Autism Disease |
కొందరు పిల్లలు ఎవరితోనూ కలవకపోవటం, ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతుండటం, సరిగా మాట్లాడలేకపోతుండటం వంటి భిన్న లక్షణాలను కలిగి ఉంటే వారికి ఆటిజమ్ ఉన్నట్టు.
ఆటిజమ్ భిన్న విభాగాలకు విస్తరించిన ఎదుగల సమస్య. దీన్నే పర్వేసివ్ డెవలప్మెంటల్ డిసార్డర్స్ అంటారు. వీరందరిలోనూ కొన్ని రకాల లక్షణాలు ప్రత్యేకంగా కనబడతాయి. కొన్ని అంశాల్లో ఎదుగుదల అస్తవ్యస్తమవుతుంది.
గుర్తించేదెలా?
మరీ చిన్నవయసులో..
- అకారణంగా నిరంతరంగా ఏడ్వటం
- గంటల తరబడి స్తబ్దుగా ఉండటం
- తల్లి దగ్గరకు తీసుకుంటున్నా పెద్దగా స్పందించకపోవటం
- పరిచిత వ్యక్తులను చూడగానే నవ్వక పోవటం
- తల్లిదండ్రులు రమ్మని చేతులు చాచగానే ఉత్సాహంగా ముందుకు రావాల్సిన పిల్లల్లో అలాంటి స్పందనలేవీ కనిపించకపోవటం
- మిగతా పిల్లలతో కలవకపోవటం
- పిలిస్తే పలకకపోతుండటం
- పెరిగే కొద్దీ ఒంటరిగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడుతుండటం
- మనుషుల కంటే బొమ్మలు, వస్తువుల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండటం
- ఎవరైనా పలకరించినా వెంటనే సమాధానం ఇవ్వకపోవటం
- కళ్లలో కళ్లు పెట్టి చూడకపోతుండటం
- ముఖంలో భావోద్వేగాలేవీ చూపించకపోతుండటం
- మాటలు సరిగా రాకపోతుండటం, సరిగా మాట్లాడలేకపోతుండటం
- గుంపులో ఉన్నా మిగతా పిల్లలతో కలివిడిగా ఉండలేకపోతుండటం, తమ బొమ్మలు తాము పెట్టుకు ఆడుకుంటుండటం
- ఎదుటి వారికి దెబ్బలు, గాయాల వంటివి తగిలినా పట్టనట్టుగా ఉండిపోతుండటం, వెంటనే స్పందించకపోతుండటం
- తమకు దెబ్బలు తగిలినా నొప్పి, బాధ పట్టనట్టు ఉండిపోవటం
- నడక మొదలుపెట్టినప్పుడు మునివేళ్ల మీద నడుస్తుండటం
- వయసుకు తగినట్లు భాషా వృద్ధి చెందకపోవటం
- పలకరించినా రెండు మాటలు మాట్లాడి వెళ్లిపోవటం, సంభాషణను కొనసాగించే శక్తి కొరవడటం
- ఎదుటి వారు అన్న మాటనే తాము మళీ అనటం మనం ఎప్పుడో అడిగిన ప్రశ్నకు.. వెంటనే స్పందించకుండా తర్వాత ఎప్పుడో మళ్లీ అదే ప్రశ్నను అడుగుతుండటం
- మనసు ఎక్కడో లగ్నమై ఉండటంతో కొన్నిసార్లు అసందర్భంగా మాట్లాడుతుండటం
- ఏదైనా ఒక వస్తువు లేదా బొమ్మ పట్ల విపరీతమైన వ్యామోహం పెంచుకోవటం ఎప్పుడూ ద్యాసంతా దాని మీదే ఉండటం, దాన్ని ఏదైనా చేస్తే విపరీతంగా కోపం రావటం
- చేతులు, కాళ్లు లేదా వేళ్లు కాస్త అసహజంగా ఒకే తీరులో కదలిస్తుండటం
- వీటితో పాటు ప్రవర్తనాపరమైన సమస్యలు కూడా కనబడుతుంటాయి. ముఖ్యంగా అడిగినవి ఇవ్వకపోతే అరవటం, గట్టిగా గీపెట్టటం మొదలైనవి
- కొంతమందిలో ప్రతి దానికీ భయపడటం, గాలికి తీగలాంటిదేదన్నా కదులుతున్నా కూడా భయపడిపోవటం, చీమలాంటిది కనబడినా భయపడటం, చిన్న చిన్న శబ్దాలకు కూడా గట్టిగా చెవులు మూసుకోవటం, శబ్దాలు భరించలేకపోవటం వంటి భావోద్వేగపరమైన అంశాలు కూడా ఉంటాయి
- కొందరు విపరీతంగా చురుకుగా ఉంటుంటారు. ఎప్పుడూ కదులుతూ, అటూ ఇటూ తిరుగుతూ ఉండటం చాలామందిలో కనబడుతుంది
- కొందరికి మేధస్సు సగటు స్థాయిలోనే ఉన్నా కొందరిలో మాత్రం కొన్ని కొన్ని విషయాల్లో అపారమైన ప్రజ్ఞ కనబడుతుంటుంది.
- 30% మందిలో ఫిట్స్, మరికొన్ని రకాల మెదడు, నాడీ సంబంధ సమస్యలూ కనబడుతుంటాయి
- కొద్దిమందిలో మానసిక ఎదుగుదల కూడా కుంటుపడొచ్చు.
సమస్య అందరిలో ఒకే తీరులో, ఒకే తీవ్రతలో ఉండదు. కారణాలూ స్పష్టంగా తెలీవు కాబట్టి దీనికి చికిత్స కూడా లక్షణాల ఆధారంగా ఉంటుంది. వైద్యులు ఆటిజమ్ రేటింగ్ స్కేల్స్ ఆధారంగా పిల్లల ప్రవర్తన, లక్షణాలన్నింటినీ గమనిస్తారు. అవసరమైతే ఐక్యూ పరీక్షలూ చేస్తారు. దీనిలో మోస్తరు, మధ్యస్తం, తీవ్ర స్థాయులు నిర్ధారించి దాన్ని బట్టి దీన్ని ఎలా ఎదుర్కొనాలన్నది నిర్ధారిస్తారు.
మానసిక స్థితిని చక్కదిద్దటం:
ఆటిజమ్ పిల్లలకు కీలకమైనది మానసిక స్థితిని చక్కదిద్దే శిక్షణ. తల్లిదండ్రులు దీన్ని అర్థం చేసుకోవటం చాలా అవసరం. చిన్నతనంలోనే ప్రేరణ ఇవ్వటం వల్ల ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. అతిగా ఆశించకుండా అలాగని నిరాశలో కూరుకుపోకుండా చికిత్సలో భాగస్వాములు కావటం కీలకం.
స్పీచ్ థెరపీ, లాంగ్వేజ్ స్టిమ్యులేషన్:
ఒక పద్ధతి ప్రకారం ఉదయం నుంచి రాత్రి వరకూ పిల్లలతో మాట్లాడుతుండటం, సంభాషణా సామర్థ్యం పెరిగేలా చూడటం అవసరం. దీనికి స్పీచ్ థెరపీ దోహదం చేస్తుంది. కళ్లలో కళ్లు పెట్టి చూడటాన్ని అలవాటు చేసేందుకు శిక్షణ, అలాగే మలమూత్ర విసర్జన కోసం టాయ్ లెట్ ట్రైనింగ్ వంటివన్నీ పద్ధతి ప్రకారం నేర్పిస్తారు. క్రమేపీ స్థాయులను పెంచుకుంటూ వెళతారు. దీంతో మెదడులో లోపం క్రమేపీ సర్దుకుంటుంటుంది.
ప్రవర్తన చక్కదిద్దటం:
ఆటిజమ్ పిల్లలకు బిహేవియర్ మోడిఫికేషన్ కూడా ముఖ్యమే. పిల్లవాడికి ఏదైతే బాగా ఇష్టమో దాన్ని వెంటనే ఇవ్వకుండా, మనం చెప్పిన పని చేస్తే అప్పుడు ఇవ్వటం, మంచి అలవాట్లు పాదుకునేలా చూడటం ముఖ్యం. వేరే పిల్లలతో గొడవలు పడటం వంటివి చేస్తుంటే సైకో థెరపీ వంటివీ ఇస్తారు.
- మరీ చిన్నపిల్లలకు సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ ఇస్తారు. వీళ్లు కంటితో చూసి ఎక్కువ నేర్చుకోరు కాబట్టి ఇతర జ్ఞానేంద్రియాల ద్వారా స్పర్శ, ధ్వని వంటి వాటి ద్వారా వారికి కావాల్సినవి నేర్పిస్తారు.
- ముఖ్యంగా వీరిలోని ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించి వాటికి మెరుగుపెట్టించటం ముఖ్యం. వీటిలో వీరు బాగా రాణిస్తారు. దీనికి ఆక్యుపేషనల్ థెరపీ, మ్యూజిక్ థెరపీ వంటివీ దోహదం చేస్తాయి.
వీటిని కూడా చూడండీ:
- ప్రపంచ ఆటిజమ్ అవగాహన దినోత్సవం (World Autism Awareness Day)
- వ్యాధులు (Diseases)
- ముఖ్యమైన దినోత్సవాలు (Important Days)