ్యాధుల్ని నివారిస్తుంది. కంటి చూపునీ మెరుగుపరుస్తుంది.
History Of Ugadi Festival In Telugu | ఉగాది పండుగ
ఉగాది పచ్చడి

60 తెలుగు సంవత్సరాలు:

  • కాలం ఎప్పుడూ చక్రభ్రమణం చేస్తూ ఉంటుంది. ఎక్కడ అంతం అవుతుందో అక్కడి నుంచే ప్రారంభం అవుతుందంటారు. చైత్ర మాసంతో కొత్త సంవత్సరాది మొదలై, ఫాల్గుణ మాసంతో పూర్తవుతుంది. ఆ తరవాత మళ్లీ ఆ చైత్ర మాసం వస్తుంది. ఇలా ప్రతి ఏటా వచ్చే కొత్త సంవత్సరాదిని మనం ఒక్కో పేరుతో పిల్చుకుంటాం. వాటికి ఆ పేర్లు రావడం వెనుకా కొన్ని కథలు ఉన్నాయి.
  • ఓ కథ ప్రకారం, ఓసారి నారద మహర్షి విష్ణు మాయవల్ల స్త్రీగా మారి ఓ రాజును పెళ్లాడతాడు. వారికి 60 మంది పుత్రులు జన్మిస్తారు. కానీ ఓ యుద్ధంలో వాళ్లంతా మరణిస్తారు. అప్పుడు నారద మహర్షి నారాయణుడిని ప్రార్థిస్తే "నీ పిల్లలు అరవై సంవత్సరాలుగా కాల చక్రంలో తిరుగుతుంటారు. అలా వారి పేర్లు చిర స్థాయిగా నిలిచిపోతాయి" అని వరమిస్తాడు. అవే ప్రస్తుతం తెలుగు సంవత్సరాలుగా వాడుకలో ఉన్నాయి.
  • మరొక కథనం ప్రకారం, శ్రీకృష్ణుడి భార్యల్లో సందీపని అనే రాజకుమారికి 60 మంది సంతానం. వారి నామాలనే తెలుగు సంవత్సరాలకు పెట్టారని అంటారు.
  • ఈ ఏడాది (2023-24) శోభకృత్ నామ సంవత్సరం. అరవై సంవత్సరాల్లో ఇది 37వ సంవత్సరం. శోభకృత్ అంటే శోభను కలిగించేది అని అర్థము. ఈ సంవత్సరం అందరి జీవితాలలో వెలుగును నింపేది అని చెప్పడమైనది.
List of Telugu Samvatsaralu | About Ugadi Festival in Telugu | ఉగాది పండుగ | Student Soula