MAHA SHIVARATRIమహా శివరాత్రి
- హిందువుల క్యాలెండరులో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. అలాగే శీతాకాలం చివర్లో, వేసవి కాలం ముందు మాఘ మాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి (Maha Shivaratri) అంటారు. గ్రెగేరియన్ క్యాలెండర్లో ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వస్తుంది. 2023 లో ఫిబ్రవరి 18 న ఈ మహాశివరాత్రి వచ్చింది.
- శైవులు శివున్ని మూర్తి రూపంలో, లింగరూపంలోనూ పూజిస్తారు. కానీ లింగ రూపమే అందులో ప్రధానమైందిగా భావిస్తారు.ప్రతి లింగంలో శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుంటుందని శైవుల నమ్మకం.
మహాశివరాత్రి చరిత్ర:
- పురాణాల్లో ఈ పండుగ యొక్క ఉద్భవం గురించి వర్ణించే అనేక కథలు ఉన్నాయి.
- శివ పురాణంలో ఒక కథ ప్రకారం, ఒకసారి బ్రహ్మ, విష్ణువు మధ్య ఎవరు గొప్ప అనే సంవాదం జరిగింది. 'నేను ఈ విశ్వానికి సృష్టికర్తను కనక నేనే గొప్ప’ అని బ్రహ్మ.. కాదు ‘నీవు నా నాభిలో పుట్టావు కనుక నేనే గొప్ప’ అని శ్రీమహావిష్ణువు వాదించుకున్నారట. ఈ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో వారికి బుద్ధి చెప్పాలని పరమేశ్వరుడు భావించాడు. పైన ఆకాశం, కింద పాతాళానికి వ్యాపించి ఒక అగ్నిస్తంభ /జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించారు. దాన్ని చూసి బ్రహ్మ, విష్ణువు భయపడిపోగా అప్పుడు ‘మీలో ఎవరు నా ఆది, అంతం తెలుసుకొని వస్తారో వారే గొప్ప’ అని శివుడి అదృశ్యవాణి వినిపించింది. బ్రహ్మ హంస రూపం దాల్చి జ్యోతిర్లింగం పైభాగాన్ని తెలుసుకోవడానికి వెళితే, శ్రీమహావిష్ణువు వరాహరూపంలో మొదలు ఎక్కడ ఉందో వెదుకుతూ కబయలుదేరాడు. కానీ వారిద్దరు ఎంత వెదికిన ఆ జ్యోతిర్లింగం ఆది అంతాలు కనబడలేదు. దీంతో అలసిపోయిన వారు తమ అజ్ఞానాన్ని తెలుసుకుని మన్నించమని శివుడిని వేడుకున్నారు. అప్పుడు శివుడు జ్యోతిర్లింగం మధ్య ప్రత్యక్షమై ‘నేను గొప్ప.. నేనేగొప్ప అని వాదులాడుకుంటున్నారు.. మీకందరికీ నేనే మూలం.. మీలోని శక్తికి కారణం నేనే. ఈ పవిత్రమైన రోజును ప్రజలు మహాశివరాత్రిగా జాగరణం, ఉపవాసం మొదలైన వాటితో నా నిజస్వరూపాన్ని తెలుసుకుని ముక్తి పొందుతారు’ అని అనుగ్రహించి అదృశ్యమైనట్టు శివపురాణంలో ఉంది.
- మరొక కథ ప్రకారం, లోక రక్షణ కోసం శివుడు గరళాన్ని దిగమింగి కంఠంలో దాచుకున్న రోజును మహాశివరాత్రిగా పాటించడం ఆనవాయితీగా వస్తోంది. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తుండగా, ముందుగా హాలాహలం పుట్టింది. హాలహల విషజ్వాలలు ముల్లోకాలనూ అల్లకల్లోలం చేస్తుండటంతో దేవదానవులంతా పరమశివుడిని శరణు వేడుకున్నారు. భక్త వశంకరుడైన శివుడు మరో ఆలోచన లేకుండా, హాలాహలాన్ని ఒడిసి పట్టి, దానిని దిగమింగి గొంతులో బిగించి బంధించాడు. గరళమైన హాలాహల ప్రభావానికి శివుని కంఠం కమిలిపోయి నీలిరంగులోకి మారడంతో నీలకంఠుడయ్యాడు. హాలాహల ప్రభావానికి శివుడు స్పృహ తప్పిపోయాడు. పార్వతీదేవి భర్త తలను ఒడిలోకి తీసుకుని దుఃఖించ సాగింది. జరిగిన పరిణామానికి దేవదానవులందరూ భీతిల్లారు. శోకసాగరంలో మునిగిపోయారు. శివుడు తిరిగి మెలకువలోకి వచ్చేంత వరకు అందరూ జాగరణ చేశారు. నాటి నుంచి శివరాత్రి రోజున భక్తి శ్రద్ధలతో శివుని పూజించి, జాగరణ చేయడం ఆనవాయితీగా మారినట్లు పురాణాల కథనం.
- శివ, పార్వతుల వివాహం జరిగిన రోజునే మహాశివరాత్రి అంటారనే కథనం కూడా ఉంది.
- శివుడు హాలాహలాన్ని ఒడిసి పట్టి, దానిని దిగమింగి గొంతులో బిగించి బంధించి, హాలాహల ప్రభావానికి స్పృహ తప్పిపోయాడు. శివుడు తిరిగి మెలకువలోకి వచ్చేంత వరకు దేవతలందరూ జాగరణ చేశారు.
- మహాశివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ, శివార్చన చేస్తే మరణానంతరం కైలాసం ప్రాపిస్తుంది. దీంతోపాటు ఎంతో పుణ్యఫలం దక్కుతుందని, ఇంకో జన్మ కూడా ఉండకుండా మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే శివరాత్రి రోజు కచ్చితంగా ఉపవాసం, జాగరణ దీక్ష చేయాలని పండితులు చెబుతుంటారు.
- పరమేశ్వరుడూ సృష్టికోసం అయిదు అవతారాల్లో వ్యక్తమయ్యాడు. ఆ అవతారాలే తర్వాత శివుడి పంచ ముఖాలుగా ప్రసిద్ది పొందాయి. మహేశ్వరుడు నిర్వహించే అయిదు మహాకృత్యాలైన సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలకు ఇవి ప్రతీకలు.
- శ్వేతవరాహకల్పంలో సృష్టికార్యాన్ని నిర్వహించే సమయంలో బ్రహ్మదేవుడు ముందుగా పరమేశ్వర స్వరూపాన్ని ధ్యానించాడు. ఆ సమయంలో తెలుపు, ఎరుపు రంగుల మిశ్రమవర్ణంతో ఒక బాలుడు ఉద్భవించాడు. అతడే సద్యోజాతమూర్తి. సృష్టి కార్యక్రమం నిర్వహించటానికి అవసరమైన జ్ఞానాన్ని బ్రహ్మదేవుడికి అందించాడు.
- పీతావాసకల్పంలో బ్రహ్మదేవుడి తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పీతాంబరాలు ధరించి ప్రత్యక్షమయ్యాడు. తత్పురుష గాయత్రీ మంత్రోపాసన ఫలితంగా ఆవిర్భవించిన ఈ మూర్తి తత్పురుషమూర్తిగా పూజలందుకుంటున్నాడు. తత్పురుష పరమేశ్వర అనుగ్రహం వల్ల బ్రహ్మదేవుడికి సృష్టిక్రియకు అవసరమైన శక్తి వచ్చిందని అంటారు.
- రక్తకల్పంలో ఈ అవతారం కనిపిస్తుంది. బ్రహ్మదేవుడు చేసిన ప్రార్థనకు సంతోషించి, పరమేశ్వరుడు ఎర్రని పూలమాల ధరించి, ఎరుపు రంగు వస్త్రాలు, ఆభరణాలు ధరించి వామదేవ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఈయన అనుగ్రహాన్ని పొందిన బ్రహ్మదేవుడు సకల ప్రాణికోటిని సృష్టించాడు.
- శివకల్ప సమయంలో సర్వసృష్టి చేసే సందర్భంలో బ్రహ్మదేవుడు పరమేశ్వరుడిని ధ్యానించాడు. అప్పుడు పరమేశ్వరుడు నల్లని వస్తాలు, కిరీటం ధరించి, నలుపు రంగు శరీరంతో ప్రత్యక్షమయ్యాడు. ఈయన అనుగ్రహ ఫలితంగా బ్రహ్మదేవుడు సకల సృష్టి కార్యక్రమాన్ని నిర్వహించాడు.
- విశ్వరూపకల్పంలో పరమేశ్వరుడు ఈశానావతారంలో వ్యక్తమయ్యాడు. తెల్లటి శరీర ఛాయ కలిగి ఉన్న ఈ పరమేశ్వరమూర్తి బ్రహ్మదేవుడికీ సృష్టి కర్మ చేసే విధానాన్ని బోధించాడు.
శివుడి పంచ ముఖాలు |
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు:
- శైవ క్షేత్రాల్లో ప్రధానమైనవి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు. ఈ పన్నెండు క్షేత్రాలనూ శైవులు అత్యంత పవిత్ర క్షేత్రాలుగా పరిగణిస్తారు.
- గుజరాత్ లోని సోమనాథ క్షేత్రం
- జామ్ నగర్ లో నాగేశ్వర క్షేత్రం
- ఆంధ్రప్రదేశ్ లో శ్రీశైలంలోని మల్లికార్జున క్షేత్రం
- మధ్యప్రదేశ్ లో ఉజ్జయినిలోని మహాకాలేశ్వర క్షేత్రం
- ఇండోర్ సమీపంలోని ఓంకారేశ్వర క్షేత్రం
- ఉత్తరాఖండ్ లో కేదారనాథ క్షేత్రం
- మహారాష్ట్రలో పుణె సమీపంలోని భీమశంకర క్షేత్రం
- నాసిక్ వద్ద త్రయంబకేశ్వర క్షేత్రం
- ఎల్లోరా వద్ద ఘృష్ణేశ్వర క్షేత్రం
- ఉత్తరప్రదేశ్ లో వారణాసిలోని విశ్వేశ్వర క్షేత్రం
- జార్ఖండ్ లో దేవ్ గఢ్ వద్ద వైద్యనాథ క్షేత్రం
- తమిళనాడులో రామేశ్వరంలోని రామనాథ క్షేత్రం
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు |
ఆంధ్రప్రదేశ్ లోని పంచారామ క్షేత్రాలు:
- ఆంధ్రప్రదేశ్ లో ఐదు శైవ క్షేత్రాలు పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి. అవి:
- అమరావతిలోని అమరలింగేశ్వరుని ఆలయం
- ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయం
- భీమవరంలోని సోమేశ్వర ఆలయం
- పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర ఆలయం
- సామర్లకోటలోని కుమార భీమేశ్వర ఆలయం
- ఇవి అమరారామం, ద్రాక్షారామం, సోమారామం, క్షీరారామం, భీమారామం (కుమారారామం) క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి.
- తారకాసుర సంహార సమయంలో కుమారస్వామి తారకాసురుడి కంఠాన్ని ఛేదిస్తాడు. ఈ ఘటనలో తారకుడి మెడలో ఉన్న అమృతలింగం అయిదు ముక్కలై భూమిపై ఐదుచోట్ల లింగాలుగా వెలసినట్లు పురాణాలు చెబుతున్నాయి. వాటినే పంచారామ క్షేత్రాలని చెబుతారు. వీటిలో అమరారామం అఘోర ముఖానికి , ద్రాక్షారామం తత్పురుష ముఖానికి, కుమారారామం వామదేవ రూపానికి, సోమారామం సద్యోజాత రూపానికి, క్షీరారామం ఈశాన ముఖానికి ప్రతీకలని అంటారు.
పంచారామ క్షేత్రాలు |
- ఐదు శైవ క్షేత్రాలు పంచభూత క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి. వీటిలో నాలుగు తమిళనాడులో ఉంటే, ఒకటి ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఉంది.
- తమిళనాడులోని జంబుకేశ్వరం జల క్షేత్రంగా
- తమిళనాడులోని అరుణాచలం అగ్ని క్షేత్రంగా
- కంచిలోని ఏకాంబరేశ్వరాలయం పృథ్వీ క్షేత్రంగా
- చిదంబరంలోని నటరాజ ఆలయం ఆకాశ క్షేత్రంగా
- చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి వాయు క్షేత్రంగా ప్రసిద్ధి చెందాయి.