History of World Malaria Day in Telugu | ప్రపంచ మలేరియా దినోత్సవం |
ప్రపంచ మలేరియా
దినోత్సవం - ఏప్రిల్ 25
ఉద్దేశ్యం:
మలేరియా వ్యాధి నిర్మూలన, ప్రజలలో ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించడం ప్రపంచ మలేరియా దినోత్సవం (World Malaria Day) ముఖ్య ఉద్దేశ్యం.
ఎప్పటి నుంచి?
మే 2007 లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆఫ్రికా మలేరియా దినోత్సవం (Africa Malaria Day) ను ప్రపంచ మలేరియా దినోత్సవంగా ప్రకటించింది.
2008 నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25 వ తేదీన ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
ఏప్రిల్ 25 నే ఎందుకు?
ఆఫ్రికాలోని నైజీరియా దేశ రాజధాని అబుజాలో 25 ఏప్రిల్ 2001 న ఆఫ్రికన్ యూనియన్ దేశాలు సమావేశమై ఆరోగ్య రంగాన్ని మెరుగుపరిచేందుకు తమ వార్షిక బడ్జెట్ లో కనీసం 15% కేటాయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రతిజ్ఞ చేశాయి మరియు పాశ్చాత్య దాత దేశాలు తమ మద్దతును పెంచాలని అభ్యర్థించాయి. దీనినే అబుజా డిక్లరేషన్ (Abuja Declarations and Frameworks for Action on Roll Back Malaria) అంటారు.
దీని జ్ఞాపకార్థం ఏప్రిల్ 25 (2001 నుంచే) వతేదీన ఆఫ్రికా మలేరియా దినోత్సవంగా జరుపుకోవడం ప్రారంభించారు.
థీమ్ (Theme):
- 2020: Zero malaria starts with me
- 2019: Zero malaria starts with me
- 2018: Ready to beat malaria
- 2017: LETS Close The Gap
గణాంకాలు (Statistics):
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా
- 2012లో మలేరియా వలన 6,27,000 మంది మరణించారు.
- 2015లో 4,29,000 మంది మరణించారు. 212 మిలియన్ కొత్త కేసులు నమోదయ్యాయి.
- 2018లో 4,05000 మంది మరణించారు. 228 మిలియన్ కొత్త కేసులు నమోదయ్యాయి.
మలేరియా (Malaria):
- మలేరియా అనే పేరు మల అరియ (Mala Aria) అనే ఇటాలియన్ పదం నుండి పుట్టింది. మల అరియ అంటే చెడిపోయిన గాలి (Bad Air) అని అర్ధం. చిత్తడి నేల ఉన్న చోట్ల మలేరియా అధికంగా ఉండటం వలన ఈ జ్వరాన్ని చిత్తడి జ్వరం (Marsh Fever) అని కూడా పిలిచేవారు.
- ప్లాస్మోడియం (Plasmodium- మలేరియాకు కారణమైన ఏకకణ సూక్ష్మజీవి) అనే పరాన్నజీవి (Parasite- ఇతరులపై ఆధారపడి జీవించే జీవి) వ్యాప్తి వల్ల సోకే మలేరియా, ఒక అంటు వ్యాధి.
- ఈ మలేరియా వ్యాధినే ప్లాస్మోడియం సంక్రమణ (Plasmodium Infection) అని కూడా అంటారు.
- మలేరియా ప్రాణాంతకమైన వ్యాధి అయినప్పటికీ దీనిని నయం మరియు నివారణ చేయవచ్చు.
- 1880లో మలేరియా పరాన్న జీవిని కనిపెట్టిన వ్యక్తి- చార్లెస్ లావిరన్ (Charles Louis Alphonse Laveran). ఇందుకు గాను ఇతనికి 1907లో వైద్య శాస్త్రంలో నోబల్ బహుమతి వచ్చింది.
- పాట్రిక్ మాన్సన్ (Patrick Manson) 1894లో దోమలు మలేరియాను వ్యాప్తి చేస్తాయని భావించారు.
- 1897లో సర్ రోనాల్డ్ రాస్ (Sir Ronald Ross) దోమలు (ఆడ ఎనాఫిలస్) మలేరియాను వ్యాప్తి చేస్తాయని నిరూపించాడు. ఈ పరిశోధన సికింద్రాబాద్ లో జరిగింది. ఇందుకు గాను ఇతనికి 1902 లో వైద్య శాస్త్రంలో నోబల్ బహుమతి వచ్చింది.
- చైనీస్ సాంప్రదాయ ఔషధ పరిశోధకుడు తుయుయు (Tu Youyou) 2015 లో యాంటీమలేరియల్ డ్రగ్ ఆర్టెమిసినిన్ (Artemisinin) పై చేసిన కృషికి వైద్య శాస్త్రంలో నోబల్ బహుమతి వచ్చింది.
మైక్రోస్కోపులో చూసినప్పుడు మలేరియా పరాన్నజీవి |
మలేరియా ఎలా వస్తుంది?
- మలేరియా వ్యాప్తి సాధారణంగా దోమకాటు వలన జరుగుతుంది. మనిషిని కుట్టినప్పుడు లాలాజలాన్ని వదులుతుంది. ఆ లాలాజలములో స్పోరోజాయిట్స్ ఉంటాయి. అవి మనిషి శరీరములోకి ప్రవేశిస్తాయి, అక్కడ నుండి అవి మీరోజాయిట్స్ గా కాలేయము, ఎర్ర రక్త కణాలలో పరిణతి చెందుతాయి. ఇలా పరిణతి చెందిన మీరోజాయిట్స్ వల్ల వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.
- అంటే ఈ సూక్ష్మజీవులు రక్తంలో నుండి కాలేయ కణాల్లోకి (Liver Cells) ప్రవేశిస్తాయి. అక్కడ వాటి సంఖ్య వృద్ధి చెందుతుంది.
- కాలేయ కణాలు పగిలినప్పుడు, ఈ సూక్ష్మ జీవులు బయటకు వచ్చి రక్త కణాల్లోకి ప్రవేశిస్తాయి. అక్కడ మళ్లీ వీటి సంఖ్య వృద్ధి చెందుతుంది.
- ఎర్రరక్త కణాలు పగిలినప్పుడు బయటకు వచ్చి మరిన్ని రక్తకణాల్లోకి ప్రవేశిస్తాయి.
- ఎర్రరక్త కణాల్లోకి ప్రవేశించడం, అవి పగిలిపోవడం జరుగుతూనే ఉంటుంది. ఎర్రరక్త కణాలు పగిలిన ప్రతీసారి వ్యాధి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి.
- అయితే అన్ని దోమలూ మలేరియాను వ్యాప్తి చేయవు. కేవలం అనోఫిలస్ (Anopheles) అనే జాతిలోని ఆడ దోమల వల్ల మాత్రమే మనుషులకు వ్యాధి సోకుతుంది.
- ఇతర మార్గాల ద్వారా కూడా ఈ వ్యాధి సోకవచ్చు. గర్భంలో ఉన్న శిశువుకు తల్లి నుండి వ్యాధి రావచ్చు. వ్యాధిగ్రస్తుని రక్తం ఎక్కించడం వలన, లేదా వ్యాధిగ్రస్తునికి వాడిన సిరంజిని వాడడం వలన కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
మలేరియా లక్షణాలు:
- స్పోరోజాయిట్స్ మొదట మానవుడిలో ప్రవేశించింది మొదలు మలేరియా జ్వర లక్షణాలు వచ్చే వరకు పట్టేకాలాన్ని పొదిగే కాలం అంటారు. ఇది దాదాపు 10 నుండి 14 రోజులు పడుతుంది.
- జ్వరం, చలిగా ఉండటం, వాంతులు, వికారం, ఒంటినొప్పులు, తలనొప్పి, దగ్గు మరియు డయేరియా వంటివి మలేరియా వ్యాధిలో కనిపించే కొన్ని లక్షణాలు.
- ఈ వ్యాధి వలన ఎర్ర రక్తకణాలు క్షీణించి, రక్తహీనత (Anemia) కు దారితీస్తుంది. మెదడులో రక్త నాళాల విచ్ఛిత్తి కలుగును. కాలేయంపై కూడా ప్రభావం చూపును.
- మలేరియా నివారణకు మందులు- క్వినైన్, క్లోరోక్విన్
- దోమ తెర ఉపయోగించాలి.
- దోమలను చంపడానికి ఇంట్లో దోమల మందు కొట్టాలి.
- వీలైతే తలుపులు, కిటికీలకు దోమలు రాకుండా ఆపే నెట్ లు బిగించాలి. దోమలు వచ్చి నిలవకుండా ఉండేందుకు ఫ్యాన్లు, ఎ.సి.లు ఉపయోగించాలి.
- లేత రంగులో ఉండి, శరీరాన్ని మొత్తం కప్పే బట్టలు వేసుకోవాలి.
- దోమలు కొన్ని చెట్లు, పొదల దగ్గరగా గుంపులుగా ఉంటాయి. వీలైతే, అలాంటి చోట్లకు వెళ్లకూడదు.
- నీళ్లు ఎక్కడా నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే దోమలు అక్కడ గుడ్లు పెడతాయి.
మరికొన్ని అంశాలు:
- దేశం నుండి మలేరియాను నిర్మూలించే లక్ష్యంతో NIMR (National Institute of Malaria Research ) పనిచేస్తుంది. NIMR Official Website- www.nimr.org.in
వీటిని కూడా చూడండీ: