Monday, February 13, 2023

History of Radio in Telugu | రేడియో చరిత్ర


HISTORY OF RADIO
రేడియో చరిత్ర
****

రేడియో (Radio):
  • కాంతి వేగ పౌనఃపున్యాల (Frequency) తో విద్యుత్‌ అయస్కాంత (Electro Magnetic) తరంగాలను మాడ్యులేషన్ చేయటం ద్వారా తీగల ఆధారము లేకుండా గాలిలో శబ్ద సంకేతాలను ప్రసారం చేయు ప్రక్రియను దూర శ్రవణ ప్రక్రియ (Radio Transmission) అంటారు. ఇలాంటి ప్రసారాలను వినటానికి ఉపయోగించే సాధనాన్ని రేడియో (Radio) అంటారు.
  • ఇంటర్నెట్, టీవీలు, ఓటీటీలు ఇవేవీ లేని రోజుల్లో రేడియో ఒక్కటే వార్తలను వినోదాన్ని అందించిన ఏకైక సాధనంగా ప్రజల మన్ననలు చూరగొంది. రేడియో ఎన్నో సంచలనాలు సృష్టించింది. స్వాతంత్ర పోరాటంలో, పలు ప్రజా ఉద్యమాల్లో రేడియో ప్రజలకు బాగా చేరువైంది. రోజూ నాలుగు పూటలా పలు భాషల్లో వార్తలను ప్రసారం చేస్తూనే, పాటలు, జానపద గీతాలు, శాస్త్రీయ లలిత సంగీతం వ్యవసాయ కార్యక్రమాలు, క్విజ్, కథానిక, సినిమా ఆడియోలు ఇలా అన్నింటినీ సమపాళ్లలో ప్రసారం చేసిన రేడియో ప్రజల మనసును ఆకట్టుకుంది. ఓ రెండు దశాబ్దాల క్రితం వరకు పెద్దా చిన్నా అందరికీ అత్యంత ఇష్టమైన వ్యాపకం రేడియో వినటం.

రేడియో పుట్టుక:
  • విద్యుదయస్కాంత శక్తి గల రేడియో తరంగాలను తొలుత జర్మన్ భౌతిక శాస్త్రవేత్త హెన్రిచ్ హెర్ట్జ్ (Heinrich Hertz) 1886 లో గుర్తించాడు. 
  • రేడియో తరంగాలను తొలిసారిగా గుర్తించిన హెన్రిచ్ హెర్ట్జ్ పేరిట రేడియో తరంగాల Frequency ని హెర్ట్జ్ (Hertz) లతో కొలవడం మొదలైంది.
  • 1895 - 96 నాటికి రేడియో తరంగాల ద్వారా ప్రసారాలను ఆచరణలో సాధించిన వాడు ఇటాలియన్ శాస్త్రవేత్త గుగ్లిఎల్మో మార్కోనీ (Guglielmo Marconi
  • అమేరికాలోని పిట్స్‌బర్గ్ లో నెలకొల్పిన తొలి రేడియో ప్రసార కేంద్రం 1920 నవంబరు 2 న ప్రారంభమైంది. అమెరికా అధ్యక్షుడిగా హార్డింగ్ ఎన్నికయ్యారనే వార్తతో పిట్స్‌బర్గ్ కేంద్రం నుంచి ప్రపంచంలోనే తొలిసారిగా రేడియో వార్తా ప్రసారం మొదలైంది. 
  • ఇంగ్లాండ్ లో 1922 అక్టోబర్ 18 న బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (BBC - British Broadcasting Corporation) స్థాపించబడింది. BBC 1922 నవంబరు 14 నుంచి లండన్ కేంద్రంగా తన ప్రసారాలను ప్రారంభించింది. 
  • రేడియో ప్రసారాలను ఐక్యరాజ్య సమితి పరిధిలోని ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ (ITU- International Telecommunication Union) నియంత్రిస్తుంది.

భారతదేశంలో రేడియో చరిత్ర:
ఆల్ ఇండియా రేడియో (All India Radio):
  • 1923 లో రేడియో క్లబ్ ఆఫ్ బాంబే దేశంలోనే తొలిసారిగా రేడియో ప్రసారాలను ప్రారంభించింది.
  • 23 జూలై 1927 న బ్రిటిష్ హయాంలో తొలి రేడియో స్టేషన్ బాంబేలో ప్రారంభమైంది. ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ నెలకొల్పిన ఆ రేడియో స్టేషన్‌ను అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రారంభించారు.
  • 1936 లో ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ పేరు ఆలిండియా రేడియోగా మారింది.
  • ఆలిండియా రేడియో అధికారికంగా 1956 నుండి ఆకాశవాణిగా పిలువబడుతుంది.
  • AIR నినాదం (Motto) – 'Bahujan Hitaya : Bahujan Sukhaya'
  • ఆలిండియా రేడియో ప్రభుత్వ ఆధికారిక రేడియో ప్రసార సంస్థ. ఇది భారత ప్రభుత్వ సమాచార, ప్రసార యంత్రాంగ ఆధ్వర్యములో స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రసార భారతి యొక్క విభాగము. దూరదర్శన్ కూడా ప్రసార భారతిలో భాగమే. దేశాభివృద్ధిలో ప్రభుత్వాధీనంలో ఉన్న రేడియో, అన్ని రంగాలలోను సమాచారాన్ని ఇస్తూ దేశ సమగ్రతకూ, అభివృద్ధికి ఎంతగానో ఉపయోగ పడుతోంది.
  • స్వాతంత్ర్యం వచ్చే నాటికి మన దేశంలో 6 ఆలిండియా రేడియో కేంద్రాలు మాత్రమే ఉండేవి. అవి: బొంబాయి, కలకత్తా, ఢిల్లీ, మద్రాసు, తిరుచిరాపల్లి, లక్నో కేంద్రాలు. ప్రస్తుతం (2023 నాటికి) దేశవ్యాప్తంగా 479 ఆలిండియా రేడియో కేంద్రాలు పని చేస్తున్నాయి.
  • AIR యొక్క 100వ స్టేషన్ - వరంగల్ (మార్చి 2, 1990)
దక్కన్ రేడియో:
  • హైదరాబాద్ లో మహబూబ్ అలీ అనే తపాలా ఉద్యోగి 1933 లో రేడియో స్టేషన్‌ను ప్రారంభించారు. 
  • 1935 లో ఈ రేడియో స్టేషన్‌ను అప్పట్లో హైదరాబాదును పరిపాలిస్తున్న నిజాం రాజు స్వాధీనం చేసుకున్నాడు.
  • 1939 లో హైదరాబాద్ రేడియో స్టేషన్ కు దక్కన్ రేడియోగా పేరు మార్చారు.
  • హైదరాబాద్ రేడియో స్టేషన్ నుంచి అప్పట్లో జరిగే ప్రసారాలు ఎక్కువగా ఉర్దూలో ఉండేవి.
  • దక్కన్ రేడియో నుంచి తెలుగు, కన్నడ, మరాఠీ భాషల్లో కూడా పరిమిత ప్రసారాలు సాగేవి. దక్కన్ రేడియోలో తెలుగు కార్యక్రమాలను పెంచేందుకు మాడపాటి హనుమంతరావు విశేషంగా కృషి చేశారు.
  • 1950 లో భారత ప్రభుత్వం డెక్కన్ రేడియోను నిజాం నుంచి స్వాధీనం చేసుకుని, ఆలిండియా రేడియో పరిధిలోకి తెచ్చింది.

తెలుగులో రేడియో ప్రసారాలు:
  • 1938 జూన్ 16 న మద్రాసులో రేడియో స్టేషన్ ప్రారంభం కావడంతో అప్పటి నుంచి తెలుగులో రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. 
  • రేడియో కార్యక్రమాల్లో భాగంగా తొలి తెలుగు ప్రసంగం చేసిన ఘనత గిడుగు రామమూర్తి పంతులుకు దక్కుతుంది. సజీవమైన తెలుగు అనే అంశంపై గిడుగు 1938 జూన్ 18 న పదిహేను నిమిషాల ప్రసంగం చేశారు.
  • మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమైన తొలి తెలుగు నాటకం - అనార్కలి. ఇది 1938 జూన్ 24 న రాత్రి 8:30 గంటలకు ప్రసారమైంది.
  • మద్రాసు కేంద్రం నుంచి తొలి తెలుగు వ్యాఖ్యాతగా మల్లంపల్లి ఉమామహేశ్వరరావు పనిచేశారు. పిల్లల కార్యక్రమాల ద్వారా ఆయన రేడియో తాతయ్యగా ప్రసిద్ధి పొందారు.
  • 1948 డిసెంబరు 1 న విజయవాడలో రేడియో స్టేషన్ ప్రారంభమైంది.
  • 1963 లో విశాఖపట్నం, కడపలలో ఆలిండియా రేడియో స్టేషన్లు ప్రారంభమయ్యాయి.

FM రేడియో:
  • FM (Frequency Modulation) రేడియో చానెల్స్ కు పరిమిత ప్రాంతంలోని ప్రజల అభిరుచులు, సంస్కృతి ముఖ్యం. అనేక ప్రైవేట్ సంస్థలు దేశవ్యాప్తంగా FM రేడియో ఛానెళ్లను ప్రారంభించాయి మరియు ఆకాశవాణి వివిధ భారతి FM లను కూడా ప్రారంభించింది.
  • FM ఛానెల్‌ల ప్రసార కవరేజీ 200 కిలోమీటర్లు మరియు అంతకంటే తక్కువ.
  • భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ FM రేడియో స్టేషన్ - రేడియో సిటీ బెంగళూరు (2001 జూలై 3 న ప్రారంభమైంది)

మరికొన్ని అంశాలు:
  • దూరదర్శన్ (Television) సేవలను 1976 ఏప్రిల్ 1 లో రేడియో నుంచి విడదీసారు. (1959 సెప్టంబరు 15 న టెలివిజన్ సేవలు ఒక చిన్న ట్రాన్స్‌మీటర్ తో మొదలైనాయి)

వీటిని కూడా చూడండీ:


No comments:

Post a Comment