Medaram Jathara |
మేడారం జాతర
తెలంగాణ కుంభమేళంగా ప్రసిద్ధిగాంచిన సమ్మక్క సారక్క జాతర (మేడారం జాతర) అనేది ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర.
- మాఘ శుద్ధ పౌర్ణమి గడియలను ఆధారంగా చేసుకుని జాతర తేదీలను నిర్ణయిస్తారు. ప్రతి రెండు సంవత్సరాలకొకసారి జనవరీ లేదా ఫిబ్రవరీ నెలలో 4 రోజుల పాటు మేడారం జాతర జరుగుతుంది. 2020 లో ఫిబ్రవరీ 5 నుండి ఫిబ్రవరీ 8 వరకు జరిగింది.
- ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. భారత దేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే.
- ఈ పండుగను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో రాష్ట్ర పండుగ (State Festival) గా ప్రకటించింది.
సమ్మక్క సారక్క దేవతలు |
మేడారం జాతర చరిత్ర:
12-13 వ శతాబ్దంలో నాటి కరీంనగర్ జిల్లా నేటి జగిత్యాల జిల్లాలో ఉన్న పొలవాస (పోలాస) ను పరిపాలించే గిరిజన దొర మేడరాజు. తన ఏకైక కుమార్తె సమ్మక్కను మేనల్లుడైన మేడారంను పాలించే పగిడిద్ద రాజుకు ఇచ్చి వివాహం చేస్తారు. పగిడిద్ద రాజు కాకతీయుల సామంతరాజు. ఈ పుణ్య దంపతులకు సారలమ్మ , నాగులమ్మ , జంపన్న అనే ముగ్గురు సంతానము. సారలమ్మ భర్త గోవిందరాజు.
అయితే సమ్మక్క గురించి చిన్న కథ ప్రాచుర్యంలో ఉంది. మేడారం గ్రామంలోని కోయదొరలు గోదావరి తీరాన దట్టమైన అడవిలో వేటకు వెళ్ళినప్పుడు పెద్దపులుల మధ్య ఆనందంగా చిరునవ్వు లొలుకుతున్న ఒక పాప వారి కంటపడింది. ఆ పాపకు కోయదొరలు తమతో తీసుకెళ్లి మార్గశిర పౌర్ణమి నాడు సమ్మక్క అని నామకరణం చేసి పెంచారు. ఆ పాప వచ్చినప్పటి నుండి అన్ని శుభసూచకాలు కల్గడం, పెరుగుతున్న కొద్దీ దైవలీలలు కనిపించడంతో ఆమెను దేవతగా కొలిచేవారు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, అడవిలో పాముకాటుకు గురైన వారిని బ్రతికించడం, రోగగ్రస్థులు ఆమె చేయి పడగానే ఆరోగ్యవంతులు కావడం ఇటువంటి ఎన్నో అద్భుతాలు జరిగినవి. ఈలోగా ఆమెకు యుక్త వయస్సు రావడంతో పగిడిద్ద రాజుతో వివాహం జరిపించారు.
ఆకాలంలో వరుసగా మూడు నాలుగేళ్ళ పాటు అనావృష్టి ఏర్పడటంతో ప్రజలు పన్నులు కట్టలేని స్థితికి చేరుకున్నారు. పగిడిద్దరాజు కప్పం చెల్లించుటకు నిరాకరించడంతో ప్రతాపరుద్ర చక్రవర్తి గిరిజన పాలకులను అణచివేయడానికి సైనికులను పంపారు. కాకతీయ సైన్యం నేటి వరంగల్లు జిల్లాలోని ములుగు సమీపంలో లక్నవరం సరస్సు వద్ద స్థావరం ఏర్పాటు చేసుకొని యుద్ధం ప్రకటించారు. పగిడిద్దరాజు అతని కుమార్తెలు నాగులమ్మ , సారలమ్మ , అల్లుడు గోవిందరాజు కలిసి కాకతీయ సైన్యాన్ని మేడారం సరిహద్దులోని సంపెంగ వాగు వద్ద నిలువరించి అతి వీరోచితంగా పోరాడి వీరమరణం పొందారు. కుమారుడు జంపన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నాటి నుండి సంపెంగ వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి గాంచింది.
తన భర్త, కొడుకు, అల్లుడు, కుమార్తెలు మరణించారన్న వార్త విన్న సమ్మక్క యుద్ధరంగానికి వచ్చి పరాశక్తి అవతారమెత్తి అపరకాళిగా విజృంభించి ఈటెలతో, బళ్ళాలతో కాకతీయ సైన్యాలను పరుగెత్తించి అంతం చేసింది. ఇక ఓటమి తప్పదని భావించిన కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెనుక నుండి పొడవడంతో అప్పుడు ఆమె యుద్ధభూమి నుండి వైదొలగి మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టకు వెళ్లి గుట్ట మలుపు తిరిగిన తర్వాత ఆమె అదృశ్యమైంది. కోయదొరలు ఎంత వెతికిన ఆమె జాడ కనిపించలేదు. ఆ ప్రాంతంలో నమిలినార చెట్టు వద్ద గల పుట్ట దగ్గర ఒక కుంకుమ భరణి కనిపించింది. అది సమ్మక్క గుర్తుగా కోయదొరలు నిద్రాహారాలు మాని ఆమె తిరిగి వస్తుందన్న ఆశతో వేచి చూశారు.
ఆ దశలో మాయమంత్రాలతో సాధించిన రాజ్యం వీరభోజ్యం కాదని ఈ గడ్డపై పుట్టిన ప్రతి వ్యక్తి వీరుడిగానే రాజ్యాన్ని సంపాదించాలని ప్రతాపరుద్రునికి ఆకాశవాణి మాటలు వినిపించాయి. పిదప తన తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు కోయరాజును ఆహ్వానించి సమ్మక్క భక్తుడిగా మారాడని తెలుస్తోంది. ఈ స్థలంలో రెండు గద్దెలు కట్టించి రెండు సంవత్సరాలకొకసారి ఉత్సవం జరిపితే భక్తుల కోర్కెలు నెరవేరుతాయని ఆమె చెప్పినట్లు ప్రతీతి.
గద్దెపై సమ్మక్క సారక్క దేవతలు |
నాలుగు రోజుల జతర:
1వ రోజు:
జాతర మొదటి రోజున మేడారానికి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలోని కన్నెపల్లి నుంచి సారలమ్మ బయలుదేరి వస్తుంది. సారలమ్మను వెదురుకర్ర రూపంలో గద్దెకు తీసుకువస్తారు. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకువచ్చే సమయంలో ఊరి నుంచి మొదలు ఊరి చివరి వరకు భక్తులు తమ కోరికలు తీరాలని వేడుకుంటూ సాష్టాంగ పడుతారు. పూజారి వారిపై నుంచి నడుచుకుంటూ వస్తారు. సారలమ్మకు ఆరుగురు పూజారులుంటారు. అందరూ కాకా వంశస్తులే.2వ రోజు:
రెండవ రోజున చిలుకలగుట్టలో భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను వెదురుబొంగుతో చేసిన మెంటెలో గిరిజనులు తయారు చేసిన కుంకుమ వేసి దాన్ని తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్టిస్తారు.3వ రోజు:
మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు. దేవతలు గద్దెలపై ప్రతిష్టించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.4వ రోజు:
నాలుగవ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి యథా స్థానానికి తరలిస్తారు. దీనినే దేవతల వన ప్రవేశం అని కూడా అంటారు.
వీటిని కూడా చూడండి:
- సమ్మక్క సారక్క మహాజాతర - 2016 PDF Booklet Download (Telangana Govt.)
- పండుగలు (Festivals)
- ముఖ్యమైన దినోత్సవాలు (Important Days)