History of Civil Services Day in Telugu | సివిల్ సర్వీసెస్ దినోత్సవం |
సివిల్ సర్వీసెస్
దినోత్సవం - ఏప్రిల్ 21
ఉద్దేశ్యం:
సివిల్ సర్వీస్ అధికారులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, తద్వారా ప్రజలు వారివారి ప్రాథమిక హక్కులను పొందేలా చూడాలన్న ఉద్దేశ్యంతో సివిల్ సర్వీసెస్ దినోత్సవం (Civil Services Day) ను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
ఎప్పటి నుంచి?
2006 నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21 వ తేదీన సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
మొదటి దినోత్సవం 21 ఏప్రిల్ 2006 న న్యూడిల్లీలోని విజ్ఞన్ భవన్‌లో (Vigyan Bhawan) జరిగింది.
ఏప్రిల్ 21 నే ఎందుకు?
- భారతదేశపు మొదటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ డిల్లీలోని మెట్‌కాల్ఫ్ హౌస్ (Metcalf House) లో స్వతంత్ర భారతదేశంలో మొదటి బ్యాచ్ సివిల్ సర్వెంట్లను ఉద్దేశించి 21 ఏప్రిల్ 1947 న ప్రసంగించాడు.
- తన ప్రసంగంలో సివిల్ సర్వెంట్లను స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా (Steel Frame Of India) అని పేర్కొన్నాడు.
- పటేల్ ప్రసంగించిన ఈ రోజు జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21 వ తేదీన సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
Prime Minister Award for Excellence in Public Administration:
- 2006 నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఉత్తమ సేవలు అందించిన వారికి ఈ అవార్డులను ఇవ్వడం జరుగుతుంది.
- ఈ అవార్డులకు వ్యక్తిగతంగా లేదా సమూహంగా లేదా సంస్థగా ఉన్న ప్రతినిధులందరు అర్హులు. వ్యక్తిగత బహుమతి లక్ష, సంస్థలకైతే బహుమతి ఐదు లక్షలు ఉంటుంది.
- ఈ అవార్డులను మూడు విభాగాలలో ప్రదానం చేస్తారు. అవి,
- ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు మరియు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ మరియు జమ్మూ కాశ్మీర్ అనే మూడు కొండలు ఎక్కువగా ఉండే రాష్ట్రాలు
- కేంద్రపాలిత ప్రాంతాలు
- పై వాటిని మినహాయించి భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాలు
కార్యక్రమాలు:
- పౌర సేవల విషయంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవటానికి భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలోనన్న అంశంపై పౌర సేవల ఉద్యోగులకు శిక్షణా కార్యాక్రమాలు నిర్వహించబడుతాయి.
- పౌర సేవల గురించి, పౌరుల హక్కుల గురించి గ్రామస్థాయిలో గ్రామస్తులకు, విద్యార్థులకు అవగాహన కలిపిస్తారు.
సివిల్ సర్వెంట్లు (Civil Servants):
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ దేశంలో పౌర పాలనకు సారథ్యం వహిస్తున్నవారు సివిల్ సర్వీస్ అధికారులు. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాలు ప్రగతి బాటలో ముందడుగు వేయాలంటే సివిల్ సర్వెంట్ల సేవలు ఎంతో కీలకం. వీరు తెరముందు ప్రముఖంగా కనబడకపోయినా ప్రభుత్వాలు అమలు చేసే ప్రతి కార్యక్రమంలోనూ వీరి శ్రమ దాగి ఉంటుందనడంలో సందేహం లేదు. సంక్షేమ కార్యక్రమాలకు ప్రాణం పోసి, వాటిని ప్రజల దరికి చేరేలా తీర్చిదిద్ది అభివృద్ధికి ఊపిరి పోయాల్సిన బాధ్యత వీరిపై ఉంది. ఎన్నో పథకాలను అమలు పరచి ప్రజాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాల్సిన సివిల్ సర్వెంట్లు ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ప్రభుత్వ ధనం వృథా పోతుంది.
ప్రభుత్వ సర్వీసులు:
ప్రభుత్వ సర్వీసులను మూడు రకాలుగా వర్గీకరించారు. అవి,
- అఖిల భారత సర్వీసులు (All India Services)
- కేంద్ర సర్వీసులు (Cantral Services)
- రాష్ట్ర సర్వీసులు (State Services)
అఖిల భారత సర్వీసులు:
ఈ సర్వీసులు కేంద్ర, రాష్ట్రాలకు ఉమ్మడిగా వర్తిస్తాయి. ఈ సర్వీసులకు ఎంపికైన వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నత పదవులలో నియమించబడతారు. ఒకప్పుడు ప్రధాన పాలనా శాఖలన్నింటిలో అఖిల భారత సర్వీసులు ఉండేవి. ప్రస్తుతం 3 అఖిల భారత సర్వీసులున్నాయి.
- ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS)
- ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS)
- ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS)
- 1946 అక్టోబర్ లో ఇండియన్ సివిల్ సర్వీసెస్‌లో (ICS) స్థానంలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) ను ప్రవేశపెట్టారు.
- ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) ను 1966 లో ఏర్పాటు చేశారు.
- లండన్ లో 1854 లో సివిల్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయబడింది. 1855 లో పోటీ పరీక్షలు ప్రారంభించబడ్డాయి. ప్రారంభంలో ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షలు లండన్ లో మాత్రమే జరిగేవి. 1922 నుండి ఈ పరీక్షలను భారతదేశంలోనే నిర్వహించడం మొదలు పెట్టారు.
మరికొన్ని అంశాలు:
- ఇండియన్ సివిల్ సర్వీసెస్‌లో (ICS) చేరిన తొలి భారతీయుడు- సత్యేంద్రనాథ్ ఠాగూర్ (1863లో)
- భారతదేశ (బ్రిటిష్ ఇండియా) మొట్టమొదటి మహిళా IAS ఆఫీసర్- ఇషా బసంత్ జోషి
- భారతదేశ స్వాతంత్ర్యం అనంతరం మొట్టమొదటి మహిళా IAS ఆఫీసర్- అన్నా రాజం మల్హోత్రా. 1951లో ఆమె సివిల్ సర్వీస్‌లో చేరి మద్రాస్‌లో పనిచేసింది.
- మొట్టమొదటి మహిళా ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి- కిరణ్ బేడి. ఈమె1975 లో తన సేవను ప్రారంభించింది.
- సుభాస్ చంద్రబోస్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ కు ఎంపికై, ఆ పరీక్షలో నాల్గవ స్థానంలో నిలిచాడు. కాని అతను బ్రిటిష్ వారి ప్రభుత్వంలో పనిచేయడానికి ఇష్టపడలేదు. అతను 1921 లో ఇండియన్ సివిల్ సర్వీసుకు రాజీనామా చేశాడు.
- ఇండియన్ సివిల్ సర్వీసెస్ పితామహుడు- కారన్ వాలీస్ (Cornwallis)
వీటిని కూడా చూడండీ: