History of Tungabhadra Pushkaralu in Telugu | తుంగభద్ర పుష్కరాలు - 2020

 

History of Tungabhadra Pushkaralu in Telugu | తుంగభద్ర పుష్కరాలు - 2020
History of Tungabhadra Pushkaralu in Telugu | తుంగభద్ర పుష్కరాలు - 2020

పుష్కరాలు:

  • పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు. జీవరాశులకు ప్రధానమైన జలం స్నానం  ప్రాముఖ్యతను గుర్తుచేసేవే పుష్కరాలు. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశములోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ  పుష్కరాలు వస్తాయి. పుష్కర సమయములో ఆయానదులలో స్నానము చేస్తే పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువుల విశ్వాసం. సమస్త పాపాలు పటాపంచెలు అవుతాయని శాస్రవచన. 

నదులు వాటి రాశులు:

  1. గంగానది - మేష రాశి
  2. రేవా నది (నర్మద) - వృషభ రాశి
  3. సరస్వతీ నది - మిథున రాశి
  4. యమునా నది - కర్కాట రాశి
  5. గోదావరి - సింహ రాశి
  6. కృష్ణా నది - కన్యా రాశి
  7. కావేరీ నది - తులా రాశి
  8. భీమా నది - వృశ్చిక రాశి
  9. పుష్కరవాహిని/రాధ్యసాగ నది - ధనుర్ రాశి
  10. తుంగభద్ర నది - మకర రాశి
  11. సింధు నది - కుంభ రాశి
  12. ప్రాణహిత నది - మీన రాశి

  • బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు  ఆయానదికి పుస్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ  రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణముగా ఒక  సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కర కాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి  పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని  వ్యవహరిస్తారు. ఈ మొదటి మరియు చివరి  పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.  
  • బ్రహ్మలోక వాసి పుష్కరుడు గురుగ్రహం ఎప్పుడు  ఏ రాశిలో ప్రవేశిస్తుందనే కాలాన్ని బట్టి ఈ పన్నెండు నదులనూ దర్శిస్తుంటాడని, బ్రహ్మ స్వయంగా పంపించినవాడు కావడం చేత పుష్కరుడు నదులకువచ్చినప్పుడు సప్త మహాఋషులు ఆయనకు ఆతిథ్యం ఇచ్చి గౌరవిస్తుంటారని, వారు సూక్ష్మ  దేహంతో నదులకు వస్తారు కనుక వారు వచ్చిన  కాలం పవిత్రమైనదనీ ఒక విశ్వాసం.
  • సప్తర్షులేగాక, చాలా మంది దేవతలు కూడా సూక్ష్మరూపులై ఈ నదుల ప్రాంతంలో పుష్కరాలప్పుడు సంచరిస్తుంటారనీ, పుష్కర స్నానాలు చేసే వారికి శుభాలను కలిగిస్తారనీ కూడా నమ్మకం.

తుంగభద్ర పుష్కరాలు - 2008:

  • 2008వ సంవత్సరంలో డిసెంబర్ లో తుంగభద్ర పుష్కరాలు జరిగాయి. 
  • ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలలో మాత్రమే తుంగభద్ర నది ప్రవహిస్తుంది.
  • కర్నూలు జిల్లాలో 17 ఘాట్లను, మహబూబ్ నగర్ జిల్లాలో 5 ఘాట్లను ప్రభుత్వం ఏర్పాటుచేసి పుష్కర సమయంలో వచ్చే భక్తులు, యాత్రికులకు సౌకర్యాలను కల్పించింది.
  • తొలి రోజు ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి రత్నాకర్ రావు, టీటీడి బోర్డు చైర్మెన్ ఆదికేశవులు నాయుడు పాల్గొన్నారు. రెండో రోజున ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్ పుష్కర ఘాట్ వద్ద తుంగభద్రమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించాడు.

తుంగభద్ర పుష్కరాలు - 2020:

  • 2020వ సంవత్సరంలో నవంబరు 20 నుంచి డిసెంబరు 1 వరకు తుంగభద్ర పుష్కరాలు జరిగాయి. 
  • ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో మాత్రమే తుంగభద్ర నది ప్రవహిస్తుంది.
  • కర్నూలు జిల్లాలోని తుంగభద్రా నది ప్రవహించే కోడుమూరు, కర్నూలు, నందికొట్కూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 23 ఘాట్లు ఏర్పాటు చేశారు. కోవిడ్ కారణంగా నదీలో స్నానాలకు అనుమతించని ప్రభుత్వం. కేవలం జల్లుల స్నానానికి (Showers Bath) మాత్రమే అనుమతి. (23 పుష్కర ఘాట్ల List)
  • 2020 నవంబరు 20 శుక్రవారం మధ్యాహ్నం 01:21 గంటలకు బృహస్పతి మకర రాశిలో ప్రవేశించడంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కర్నూలు నగరంలోని సంకల్ భాగ్ ఘాట్ కు చేరుకుని  పుష్కరాలను ప్రారంభించారు.
  • పుష్కరాల సందర్భంగా ప్రధాన ఘాట్లలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా ఉన్నప్పటికీ భక్తుల మనోభావాలు గౌరవించి పుష్కరాలకు అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రధానమైన పుష్కర ఘాట్లలో సాంస్కృతిక కార్యక్రమాలు

పుష్కర ఘాట్లలో జల్లుల స్నానం (Showers Bath) చేస్తున్న భక్తులు


తుంగభద్ర నది (Tungabhadra River):

  • తుంగభద్ర ప్రస్తావన ఇతిహాసాల్లోనూ, మత్స్య, భాగవత, అగ్ని పురాణాల్లో కనిపిస్తున్నది. రామాయణంలో ఈ తుంగభద్ర నది పంపా నదిగా పిలువబడింది. 
  • తుంగభద్రనది ఉద్భవించడానికి సంబంధించిన ఓ కథ ప్రాచూర్యంలో ఉంది. హిరణ్యాక్షుణ్ణి శ్రీమహావిష్ణువు వరాహావతారియై సంహరించిన తర్వాత వరహ స్వామి ముఖం మీద పుట్టిన చెవుట, స్వామి వారి రెండు కోరల మీదుగా కిందకు పడిందట. అలా కుడి కోర మీద నుంచి పడిన చెమట బిందువు తుంగ నదిగా, ఎడమ కోర నుంచి కిందకు పడిన చెమట బిందువు భద్ర నదిగా ప్రవహించిందని పురాణాల్లో ఉంది.
  • తుంగ అంటే ఎత్తైన అని, భద్ర అంటే శుభం అని అర్థాలున్నాయి.
  • దేశంలో ఉన్న 12 పుష్కర నదుల్లో తుంగభద్ర ఒకటి. మిగిలిన 11 నదులు సముద్రంలో కలిసిపోతుంటే ఈ నది మాత్రం కృష్ణా నదిలో కలిసిపోతోంది.
  • తుంగభద్ర నీటికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఈ నది నీరు స్వచ్ఛంగా తాగేందుకు మధురంగా ఉండడంవల్ల "గంగా స్నానం తుంగా పానం" అనే సామెత ఉంది.
  • తుంగభద్ర నది కృష్ణా నదికి ముఖ్యమైన మరియు అతిపెద్ద ఉపనది. దీని పొడవు 531 Km.
  • తుంగ, భద్ర అనే రెండు నదుల కలయిక తుంగభద్ర నది. ఈ రెండు నదులకు జన్మస్థానం కర్ణాటకలోని పడమటి కనుమలలోని వరాహ పర్వతాలలోని గంగమూలం. ఈ నదులు షిమోగా జిల్లాలోని కూడ్లి వద్ద సంగమం చెందగా తుంగభద్ర నదిగా ఏర్పడుతుంది.
  • తుంగభద్ర నది శృంగేరి పీఠం, హంపిల మీదుగా కర్నూలు జిల్లాలోని కౌతాళం దగ్గర ఉన్న మేళిగనూరు గ్రామం వద్ద ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశిస్తుంది. తరువాత మంత్రాలయం మీదుగా ప్రవహించి కర్నూలు జిల్లాలోని కొత్తపల్లి మండలం సంగమేశ్వరం వద్ద, తెలంగాణలో మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని అలంపూర్ కి సమీపంలో ఉన్న కూడవల్లి సంగమం వద్ద కృష్ణానదిలో కలిసిపోతుంది.
  • కర్ణాటకలోని హోస్పేట్ పట్టణానికి సమీపంలో తుంగభద్ర నదిపై 1953లో తుంగభద్ర ఆనకట్ట (Tungabhadra Dam) ను నిర్మించారు. ఇది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల యొక్క ఉమ్మడి ప్రాజెక్ట్. ఈ ఆనకట్ట యొక్క ప్రధాన ఆర్కిటెక్ట్ డాక్టర్ తిరుమలై అయ్యంగార్. ఇతను మద్రాస్ కు చెందిన ఒక ఇంజనీరు. 

వీటిని కూడా చూడండీ: