ప్రకృతి వైపరీత్యాలు, సంఘర్షణలు లేదా ఇతర సంక్షోభాల కారణంగా ఇతర దేశాలలో చిక్కుకుపోయిన పౌరులను రక్షించడం మరియు వారిని సురక్షితంగా తిరిగి స్వదేశానికి తీసుకురావడం మరియు ప్రభావిత దేశాలలో సహాయ చర్యలు అందించేందుకు భారత ప్రభుత్వం గతంలో అనేక విజయవంతమైన ఆపరేషన్లు మరియు మిషన్లను చేపట్టింది. వాటిలో ముఖ్యమైనవి
ఆపరేషన్ కావేరి (2023):
సైన్యం (SAF-Sudanese Armed Forces) మరియు పారామిలిటరీ దళాల (RSF-Rapid Support Forces) మధ్య ఘర్షణతో అతలాకుతలమైన ఆఫ్రికా ఖండంలోని సూడాన్ దేశంలో చిక్కుకున్న వేలాది మంది భారతీయ పౌరులను సురక్షితంగా భారతదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం 24 ఏప్రిల్ 2023న ఆపరేషన్ కావేరి (Operation Kaveri) ప్రారంభించింది.
ఈ ఆపరేషన్ కావేరి ద్వారా 3,862 మందిని స్వదేశానికి సురక్షితంగా తీసుకువచ్చారు.
దక్షిణ కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాల గుండా కావేరి నది ప్రవహిస్తుంది. నదులు ఎన్ని అడ్డంకులు ఎదురైనా తమ గమ్యాన్ని చేరుకుంటాయి కాబట్టి, ఈ ఆపరేషన్ కు ఆపరేషన్ కావేరి అని పేరు పెట్టారు.
భారతదేశంలో ఎన్నో నదులున్న కావేరి నది పేరు ఎందుకు పెట్టారంటే, 10 మే 2023న జరగనున్న కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం.
ఈ ఆపరేషన్లో రెండు C-130J విమానాలు మరియు INS సుమేధ పాల్గొన్నాయి.
సూడాన్ లో ఎందుకీ ఘర్షణలు?:
మూడు దశాబ్దాల పాటు నియంతగా సూడాన్ ను పాలించిన ఒమర్ అల్-బషీర్ ను ఏప్రిల్ 2019న సైనిక తిరుగుబాటు చేసి గద్దెదించారు.
ఈ తిరుగుబాటులో ముఖ్యపాత్ర పోషించిన సూడానీస్ సాయుధ దళాల (SAF) నాయకుడు అబ్దెల్ ఫట్టా అల్-బుర్హాన్ మరియు ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) నాయకుడు మొహమ్మద్ హమ్దాన్ దగలో. ఈయనను హెమెడ్టీ అని కూడా అంటారు.
ఆగస్టు 2019లోసైనిక మరియు పౌరులతో కూడిన ఉమ్మడి ప్రభుత్వం (TSC-Transitional Sovereignty Council) ఏర్పాటైంది. దీనికి ప్రధానమంత్రిగా అబ్దల్లా హమ్ డోక్ అయ్యారు. ఈయన పౌర ప్రధానమంత్రి.
2021లోSAF & RSF మళ్లీ సైనిక తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు.
2023లో ఎన్నికలు జరిగే వరకు TSC కు ఛైర్మన్ గా SAF నాయకుడు బుర్హాన్, డిప్యూటీ ఛైర్మన్ గా RSF నాయకుడు హెమెడ్టీ ఉన్నారు.
SAF లో RSF ను విలీనం చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అలాగే 2023లో ఎన్నికలు జరపడానికి బుర్హాన్ విముఖతగా ఉన్నాడు.
దీంతో బుర్హాన్, హెమెడ్టీ మధ్య హోరాహోరి పోరు కొనసాగుతుంది.
RSF ను ఒక తిరుగుబాటు సంస్థగా ముద్రవేసిన బుర్హాన్ వెంటనే దానిని రద్దు చేయాలని పట్టు పడుతున్నారు. మరోవైపు హెమెడ్టీ బుర్హాన్ ను క్రిమినల్ గా అభివర్ణిస్తున్నారు.
ఆపరేషన్ దోస్త్ (2023):
6 ఫిబ్రవరి 2023న తుర్కియే మరియు సిరియా దేశాల్లో తీవ్రమైన భూకంపం సంభవించింది.
దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8 గా నమోదైంది.
ఈ క్రమంలో తుర్కియే, సిరియాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు అందించేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ దోస్త్ (Operation Dost) పేరిట శోధన మరియు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది.
హిందీ మరియు టర్కిష్ భాషలలో దోస్త్ అంటే స్నేహితుడు అని అర్థం.
భారత ప్రభుత్వం 7 కోట్లు ఏర్పాటు చేసి, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) సిబ్బంది మరియు డాగ్ స్క్వాడ్ లతో కూడిన బృందాలు, మందులు, వైద్య పరికరాలు, వినియోగ వస్తువులనుC-17 విమానాల్లో తుర్కియే మరియు సిరియాకు పంపబడింది.
ఆపరేషన్ గంగా (2022):
24 ఫిబ్రవరి 2022నఉక్రెయిన్ పై రష్యా పూర్తిస్థాయిలో దండయాత్ర ప్రారంభించింది.
దీంతో ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయ పౌరులను స్వదేశానికి తీసుకురావడానకి భారత ప్రభుత్వం 26 ఫిబ్రవరి 2022నఆపరేషన్ గంగా (Operation Ganga) చేపట్టింది.
ఉక్రెయిన్ పై రష్యా ఎందుకు దాడికి దింగింది?:
ఉక్రెయిన్ USSR (Union of Soviet Socialist Republics)లో భాగంగా ఉండేది.
1991లో USSR విచ్ఛిన్నం తర్వాత 15 దేశాలు ఏర్పడ్డాయి. వాటిలో ఉక్రెయిన్ కూడా ఒకటి.
1949లో సోవియట్ యూనియన్ కు వ్యతిరేకంగా నాటో (NATO-North Atlantic Treaty Organization) ఏర్పడింది. నాటో తన సభ్య దేశాలకు ఒక సామూహిక భద్రతా వ్యవస్థను ఏర్పరుస్తుంది. దాని సభ్య దేశాలపై ఏదైనా బయటి దేశం దాడి చేస్తే దానికి ప్రతిస్పందనగా పరస్పర రక్షణకు సభ్యదేశాలు కట్టుబడి ఉంటాయి.
అలాంటి నాటోలో ఇప్పుడు ఉక్రెయిన్ సభ్యత్వం కోసం ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఉక్రెయిన్ ఎట్టి పరిస్థితుల్లోను నాటోలో చేరకూడదని, ఉక్రెయిన్ కు సభ్యత్వం ఇవ్వకూడదని రష్యా డిమాండ్ చేస్తుంది.
ఎందుకంటే ఉక్రెయిన్ ను తమ దేశానికి అతి పెద్ద సెక్యూరిటీ వాల్ గా రష్యా భావిస్తుంది. రష్యాపై దాడి చేయాలంటే ఉక్రెయిన్ ను దాటుకుని రావాలి. ఒకవేళ ఉక్రెయిన్ నాటోలో చేరితే నాటో దళాలు రష్యా సరిహద్దులు వరకు విస్తరించి, పక్కలో బల్లెంలా తయారవుతాయి.
డిఫెన్స్, న్యూక్లియర్, మిసైల్ ఇండస్ట్రీస్, ఖనిజ సంపద విషయంలో ఉక్రెయిన్ రష్యాకి అనువుగా ఉండడం, అర్థికపరంగాను, కీలకమైన వ్యూహాలను రచించేందుకు ఉక్రెయిన్ బోర్డర్ వద్ద ఉన్న నల్ల సముద్రం (Black Sea) తమకు ఎంతగానో తోడ్పడడం వంటి అంశాలు ఉక్రెయిన్ ని రష్యాకు కీలకంగా మార్చాయి.
ఈ కారణంగానే 2014లో ఉక్రెయిన్ లో భాగమైన క్రిమియా ప్రాంతాన్ని ఆక్రమించి రష్యాలో కలిపేసుకుంది.
తాలిబాన్లు అఫ్ఘనిస్తాన్ ను 15 ఆగస్ట్ 2021న స్వాధీనం చేసుకున్నారు.
దీంతో అఫ్ఘనిస్తాన్ లో చిక్కుకున్న భారతీయ పౌరులను స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ఆపరేషన్ దేవి (Operation Devi Shakti) శక్తి చేపట్టింది.
24 ఆగస్ట్ 2021న విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ దీనిపై ట్వీట్ చేయడంతో ఆపరేషన్ దేవి శక్తి అనే పేరు తెరపైకి వచ్చింది.
వందే భారత్ మిషన్ (2020):
కొవిడ్-19 మహమ్మారి సమయంలో భారత ప్రభుత్వం విదేశాలలోని పౌరులను స్వదేశానికి రప్పించడానికి వందే భారత్ మిషన్ (Vande Bharat Mission) ను 7 మే 2020న చేపట్టింది.
24 జూలై 2021నాటికి 88,000 కంటే ఎక్కువ విమానాలు విదేశాల నుంచి భారత్ కు వచ్చాయి. అందులో 71 లక్షల మంది ప్రయాణికులు 100 కంటే ఎక్కువ దేశాల నుండి భారత్ కు తిరిగి వచ్చారు.