History of International Migrants Day in Telugu | అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం - డిసెంబర్ 18 |
అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం - డిసెంబర్ 18
ఉద్దేశ్యం:
- వలసదారుల రక్షణ చట్టాలు మరియు హక్కుల గురించి అవగాహన పెంచడం అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం (International Migrants Day) యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
ఎప్పటి నుంచి?
- 1997 నాటికి కొన్ని ఆసియా వలస సంస్థలు డిసెంబర్ 18 ను వలసదారుల హక్కులు, రక్షణ మరియు గౌరవాన్ని గుర్తించే రోజుగా గుర్తించాయి.
- 2000 డిసెంబర్ 4 న యుఎన్ జనరల్ అసెంబ్లీ ప్రపంచ వ్యాప్తంగా అంతర్గత మరియు అంతర్జాతీయంగా వలస వెళ్తున్న పౌరులందరి కోసం డిసెంబర్ 18 ను అంతర్జాతీయ వలసదారుల దినోత్సవంగా ప్రకటించింది.
డిసెంబర్ 18నే ఎందుకు?
- ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పెరుగుతున్న వలసలను పరిగణనలోకి తీసుకున్న ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ (United Nations General Assembly) 1990 డిసెంబర్ 18న జరిగిన సమావేశంలో వలసకార్మికులు, వారి కుటుంబ సభ్యుల హక్కుల రక్షణ కోసం ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
- అందువల్ల డిసెంబర్ 18న అంతర్జాతీయ వలసదారుల దినోత్సవంగా జరుపుకుంటాము.
థీమ్ (Theme):
- 2020: Reimagining Human Mobility
- 2019: We Together
- 2018: Migration with Dignity (గౌరవంతో వలస)
- 2017: Safe Migration in a World on the Move
వలసదారులు అంటే?
- జన్మించిన ప్రాంతం వదిలి వేరే ప్రాంతాలకు శాశ్వతంగా లేదా తాత్కాలికంగా వెళ్ళడాన్ని వలస అంటారు. ఇలా వలస వెళ్ళేవారిని వలసదారులు అంటారు.
గణాంకాలు:
- 2019 లో ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ వలసదారుల సంఖ్య (వారి జన్మించిన దేశం కాకుండా వేరే దేశంలో నివసిస్తున్న ప్రజలు) - 272 మిలియన్లు లేదా 27.2 కోట్లు (2017 లో 258 మిలియన్లు)
- ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ వలసదారులలో సుమారు 31% ఆసియాలో, 30% ఐరోపాలో, అమెరికాలో 26%, ఆఫ్రికాలో 10% మరియు ఓషియానియాలో 3% మంది నివసిస్తున్నారు.
- అంతర్జాతీయంగా వలస వెళ్లుతున్న వారిలో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు.
- 2019 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వలసదారుల్లో 1.80 కోట్ల మంది భారతీయులేనని మైగ్రేంట్స్ రైట్ కౌన్సిల్ ఇండియా అధ్యక్షుడు పి.నారాయణస్వామి తెలిపారు.
- అలాగే మెక్సికో 1.18 కోట్లు, చైనా 1.07 కోట్లు, రష్యా 1.05 కోట్లు, సిరియా 82 లక్షలు, బంగ్లాదేశ్ 78 లక్షలు, పాకిస్థాన్ 63 లక్షలు, ఉక్రేయిన్ 59 లక్షలు, ఫిలిప్సీన్స్ 54 లక్షలు, ఆఫ్గానిస్థాన్ 51 లక్షలు ఇలా వివిధ దేశాల ప్రజలు వలసబాట పట్టుతున్నట్లుగా ఐక్యరాజ్యసమితి గణాంకాలు తెలుపుతున్నాయి.
భారతదేశానికి వచ్చిన సంపద:
- వలసదారుల వల్ల మన దేశానికీ చేరుతున్న సంపద 125000 కోట్లు (2019లో).
- ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ దేశాలకు చెందిన ప్రవాసులు తమ మాతృదేశాలకు ప్రతి ఏటా పంపించే మొత్తం సొమ్ము అక్షరాల 689 బిలియన్ డాలర్లు. ఇందులో భారత ప్రవాసీయులు పంపిస్తున్నది 78 బిలియన్ డాలర్లు. 2010 లో 53 బిలియన్ డాలర్లు, 2015లో 68.91 బిలియన్ డాలర్లు.
వలసలు రెండు రకాలు:
- పని కోసం, బతుకుదెరువు కోసం పల్లెల నుంచి పట్టణాలకు, నగరాలకు గానీ, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి గానీ వెళ్లడాన్ని అంతర్గత వలసలు అంటారు.
- ఒకదేశం నుంచి మరొక దేశానికి వెళ్లడాన్ని అంతర్జాతీయ వలసలు అంటారు.
వలసలకు కారణాలు:
- వలసలు లేనిదే అభివృద్ధి, మానవ వికాసం లేదు. వలసలకు, అభివృద్ధికి సంబంధం ఉన్నది. మానవ వలస అనేది ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్న ప్రక్రియ.
- వలసలకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి.
- వలస వెళ్లేలా నెట్టివేయబడే పరిస్థితులు. స్థానిక ప్రదేశంలోని అననుకూల పరిస్థితులు ప్రజలను బయటకు నెట్టివేస్తాయి.
- ఉదాహరణకు.. అణచివేసే చట్టాలు, అధిక పన్నుల భారం, మతకల్లోలాలు, అంతర్యుద్ధాలు, పేదరికం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లడం, ప్రకృతి వైపరీత్యాలు, భారీ ప్రాజెక్టుల కోసం గ్రామాలను ఖాళీ చేయించడం (డిస్‌ప్లేస్మెంట్) అనే అంశాలు ప్రేరేపిస్తాయి.
(2) పుల్ ఫ్యాక్టర్:
- వలస వెళ్లేలా ఆకర్షింపబడే పరిస్థితులు. అధిక వేతనాలు మరింత మెరుగైన జీవనం కోసం, బాహ్య ప్రదేశంలోని అనుకూల పరిస్థితులు వారిని ఆకర్షిస్తాయి. సంపన్న దేశంలో మంచి జీతం కలిగిన ఉద్యోగం అంతర్జాతీయ వలసల శక్తివంతమైన ఆకర్షణకు కారణం.
వలసదారుల సమస్యలు:
- పౌరసత్వం, వలసల విధానంలో ఆయా దేశాల మధ్య స్థానికత పేరుతో, అక్రమ వలసల పేరుతో కొన్ని దేశాల్లో వలుసదారులు ఇబ్బందులకు గురౌతున్నారు. వారి సంక్షేమానికి ప్రపంచ దేశాలు ఉమ్మడిగా పాటుపడాల్సి ఉంది.
భారతదేశంలో వలసలు:
- భారతదేశంలో పల్లెల నుంచి పట్టణాలకు పెద్దయెత్తున వలసలు పెరుగుతున్నాయని, వలసదారుల్లో ఎక్కువమంది ఉపాధి వేటలో ఉన్న యువజనులేనని వివిధ సంస్థల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
- 2001 జనగణన ప్రకారం అంతరాష్ట్ర వలసదారుల సంఖ్య 31.45 కోట్లయితే.. ఇది 2011 జనగణన నాటికి 45.36 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం ఏటా కోటీ 40 లక్షల మంది ఉన్న చోటు వదిలి వేరే చోట్లకు తరలిపోతున్నారని గణాంకాలు తెలుపుతున్నాయి.
- 2001-2011 మధ్య మొత్తం అంతర్రాష్ట్ర వలసదారుల సంఖ్య 5.5 కోట్లు. అంటే ఏడాదికి కనీసం 50 లక్షల మంది వలసపోయారన్న మాట.
- ప్రధానంగా దుర్భిక్ష, వరద పీడిత ప్రాంతాల నుంచి, జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి వలసలు వెల్లువెత్తుతున్నాయి. తరచుగా రాజకీయ, సాంఘిక సంఘర్షణలకు లోనయ్యే ప్రాంతాల నుంచీ ఎక్కువమంది వలసపోతుంటారు. పేదరికం, స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడం, పట్టణాల్లో, ఇతర రాష్ట్రాల్లో పని దొరికే అవకాశం-ఇవన్నీ కలసి గ్రామీణ జనాభాను వలసలకు ప్రేరేపిస్తున్నాయి.
భారతీయుల వలసలను తగ్గించడం ఎలా?
- అభివృద్ధి చెందుతున్న దేశాలనుంచి చాలామంది అభివృద్ధి చెందిన సంపన్న దేశాలకు వలస వెళ్ళుతున్నారు.
- భారతదేశం అభివృద్ధి చెందుతున్నప్పటికీ విద్య ఉపాధి, ఉద్యోగ రంగాల్లో వెనకబడి పోవడం వలన ప్రజలు ఉపాధి, ఉద్యోగం, చదువుల కోసం విదేశాలకు వలసలు వెళుతున్నారు.
- పాలకులు మన దేశంలోని సహజ వనరులను సరిగా ఉపయోగంచుకుంటూ ప్రపంచంలోనే యువ జనాభా ఎక్కువ గల మన వారికి అన్ని రంగాల్లో అవకాశాలను మెరుగుపరచాలి.
- వారి మేథాశక్తిని ఇక్కడే ఉపయోగించుకోవాలి. మేథాశక్తికి తగిన గుర్తింపు, ప్రోత్సాహం ఇస్తూ ప్రభుత్వ విధానాల రూపకల్పన జరగాలి. భారతీయుల మేథా సంపత్తి మన దేశానికే ఉపయోగపడి దేశాభివృద్ధికి తోడ్పడేలా ప్రభుత్వాలు నిధులు కేటాయించి పరిశ్రమలు స్థాపించాలి.
- మన దేశంలో వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధిని పెంచాలి.
- నేటి భారతీయ యువత ధనార్జనే ధ్యేయంగా విదేశాల వలస బాట పట్టకుండా స్వదేశంలోని పేద ప్రజల అభివృద్ధికి, దేశం సర్వతోముఖ వికాసానికి తోడ్పాటునందించాల్సి ఉందని గమనించాలి.
- భారతదేశ ప్రగతికి అంతర్రాష్ట్ర కార్మిక వలసలు అవసరం కాబట్టి ఇవి ఇప్పట్లో ఆగవు. వీరు జాతీయాదాయ వృద్ధికి ఎంతో తోడ్పడుతున్నారు. అలాగని వారి శ్రమదోపిడి నిరంతరం కొనసాగరాదు. వలసల సమస్యను ఎదుర్కోవాలంటే గ్రామాల్లో స్త్రీలు, యువతకు స్థానిక ఉపాధి అవకాశాలను విస్తరించడం ద్వారా వలసలను చాలావరకు తగ్గించవచ్చు.
వలస కార్మిక చట్టాలు:
అంతర్రాష్ట్ర వలస కార్మిక చట్టం -1979:
- వలస కార్మికుల ప్రయోజనాల సంరక్షణకు 1979 లోనే ఒక చట్టం వచ్చింది. దాన్ని అంతర్రాష్ట్ర వలస కార్మిక చట్టంగా వ్యవహరిస్తున్నారు.
- కార్మికులకు చెల్లించాల్సిన వేతనాలను నిర్ణయించడం తోపాటు వారి యోగక్షేమాలను కూడా ఈ చట్టం పట్టించుకొంటోంది. వారికి ఉద్యోగ భద్రత కల్పించడానికి, పని పరిస్థితులు మెరుగుపరచడానికి, శ్రమ దోపిడిని నిరోధించడానికి కొన్ని నియమ నిబంధనలను ఈ చట్టంలో పొందుపరిచారు.
ఖతార్‌లో వలస కార్మిక చట్టాలు:
- ఖతార్‌లో వలస కార్మిక చట్టాలు అత్యంత కఠినంగా ఉంటాయి. అక్కడ దశాబ్దాలుగా ఖఫాలా అనే కార్మిక విధానం అమల్లో ఉంది.
- దీని ప్రకారం వలస కార్మికులెవరైనా ఉద్యోగం మానేయాలంటే ముందు యజమాని అనుమతి తీసుకోవాలి. అంతేకాదు, దేశం వదిలి వెళ్లాలన్నా యజమాని పర్మిషన్ తప్పనిసరి.
- అయితే, 2019 డిసెంబర్‌లో ఖఫాలా విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ఖతార్ ప్రకటించింది. ఇప్పుడు మరికొన్ని నిబంధనలను సడలించిందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. వాటి ప్రకారం.
- జాతితో సంబంధం లేకుండా అందరికీ కనీస వేతనాలు ఇవ్వడం.
- ఖతార్ వదిలి వెళ్లడంపై కార్మికులకు స్వేచ్ఛ (ఇదివరకు యజమానులు అనుమతిస్తేనే వెళ్లాలి)
- వలస కార్మికులకు ధ్రువీకరణ పత్రాలను కంపెనీలు కాకుండా ప్రభుత్వమే జారీ చేస్తుంది.
- కార్మికులు-కంపెనీల మధ్య జరిగే పని ఒప్పందాలను కేంద్ర సంస్థ నిత్యం పర్యవేక్షిస్తుంది.
- పనిచేసే చోట ఉద్యోగుల కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు.
International Organization for Migration (IOM):
- వలస యొక్క క్రమబద్ధమైన మరియు మానవీయ నిర్వహణను నిర్ధారించడానికి, వలస సమస్యలపై అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడానికి, వలస సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాల అన్వేషణలో సహాయపడటానికి మరియు శరణార్థులు మరియు అంతర్గతంగా స్థానభ్రంశం చెందిన వ్యక్తులతో సహా అవసరమైన వలసదారులకు మానవతా సహాయం అందించడానికి IOM పనిచేస్తుంది.
- ఇది అంతర ప్రభుత్వ సంస్థ (intergovernmental organization)
- సెప్టెంబర్ 2016 లో IOM ఐక్యరాజ్యసమితి యొక్క సంబంధిత సంస్థగా మారింది.
- ఇది రెండవ ప్రపంచ యుద్ధం ద్వారా స్థానభ్రంశం చెందిన ప్రజలను పునరావాసం కల్పించడంలో సహాయపడటానికి 1951లో Intergovernmental Committee for European Migration (ICEM) గా స్థాపించబడింది.
- 1951 లో ఇది మొదట ఐరోపా నుండి వలస వచ్చినవారి ఉద్యమానికి తాత్కాలిక ఇంటర్‌గవర్నమెంటల్ కమిటీ (PICMME- Provisional Intergovernmental Committee for the Movement of Migrants from Europe) గా పిలువబడింది.
- 1952 లో PICMME నుండి Intergovernmental Committee for European Migration (ICEM) గా
- 1988 లో Intergovernmental Committee for Migration (ICM) గా
- 1989 లో International Organization for Migration (IOM) గా చివరిసారి పేరు మార్చుకుంది.
International Organization for Migration (IOM ) |