Thursday, January 14, 2021

History of Makar Sankranti in Telugu | మకర సంక్రాంతి గురించి మొత్తం సమాచారం తెలుసుకోండి


History of Makar Sankranti in Telugu | మకర సంక్రాంతి గురించి మొత్తం సమాచారం
History of Makar Sankranti in Telugu | మకర సంక్రాంతి గురించి మొత్తం సమాచారం తెలుసుకోండి https://studentsoula.blogspot.com/2020/01/about-makar-sankranti-in-telugu.html #studentsoula #MakarSankranti #Sankranti #January2021 History of Makar Sankranti, about Makar Sankranti, Makar Sankranti essay in telugu,  Makar Sankranti in Telugu, Makar Sankranti, Makar Sankranti, Day Celebrations, Days Special, What today special, today special, today history, Days, Important days, important days in telugu, Student Soula,

MAKAR SANKRANTI
మకర సంక్రాంతి

అర్థం:
  • సం అంటే మిక్కిలి, క్రాంతి అంటే అభ్యుదయం అని అర్థం. మంచి అభ్యుదయాన్నే ఇచ్చే క్రాంతి కాబట్టి దీన్ని సంక్రాంతిగా పేర్కొన్నారు. 
  • సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారడం అని అర్థం. సూర్యుడు ఒక సంవత్సరంలో 12 రాశులందు (మకర, కుంభ, మీన, మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు) క్రమంగా  ఒక్కో నెలలొ ఒక్కో రాశిలో ప్రవేశించడం  సంక్రాంతి. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. 
  • అయితే పుష్యమాసంలో, హేమంత ఋతువులో శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకర రాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. 
  • ఇది జనవరి మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున, అంటే జనవరి 15 తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు.

మకర సంక్రాంతి:
  • తెలుగవారికి సంక్రాంతి, తమిళులకు పొంగల్ పేరు ఏదైనా పండుగ ఒకటే. 
  • నెల రోజులు మామూలుగానే సంక్రాంతి వాతావరణం చలిచలిగా తెలుగునాట ప్రారంభమవుతుంది. ఆ నెల రోజులు తెలుగు పల్లెలు ఎంత అందంగా, ఆహ్లాదకరంగా అలరారుతాయి. పగటి వేషధారులు, రకరకాల జానపద వినోద కళాకారులు తయారవుతారు. సంక్రాంతి రోజు తమ  ఇళ్ళ  ముంగిళ్ళను రంగవల్లులు, గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. భోగినాడు భోగిమంట విధిగా వేయవలసిందే. ఆ సాయంత్రం పేరంటంలో పిల్లలకు భోగిపళ్లు తప్పవు. ఈ పెద్ద పండుగకు కొత్త అల్లుడు తప్పనిసరిగా అత్తవారింటికి వస్తాడు. కోడి పందాలు, ఎడ్ల బళ్ళ పందాలు జరుగుతాయి. గాలిపటం ఎగిరవేయుటము ఇవన్నీ సంక్రాంతి పండుగకు శోభ చేకూర్చే సర్వసామాన్య విషయాలు.
  • ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి రైతుల పండుగగా కూడా దీన్ని అభివర్ణిస్తారు. 
  • ఆంధ్రులకు, తమిళులకు పెద్ద పండుగ సంక్రాంతి. ఇది కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు (భోగి, మకర సంక్రమణం, కనుమ) కొన్ని ప్రాంతాలలో నాలుగు రోజులు (నాలుగో రోజు ముక్కనుమ) జరుపుతారు.
  • ఉత్తర భారత దేశం మరియు మరికొన్ని ఇతర భాగాలలో లోరీ, బిహు, హడగా, పొకి,  మాఘీ మొదలైన పేర్లతో పంట కోతల పండుగ గా చేస్తారు. 

(1) భోగి:
  • సంక్రాంతికి ఒక రోజు ముందు భోగి పండుగతో సంబరాలు మొదలవుతాయి. భోగి అంటే భోగ భాగ్యాలను అనుభవించే రోజు అని అర్ధం.
  • ఎలాగంటే పాడి పంటలు సమృద్ధిగా ఇళ్లకు వచ్చే కాల సమయం. ఈ రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి, ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు. తెల్లవారక ముందే భోగి మంటలతో మొదలుకుని కుటుంబంలో ఆనంద కోలాహలం ప్రారంభం అవుతుంది.
  • దీనిని సంవత్సరంలో ఆ కాలంలో ఉండే చలి పారద్రోలటానికే కాక ఇంకో సందర్భంగా కూడా జరుపుకుంటారు. ఇంట్లో ఉండే పనికిరాని బట్టలు, వస్తువులు వగైరాలను భోగి మంటల్లో వేసి, కొత్తవాటితో నిత్య నూతన జీవితం ఆరంబించటానికి గుర్తుగా కూడా ఈ రోజున భోగి మంటలు వెలిగిస్తారు.
  • సాయంత్రం పూట చాలా ఇళ్ళలో స్త్రీలు, చిన్న పిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు.దీనిలో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆటవస్తువులను ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు. 
  • భోగి పండ్లు అంటే రేగుపండ్లు. సూర్యుని రూపం, రంగు, కలిగిన రేగుపండ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో బోగిపండ్లు పోస్తారు.
భోగి మంటలు

(2) సంక్రాంతి:
  • రెండవ రోజయిన సంక్రాంతి రోజున పాలు పొంగించి, దానితో మిఠాయిలు తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్ళలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, చక్కినాలు, పాలతాలుకలు, సేమియాపాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలయిన వంటకాలు చేసి, కొత్తబట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు.
  • ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు.
  • ఈ రోజున రకరకాల ముగ్గులు వేసి, వాటి మధ్య గొబ్బెమ్మలను పెడతారు.

(3) కనుమ:
  • మూడవ రోజయిన కనుమ వ్యవసాయంలో ఏడాదంతా కష్టపడి పని చేసినా పశువులను ఆ రోజు ఎంతో బాగా చూసుకుంటారు. పశువులను శుభ్రంగా కడుగుతారు. వాటికి పూజలు చేస్తారు. పశుపాలకను మొత్తం బాగా శుభ్రం చేసి ముగ్గులేస్తారు. పశువుల కోసం ప్రత్యేకంగా వంటలు చేసి వాటికి తినిపిస్తారు.
  • కొన్ని ప్రాంతాలలో కోడి పందాలు కూడా నిర్వహిస్తారు. అంతే కాదు, వనభోజనాలను కూడా ఈరోజే నిర్వహిస్తుంటారు. కనుమ నాడు మినుము తినాలనేది సామెత. దీనికి అనుగుణంగా, ఆ రోజున గారెలు, ఆవడలు చేసుకోవడం ఆనవాయితీ.  
  • కనుమ రోజున మాంసాహారం తినడం ఆంధ్ర దేశాన ఆనవాయితీగా వస్తూంది. మాంసా హారులు కాని వారు, గారెలతో (మినుములో మాంసకృతులు హెచ్చుగా ఉంటాయి కనుక దానిని శాకా హార మాంసంగా పరిగణించి కాబోలు) సంతృప్తి పడతారు.
  • అలాగే కనుమ రోజున ప్రయాణించటం ఆశుభంగా భావిస్తారు. 

(4) ముక్కనుమ:
  • కనుమ మరునాటిని ముక్కనుమ అని అంటారు. దీనికి బొమ్మల పండుగ అని పేరు.

ఉత్తరాయణం - దక్షిణాయణం:
  • పన్నెండు నెలల సంవత్సర కాలములో ఆరు నెలల దక్షిణాయణము దేవతలకు ఒక రాత్రి, ఆరు నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు.
ఉత్తరాయణం:
  • సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము. మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము అవుతుంది. ఆ తరువాత కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలము ఉత్తరాయణము. 
  • శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయనము.
  • పన్నెండు నెలల సంవత్సర కాలములో ఆరు నెలల దక్షిణాయణము దేవతలకు ఒక రాత్రి, ఆరు నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్య కాలము. కనుకనే ఉత్తరాయనము వరకూ ఎదురు చూసి ఉత్తరాయణము ప్రవేశించిన తర్వాత తనువును చాలించాడు మహానుభావుడైన భీష్ముడు.
దక్షిణాయణం:
  • కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గరి నుండి మొదలై, ఆ తరువాత సింహ, కన్య, తుల, వృశ్చికం,  ధనూ రాశులలో కొనసాగినంత కాలము దక్షిణాయణం.
  • మానసికమైన అర్చనకు,ధ్యానానికీ, యోగానికీ, దీక్షలకు, బ్రహ్మచర్యానికి, నియమ నిష్టలకు అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయణము.

సంక్రాంతి గురించి పురాణాల్లో:
  • ఈరోజు నుంచి అంటే ఉత్తరాయనము నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించినవారు స్వర్గానికి వెళ్తారని హిందువుల నమ్మకం. 
  • జయసింహ కల్పద్రుమం అనే గ్రంథంలో సంక్రాంతిని ఇలా విర్వచించారు
"తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరతః సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తరః రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః"
భావం - మేషం మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి.
  • ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేయు ఏ దానమైన శ్రేష్టమైనదని చెప్పబడింది.

పండుగ ప్రత్యేకతలు:

ముగ్గులు:
  • తెలుగువారి లోగిళ్లు ఆనందంతో మురిసే వేడుక. ఎంతో ఆనందంగా జరుపుకొనే ఈ పర్వదినానికి అసలైన శోభను తెచ్చేది మాత్రం రంగవల్లులు. అందులో పెట్టే గొబ్బెమ్మలే. 
  • తెలుగింటి ఆడపడుచులు తమ ప్రతిభను వాకిళ్లలో ముగ్గుగా తీర్చిదిద్ది.. రంగులు అద్ది ఈ పెద్ద పండుగను మరింత వైభవోపేతం చేస్తారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

గొబ్బెమ్మలు (గొబ్బిళ్ళు):
  • స్త్రీలు ముగ్గులు వేసి, వాటి మధ్య ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెడతారు.
  • గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళ్ళైన గోపికలకు సంకేతం. ఈ గొబ్బెమ్మల తలమీద కనిపించే రంగుల పూలరేకులు, పసుపు కుంకుమలు ఆ గోపికలందరూ భర్తలు జీవించియున్న పునిస్త్రీలకు సంకేతం.
  • ఆ గోపికా స్త్రీల రూపాలకు సంకేతమే గోపీ + బొమ్మలు = గొబ్బెమ్మలు. గొబ్బెమ్మల మధ్య ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం.
  • సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణ భక్తి తమకూ కలగాలని ప్రార్థిస్తుంటారు.

భోగిపళ్ళు:
  • భోగి పండ్లు అంటే రేగుపండ్లు. రేగి పండ్లను బదరీఫలం అని కూడా పిలుస్తారు.
  • శివుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపించారని చెబుతారు. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని ప్రతీతి.
  • సూర్యుని రూపం, రంగు కలిగిన రేగుపండ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో బోగిపండ్లు పోస్తారు.
భోగి పండ్లు

హరిదాసు:
  • హరిదాసు అనే పేరుతో మూడు వర్గాలలో ప్రసిద్దులు కలరు.
  • మొదటి వర్గం: వీరు శ్రీహరి గాధల వ్యాప్తికి కృషి చేయుచూ హరికథ అనే ప్రక్రియ ద్వారా ప్రదర్శనలిచ్చుచూ ఉందురు.
  • రెండవ వర్గం: కర్ణాటక ప్రాంతములో హరిదీక్ష తీసుకొని భజన, గానం, నృత్యాల ద్వారా హరి నామాన్ని వ్యాప్తి చేయువారు.
  • మూడవ వర్గం: వీరు హరినామ సంకీర్తన చేయుచూ కార్తీకమాసము మరియు సంక్రాంతి సమయాల్లో గ్రామములలో బిక్షాటన చేయువారు.
  • సంక్రాంతి సమయాల్లో వచ్చే హరిదాసుల తలపై అక్షయపాత్ర, ఒక చేతితో చిడతలు, మరో చేత్తో తంబూరా మీటుతూ శ్రీకృష్ణ లీలామృతగానాన్ని కీర్తిస్తూ గ్రామవీధుల్లో సంచరిస్తారు.
  • తలమీద గుమ్మడి కాయా ఆకారంలో గల పాత్ర... గుండ్రముగా ఉండే భూమికి సంకేతం. దాన్ని తలమీద పెట్టుకొని ఉండటం... శ్రీహరి అయిన తానే భూమిని ఉద్దరిస్తున్నానని (ఉత్ + దరించు = తలమీద పెట్టుకోవడం) అని చెప్పే దానికి సంకేతం. హరినామ కీర్తన చేస్తూ రావడం తను ఏ భోగాలకూ లొంగను కేవలం హరినామ సంకీర్తనకే వచ్చే వాడిననీ తనకు తమపర భేదాలు లేవనీ అందుకే ప్రతి ఇంటికీ తిరుగుతూ వస్తాడనే సంకేతం.
  • మనుషులు ఇచ్చే ధానధర్మాలు అందుకుని వారికీ ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కలగాలని దీవిస్తుంటారు హరిదాసులు. శ్రీకృష్ణునికి మరోరూపం హరిదాసులని అంటారు పెద్దలు. గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి, హరినామ స్మరణ చేసే వారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపంలో వైకుంఠపురం నుండి శ్రీమహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం.
హరిదాసు
గంగిరెద్దు:
  • గంగిరెద్దులాట ఒక ప్రాచీన జానపద కళారూపం. సంక్రాంతి సీజన్లో తెలుగు సాంప్రదాయాలకు గుర్తు సన్నాయి అప్పన్న, ప్రజలకు సన్నాయి పాటలు వినిపిస్తూ... డోలు కొట్టి, శిక్షణ ఇచ్చిన గంగిరెద్దును పట్టుకొని తిరిగుతుంటారు.
"డూ డూ బసవన్నా ఇటురారా బసవన్నా 
వురుకుతు రారన్నా రారన్న బసవన్నా 
అమ్మవారికీ దండం బెట్టు 
అయ్యగారికీ దండం బెట్టు 
మునసబు గారికి దండం బెట్టు 
కరణం గారికి దండం బెట్టు 
రారా బసవన్నా, రారా బసవన్నా"
అంటూ ఈ ఇంటికి మేలు జరుగుతాదని చెప్పు, మంచి జరుగుతాదని చెప్పు అంటూ గంగిరెద్దులతో తలలను ఊపిస్తారు.
  • "గంగిరెద్దుల వాడు కావరమణచి ముకుతాడు పొడిచి పోటెద్దులట్లు" అని పలనాటి వీర చరిత్రలో శ్రీనాథుడు ఉదహరించడాన్ని బట్టి ప్రాచీనకాలం నుంచీ ఈ గంగిరెద్దాటలు ప్రచారంలో ఉన్నాయని తెలుస్తుంది.
గంగిరెద్దు
గాలిపటాలు:
  • సంక్రాంతి అంటే గుర్తుకొచ్చేది గాలిపటం అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. సంక్రాంతినే కొన్ని ప్రాంతాల్లో పతంగుల పండుగ అని అంటారు. పతంగి అంటే గాలిపటం. 
  • వింటర్  సీజన్లో చల్లని వాతావరణం కారణంగా ఇల్లలోనే ఎక్కువగా గడపడం వల్ల ఎక్కువ జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. చర్మం మరింత డ్రైగా మారుతుంది. కాబట్టి గాలిపటాలను భయట ఎగురవేయడం వల్ల చర్మం డ్రైగా ఉంటుంది.
  • ఎండలో గాలిపటాలను ఎగురవేయడం వల్ల ఫిజికల్ ఎక్సర్ సైజ్ వల్ల మజిల్స్ ఫ్రీ అవుతాయి, శరీరానికి కావల్సిన విటమిన్ డి పుష్కలంగా అందుతుంది. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి.
  • సంక్రాంతికి గాలిపటాలు ఎగరవేయడం వెనక ఓ కథ చెబుతారు. సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఇది దేవతలకు పగలు అని నమ్మకం. దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారట. దేవతలకి స్వాగతం పలికేందుకు, వారి దృష్టిని ఆకర్షించేందుకు గాలిపటాలు ఎగరేయాలని చెబుతారు.
గాలిపటం
దానాలు:
  • ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేయు ఏ దానమైన శ్రేష్టమైనదని చెప్పబడింది. ధాన్యం,  ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు దుంపలు, నువ్వులు, చెరకు మొదలయినవి దానం చేస్తారు. ఇవి కాక ఈ కాలమందు చేయు  గోదానం వలన స్వర్గ  వాసం కలుగునని విశ్వసిస్తారు.

కోడిపందెం:
  • కోడిపందెం అనేది రెండు పందెం కోళ్ళ మధ్య నిర్వహించే క్రీడ. ఈ పందేలను ప్రతీ యేటా సంక్రాంతి పండుగ సమయంలో నిర్వహిస్తుంటారు. ఈ పందాలు ప్రపంచ పురాతన పందాలుగా చరిత్రలో చెప్పబడ్డాయి.
  • మన రాష్ట్రంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో భారీ ఏర్పాట్లతో పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. ఈ పందెం కోసం ప్రత్యేకంగా పెంచే కోడిపుంజులను పందెం కోళ్ళు అంటారు. వీటి ఆహార విషయంలో యజమానులు ఎంతో శ్రద్ధ వహించి పెంచుతారు.
  • పందెం సమయంలో పందెం కోడి కాలికి మూడు నుండి నాలుగు అంగుళాలు చురకత్తిని కట్టి పందెంలోకి దించుతారు. బెట్టింగు జరిగే అవకాశం ఉన్నందున ఈ పందేల నిర్వహణ సాంప్రదాయంగా కొనసాగుతూ ఉన్నప్పటికీ వీటి నిర్వహణకు ప్రభుత్వ అనుమతి ఉండదు.
  • సంప్రదాయం పేరుతో సాగే కోడిపందేలలో డబ్బే పరమావధిగా మారింది. త్వరగా పందేలు పూర్తిచేసేందుకు, అడ్డదారుల్లో గెలిచేందుకు కత్తులకు విషరసాయనాలు పూసేందుకు కొందరు పూనుకుంటున్నారు. అలాగే బరిలో దిగే కోళ్లకు స్టెరాయిడ్స్, పెయిన్‌ కిల్లర్లు ఇష్టానుసారం వినియోగిస్తున్నారు.
కోడిపందెం
  • కుక్కుట శాస్త్రం అనగా పందెం కోడిపుంజుల గురించి వ్రాయబడిన పంచాంగం. సంస్కృత భాషలో కుక్కుటము అనగా కోడిపుంజు.
  • కోడి పుంజుల సంరక్షణ, కోడి పుంజుల వర్గీకరణ, ఏ సమయాల్లో పందెము వేయాలి, కోడి పుంజు జన్మ నక్షత్రము, కోడి పుంజు జాతకము మొదలుగు విషయాలు ఈ శాస్త్రములో ఉండును.
  • శతాబ్దాల కాలం నుండి ఆంధ్ర రాజులు తమ పౌరుషానికి ప్రతీకగా సంక్రాంతి రోజుల్లో కుక్కుట శాస్తాన్ని ఆచరిస్తూ కోడి పందాలను నిర్వహించేవారు.
  • కుక్కుట శాస్త్రాన్ని ఎవరు రచించారు, ఎప్పుడు రచించారు అనేది తెలియదు కాని, బొబ్బిలి యుద్ధం, పల్నాటి యుద్ధం తర్వాత ప్రాచుర్యం పొందింది. 
కుక్కుట శాస్త్ర పుస్తక ముఖపటం

జల్లికట్టు (Jallikattu):
  • తమిళనాడులో సంక్రాంతి సంబరాలలో ఎద్దులను మచ్చిక చేసుకుని, లొంగ దీసుకొనే ఒక ఆట. ఇది స్పెయిన్లో జరిగే ఆటకు దగ్గరగా ఉన్నా దీని విధానం వేరుగా ఉంటుంది. జల్లికట్టులో ఎద్దులను చంపరు. మచ్చిక చేసుకోవాలను కొనేవారు అసలు ఏ ఆయుధాన్ని ఉపయోగించకూడదు.
  • తమిళనాడులోని గ్రామాలలో సంక్రాంతి తరువాత వచ్చే కనుమ పండుగ నాడు దీనిని నిర్వహిస్తారు. మదురైకి దగ్గర్లో ఉన్న అలంగనల్లూరు దగ్గర నిర్వహించే పోటీలు ప్రముఖమైనవి. దీన్నే మంజు విరాట్టు అని కూడా వ్యవహరిస్తారు. మంజు విరాట్టు అనగా ఎద్దుల్ని మచ్చిక చేసుకోవడం అని అర్థం.
  • కొన్ని తమిళ పురాణాల ప్రకారం పూర్వకాలంలో మహిళలు జల్లికట్టులో విజేతలైన వారిని తమ భర్తలుగా ఎంచుకునే వారని తెలుస్తుంది.
  • నీలగిరి జిల్లాకు చెందిన కరిక్కియూర్ అనే గ్రామంలో సుమారు 3500 సంవత్సరాల వయసుగల శిలా ఫలకాలపై మనుషులు ఎద్దులను తరిమే దృశ్యాలు చెక్కబడి ఉన్నాయి. ఇంకా మధురైకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కళ్ళుత్తు మెట్టుపట్టి అనే ప్రాంతంలో లభ్యమైన ఒక రాతి ఫలకం మీద కూడా ఒక మనిషి ఎద్దును నియంత్రిస్తున్నట్లుగా చిత్రించబడి ఉంది. దీని వయసు కూడా సుమారు 1500 సంవత్సరాలు ఉండవచ్చునని శాస్త్రవేత్తల అంచనా.
  • ఈ క్రీడతో మనుషులు గాయాలు పాలవడంతోపాటు, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోవడం జరుగుతోంది. 2010-14 మధ్యకాలంలో 17 వుంది మృత్యువాత పడ్డారని, సుమారు 1100 వుంది గాయూల పాలయ్యూరని ఒక నివేదికలో వెల్లడైంది.
  • జంతువులను క్రూరంగా హింసించడంతోపాటు, ఈ ఆటలో పాల్గొనే  మనుషుల భద్రతకు ముప్పు ఉండడంతో, 7 మే 2014 న భారత సుప్రీంకోర్టు జల్లికట్టును పూర్తిగా నిషేధించింది.
  • జల్లికట్టు నిషేధాన్ని వ్యతిరేకిస్తూ 8 జనవరి 2017 న చెన్నై మెరీనా బీచ్ లో అనేక వందల మంది నిరసనకారులు ర్యాలీ నిర్వహించారు. ప్రజల నిరసనతో, క్రీడను కొనసాగించడానికి 2017 లో కొత్త ఆర్డినెన్స్ రూపొందించబడింది.
జల్లికట్టు

కొన్ని విశేషాలు:
  • హిందువుల పండుగలలో సంక్రాంతి మాత్రమే సౌరగమనాన్ని అనుసరించి వస్తుంది. గ్రెగోరియను కాలెండరు కూడా సౌరమానాన్ని అనుసరిస్తుంది కనుక సంక్రాంతి ప్రతీ సంవత్సరం ఒకే తేదీన వస్తుంది. మిగిలిన పండుగలన్నీ భారతీయ సాంప్రదాయం ప్రకారం చాంద్రమానాన్ని అనుసరించి వస్తాయి. కాబట్టి గ్రెగోరియను కాలెండరు ప్రకారం ప్రతీ  సంవత్సరం వేరువేరు రోజుల్లో వస్తాయి.
  • పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించినవారు స్వర్గానికి వెళ్తారని హిందువుల నమ్మకం. 
  • ఆది శంకరాచార్యుడు ఈ రోజునే సన్యాసం స్వీకరించాడు.
  • ఆంధ్ర ప్రదేశ్లో సినీ నిర్మాతలు తమ సినిమాలను సంక్రాంతి సమయంలోనే విడుదల చేయటం శుభప్రదంగా భావిస్తారు.
  • పుష్యమాసములో వైష్ణవ భక్తులు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి సంక్రాంతి పండుగ రోజున గోదాకల్యాణం జరిపి తమ వ్రతాన్ని పరిసమాప్తి గావించి తరిస్తారు
  • పూర్వము గోదాదేవి పూర్వఫల్గుణ నక్షత్రం లో కర్కాటక లగ్నం లో తులసి వనం లో జన్మించినది. ఆమె గోపికలతో కలిసి శ్రీకృష్ణుడిని ఆరాధించినది ధనుర్మాసం మొత్తం ఒక నెల రోజులు నిష్టతో వ్రతమాచరించి చివరి రోజైన మకర సంక్రాంతి నాడు విష్ణుమూర్తిని పెళ్ళి చేసుకుంది.ఈ విధంగా మకర సంక్రాంతికి ఎన్నో ప్రత్యేకతలను చోటు చెసుకుంది.

వీటిని కూడా చూడండి:

No comments:

Post a Comment