Hypertension Disease In Telugu | రక్తపోటు వ్యాధి |
రక్తపోటు:
ఒత్తిడితో కూడుకున్న జీవితం, ఉరుకులు పరుగులు తీసే ఉద్యోగాలతో ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక దశలో ఒత్తిడికి గురవుతున్నాడు. ఈ ఒత్తిడి రక్తపోటును ప్రభావితం చేస్తుంది. శుద్ధి అయిన రక్తం గుండె నుంచి శరీర భాగాలకు ధమనుల ద్వారా సరఫరా అవుతుంది. రక్తం రక్తనాళాలలో ప్రవహించేటప్పుడు వాటి గోడలపై కలిగించే ఒత్తిడిని రక్తపీడనం (BP- Blood Pressure) అంటారు. ఈ సరఫర మామూలు వేగం కంటే అధిక వేగంగా సరఫరా కావడాన్ని అధిక రక్తపోటు (Hypertension) లేదా అధిక రక్తపీడనం (హై బిపి- High blood pressure) అంటారు.
ఆరోగ్యవంతుడైన మానవుని సాధారణ రక్తపీడనం (BP) 120/80 ఉండాలి. ఇది 140/90 కంటే ఎక్కువైతే అధిక రక్తపోటు (Hypertension) లేదా అధిక రక్తపీడనం (హై బిపి) గాను, 90/60 కంటే తక్కువైతే అల్ప రక్తపోటు (Hypotension) లేదా అల్ప రక్తపీడనం (లో బిపి) గాను అంటారు. ఈ రెండు ప్రమాదకరమైనవే.
దీనిలో 120 అనేది సిస్టోలిక్ పీడనాన్ని, 80 అనేది డయాస్టోలిక్ పీడనాన్ని తెలియజేస్తుంది.
హృదయం యొక్క సంకోచాన్ని సిస్టోల్ (Systole) అంటారు. హృదయం యొక్క సడలికను డయాస్టోల్ (Diastole) అంటారు.
రక్తపోటు వ్యాధి లక్షణాలు ఎట్టిపరిస్థితుల్లోను బయటపడవు. కాబట్టి దీనిని నిశ్శబ్ద కిల్లర్ (Silent Killer) అని పిలుస్తారు.
రక్తపోటు వ్యాధికి కారణాలు:
- ధూమపానం చేయడం మరియు మద్యం ఎక్కువగా తీసుకోవడం
- అధిక బరువు ఉండటం (ఊబకాయం)
- శారీరక శ్రమ లేకపోవడం
- ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం
- మానసిక ఒత్తిడి
- అధిక రక్తపోటు కుటుంబ నేపథ్యం
- దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధి
- థైరాయిడ్ సమస్యలు
రక్తపోటు వ్యాధి ప్రభావం:
- రక్తపోటు హృదయ సంబంధ వ్యాధులకు ప్రధాన ప్రమాద కారకం.
- అధిక రక్తపోటు మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఒక్కోసారి మెదడులోని రక్తనాళాలు చిట్లిపోయి ప్రాణం పోయే పరిస్థితి ఏర్పడుతుంది.
- ఇది కిడ్నీలపై కూడా ప్రభావం చూపిస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారు నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలు దెబ్బతింటాయి.
- నేత్ర సంబంధ సమస్యలు తలెత్తుతాయి
జాగ్రత్తలు:
- రక్తపోటు వ్యాధి గురించి అవగాహన పెంచుకోవాలి.
- రోజూ తీసుకునే ఆహారంలో ఉప్పు తక్కువ ఉండేలా చూసుకోవాలి.
- ఆహారంలో కొవ్వు పదార్ధాలు పరిమితి మించకుండా జాగ్రత్తలు పాటించాలి.
- అధిక బరువు ఉన్నట్లయితే దాన్ని తగ్గించుకునేందుకు తగిన వ్యాయామం చేయాలి.
- మద్యం తాగే అలవాటు ఉంటే మోతాదు మించకుండా చూసుకోవాలి.
- రక్తపోటును ఎప్పటికప్పడు పరీక్షించుకుంటూ ఉండాలి.
- అధిక రక్తపోటు ఉన్నట్టయితే వైద్యుల సలహాపై తగిన మందులను నిరంతరాయం తీసుకోవాలి
మరికొన్ని అంశాలు:
- 2002 లో ది వరల్డ్ హెల్త్ రిపోర్టులో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) రక్తపోటు వ్యాధిని నంబర్ వన్ కిల్లర్ గా పేర్కొంది.
- WHO గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1.13 బిలియన్ల మంది ప్రజలకు రక్తపోటు ఉంది (2019 నాటికి)
- రక్తపీడనాన్ని స్పిగ్మోమానోమీటర్ (Sphygmomanometer) అనే పరికరంతో కొలుస్తారు.
వీటిని కూడా చూడండీ:
- ప్రపంచ రక్తపోటు దినోత్సవం (World Hypertension Day)
- వ్యాధులు (Diseases)
- ముఖ్యమైన దినోత్సవాలు (Important Days)