Malaria Disease |
అనోఫిలస్ (Anopheles) అనే జాతిలోని ఆడ దోమల వల్ల మనుషులకు సోకే వ్యాధి
మలేరియా (Malaria):- మలేరియా అనే పేరు మల అరియ (Mala Aria) అనే ఇటాలియన్ పదం నుండి పుట్టింది. మల అరియ అంటే చెడిపోయిన గాలి (Bad Air) అని అర్ధం. చిత్తడి నేల ఉన్న చోట్ల మలేరియా అధికంగా ఉండటం వలన ఈ జ్వరాన్ని చిత్తడి జ్వరం (Marsh Fever) అని కూడా పిలిచేవారు.
- ప్లాస్మోడియం (Plasmodium- మలేరియాకు కారణమైన ఏకకణ సూక్ష్మజీవి) అనే పరాన్నజీవి (Parasite- ఇతరులపై ఆధారపడి జీవించే జీవి) వ్యాప్తి వల్ల సోకే మలేరియా, ఒక అంటు వ్యాధి.
- ఈ మలేరియా వ్యాధినే ప్లాస్మోడియం సంక్రమణ (Plasmodium Infection) అని కూడా అంటారు.
- మలేరియా ప్రాణాంతకమైన వ్యాధి అయినప్పటికీ దీనిని నయం మరియు నివారణ చేయవచ్చు.
- 1880లో మలేరియా పరాన్న జీవిని కనిపెట్టిన వ్యక్తి- చార్లెస్ లావిరన్ (Charles Louis Alphonse Laveran). ఇందుకు గాను ఇతనికి 1907లో వైద్య శాస్త్రంలో నోబల్ బహుమతి వచ్చింది.
- పాట్రిక్ మాన్సన్ (Patrick Manson) 1894లో దోమలు మలేరియాను వ్యాప్తి చేస్తాయని భావించారు.
- 1897లో సర్ రోనాల్డ్ రాస్ (Sir Ronald Ross) దోమలు (ఆడ ఎనాఫిలస్) మలేరియాను వ్యాప్తి చేస్తాయని నిరూపించాడు. ఈ పరిశోధన సికింద్రాబాద్ లో జరిగింది. ఇందుకు గాను ఇతనికి 1902 లో వైద్య శాస్త్రంలో నోబల్ బహుమతి వచ్చింది.
- చైనీస్ సాంప్రదాయ ఔషధ పరిశోధకుడు తుయుయు (Tu Youyou) 2015 లో యాంటీమలేరియల్ డ్రగ్ ఆర్టెమిసినిన్ (Artemisinin) పై చేసిన కృషికి వైద్య శాస్త్రంలో నోబల్ బహుమతి వచ్చింది.
మైక్రోస్కోపులో చూసినప్పుడు మలేరియా పరాన్నజీవి |
మలేరియా ఎలా వస్తుంది?
- మలేరియా వ్యాప్తి సాధారణంగా దోమకాటు వలన జరుగుతుంది. మనిషిని కుట్టినప్పుడు లాలాజలాన్ని వదులుతుంది. ఆ లాలాజలములో స్పోరోజాయిట్స్ ఉంటాయి. అవి మనిషి శరీరములోకి ప్రవేశిస్తాయి, అక్కడ నుండి అవి మీరోజాయిట్స్ గా కాలేయము, ఎర్ర రక్త కణాలలో పరిణతి చెందుతాయి. ఇలా పరిణతి చెందిన మీరోజాయిట్స్ వల్ల వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.
- అంటే ఈ సూక్ష్మజీవులు రక్తంలో నుండి కాలేయ కణాల్లోకి (Liver Cells) ప్రవేశిస్తాయి. అక్కడ వాటి సంఖ్య వృద్ధి చెందుతుంది.
- కాలేయ కణాలు పగిలినప్పుడు, ఈ సూక్ష్మ జీవులు బయటకు వచ్చి రక్త కణాల్లోకి ప్రవేశిస్తాయి. అక్కడ మళ్లీ వీటి సంఖ్య వృద్ధి చెందుతుంది.
- ఎర్రరక్త కణాలు పగిలినప్పుడు బయటకు వచ్చి మరిన్ని రక్తకణాల్లోకి ప్రవేశిస్తాయి.
- ఎర్రరక్త కణాల్లోకి ప్రవేశించడం, అవి పగిలిపోవడం జరుగుతూనే ఉంటుంది. ఎర్రరక్త కణాలు పగిలిన ప్రతీసారి వ్యాధి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి.
- అయితే అన్ని దోమలూ మలేరియాను వ్యాప్తి చేయవు. కేవలం అనోఫిలస్ (Anopheles) అనే జాతిలోని ఆడ దోమల వల్ల మాత్రమే మనుషులకు వ్యాధి సోకుతుంది.
- ఇతర మార్గాల ద్వారా కూడా ఈ వ్యాధి సోకవచ్చు. గర్భంలో ఉన్న శిశువుకు తల్లి నుండి వ్యాధి రావచ్చు. వ్యాధిగ్రస్తుని రక్తం ఎక్కించడం వలన, లేదా వ్యాధిగ్రస్తునికి వాడిన సిరంజిని వాడడం వలన కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
మలేరియా లక్షణాలు:
- స్పోరోజాయిట్స్ మొదట మానవుడిలో ప్రవేశించింది మొదలు మలేరియా జ్వర లక్షణాలు వచ్చే వరకు పట్టేకాలాన్ని పొదిగే కాలం అంటారు. ఇది దాదాపు 10 నుండి 14 రోజులు పడుతుంది.
- జ్వరం, చలిగా ఉండటం, వాంతులు, వికారం, ఒంటినొప్పులు, తలనొప్పి, దగ్గు మరియు డయేరియా వంటివి మలేరియా వ్యాధిలో కనిపించే కొన్ని లక్షణాలు.
- ఈ వ్యాధి వలన ఎర్ర రక్తకణాలు క్షీణించి, రక్తహీనత (Anemia) కు దారితీస్తుంది. మెదడులో రక్త నాళాల విచ్ఛిత్తి కలుగును. కాలేయంపై కూడా ప్రభావం చూపును.
- మలేరియా నివారణకు మందులు- క్వినైన్, క్లోరోక్విన్
- దోమ తెర ఉపయోగించాలి.
- దోమలను చంపడానికి ఇంట్లో దోమల మందు కొట్టాలి.
- వీలైతే తలుపులు, కిటికీలకు దోమలు రాకుండా ఆపే నెట్ లు బిగించాలి. దోమలు వచ్చి నిలవకుండా ఉండేందుకు ఫ్యాన్లు, ఎ.సి.లు ఉపయోగించాలి.
- లేత రంగులో ఉండి, శరీరాన్ని మొత్తం కప్పే బట్టలు వేసుకోవాలి.
- దోమలు కొన్ని చెట్లు, పొదల దగ్గరగా గుంపులుగా ఉంటాయి. వీలైతే, అలాంటి చోట్లకు వెళ్లకూడదు.
- నీళ్లు ఎక్కడా నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే దోమలు అక్కడ గుడ్లు పెడతాయి.
మరికొన్ని అంశాలు:
- దేశం నుండి మలేరియాను నిర్మూలించే లక్ష్యంతో NIMR (National Institute of Malaria Research) పనిచేస్తుంది. NIMR Official Website- www.nimr.org.in
వీటిని కూడా చూడండీ:
- ప్రపంచ మలేరియా దినోత్సవం (World Malaria Day)
- వ్యాధులు (Diseases)
- ముఖ్యమైన దినోత్సవాలు (Important Days)