Home

Evolution of Indian Constitution in Telugu | భారత రాజ్యాంగ పరిణామ క్రమం | Student Soula

దయచేసి మీ సలహాలను సూచనలను అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలుపవలసిందిగా అభ్యర్థిస్తున్నాను.... Contact: studentsoula@gmail.com

Evolution of Indian Constitution in Telugu | భారత రాజ్యాంగ పరిణామ క్రమం | Student Soula

Table of Contents:-

  1. రాజ్యాంగం
  2. భారత రాజ్యాంగ చరిత్ర
  3. రెగ్యులేటింగ్ చట్టం - 1773
  4. పిట్స్ ఇండియా చట్టం - 1784
  5. చార్టర్ చట్టం - 1793
  6. చార్టర్ చట్టం - 1813
  7. చార్టర్ చట్టం - 1833
  8. చార్టర్ చట్టం - 1853
  9. భారత రాజ్యాంగ చట్టం - 1858
  10. భారత కౌన్సిల్ చట్టం - 1861
  11. భారత కౌన్సిల్ చట్టం - 1892
  12. భారత కౌన్సిల్ చట్టం - 1909 (మార్లే-మింటో సంస్కరణలు)
  13. భారత ప్రభుత్వ చట్టం - 1919 (మాంటేగు-ఛేమ్స్‌ఫర్డ్ సంస్కరణలు)
  14. సైమన్ కమిషన్ - 1927
  15. నెహ్రూ రిపోర్ట్ - 1928
  16. రౌండ్ టేబుల్ సమావేశాలు
    1. దీపావళి ప్రకటన (1929)
    2. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం
    3. గాంధీ-ఇర్విన్ ఒప్పందం
    4. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం
    5. కమ్యూనల్ అవార్డ్ (1932)
    6. మూడవ రౌండ్ టేబుల్ సమావేశం
  17. భారత ప్రభుత్వ చట్టం - 1935
  18. లిన్ లిత్ గో - ఆగస్ట్ ప్రతిపాదనలు
  19. క్రిప్స్ ప్రతిపాదనలు (1942)
  20. సి.ఆర్.ఫార్ములా (1944)
  21. వేవెల్ ప్రణాళిక (1945)
  22. క్యాబినెట్ మిషన్ (క్యాబినెట్ రాయబారం)
  23. తాత్కాలిక ప్రభుత్వం (1946)
  24. అట్లి ప్రకటన (1947)
  25. మౌంట్ బాటన్ ప్రణాళిక (1947)
  26. భారత స్వాతంత్ర్య చట్టం (1947)
  27. వీటిని కూడా చూడండీ


రాజ్యాంగం (Constitution):
  1. రాజ్యాంగం అనేది ప్రజాస్వామిక దేశాల్లో సర్వోన్నత శాసనం మరియు మౌలిక చట్టం. 
  2. దేశంలోని అన్ని చట్టాలకు రాజ్యాంగమే మూలాధారం. 
  3. దేశంలోని పరిపాలనా వ్యవస్థలు, వాటి అధికారాలు, విధులకు సంబంధించిన ప్రాథమిక సూత్రాలను రాజ్యాంగంలో పొందుపరుస్తారు.
  4. రాజ్యాంగ భావనను శాస్త్రీయంగా వివరించిన మొదటి మొదటి తత్వవేత్త అరిస్టాటిల్.
    1. ఈయనను రాజకీయ శాస్త్ర పితామహుడు (Father of Political Science) అంటారు.
    2. రాజ్యాంగ పాలన క్రింద ప్రజలు కొనసాగడం చైతన్యానికి ప్రతీకే తప్ప నియంత్రణకు, బానిసత్వానికి సంకేతం కాదని పేర్కొన్నాడు.
  5. అతిపెద్ద లిఖిత రాజ్యాంగం: భారత రాజ్యాంగం

భారత రాజ్యాంగ చరిత్ర:
  1. బ్రిటిష్ రాణి ఎలిజిబెత్-1 ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వ్యాపార కార్యకలాపాల నిర్వహణ కోసం 1600 డిసెంబర్ 31న అనుమతి జారి చేసింది.
  2. ఈస్ట్ ఇండియా కంపెనీ బక్సార్ యుద్ధం (1765)లో విజయం సాధించి, బెంగాల్ దివానీ అధికారాన్ని పొందడం ద్వారా ఒక రాజకీయ శక్తిగా ఎదిగింది. ఇది కంపెనీ పాలనకు పునాదైంది.
  3. అనేక మార్పులతో కంపెనీ పాలన 1858 వరకు కొనసాగింది.
  4. 1858 నుంచి 1947 వరకు బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యక్షంగా పాలన సాగించింది.
  5. బ్రిటిష్ పాలనలో భారతీయుల డిమాండ్లు, విన్నపాలు, చర్చలు, విమర్శలు, ఉద్యమాల ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం అనేక చట్టాలను చేసింది.
  6. ఈ చట్టాల క్రమాన్ని భారత రాజ్యాంగ చరిత్రగా చెప్పవచ్చు.

రెగ్యులేటింగ్ చట్టం - 1773:
  1. ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి బ్రిటిష్ పార్లమెంట్ చేసిన మొట్టమొదటి చట్టం.
  2. అందుకే దీనిని భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి లిఖిత చట్టం అంటారు.
  3. కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి ఉద్దేశింపబడినందున దీనిని రెగ్యులేటింగ్ చట్టం అంటారు.
  4. అంతవరకు వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈస్ట్ ఇండియా కంపెనీకి ఈ చట్టం ద్వారా మొదటిసారిగా రాజకీయ పరిపాలన, అధికారాలు సంక్రమించాయి.
  5. ఈ చట్టాన్ని 18 మే 1773 లో అప్పటి బ్రిటన్ ప్రధానమంత్రి లార్డ్ నార్త్ బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టాడు.
ముఖ్యాంశాలు:
  1. 20 సంవత్సారాల వరకు ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపార అనుమతి ఇచ్చారు.
  2. బెంగాల్ గవర్నర్ యొక్క హోదాను ‘గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్’ గా మార్చారు
  3. ఇతనికి సలహాలు ఇవ్వడానికి నలుగురు సభ్యులతో కూడిన కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు.
  4. మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్: వారెన్ హేస్టింగ్
  5. బొంబాయి, మద్రాసు ప్రెసిడెన్సీలకు చెందిన గవర్నర్స్ ను బెంగాల్ గవర్నర్ జనరల్ కు ఆధీనులుగా చేశారు.
  6. కలకత్తాలో సుప్రీం కోర్ట్ ఏర్పాటుకు ప్రతిపాదించారు.
    1. కలకత్తాలోని పోర్ట్ విలియంలో 1774 న ఏర్పాటు చేశారు.
    2. ఒక ప్రధాన న్యాయమూర్తి & ముగ్గురు సాధారణ న్యాయమూర్తులు ఉంటారు.
    3. మొదటి ప్రధాన న్యాయమూర్తి: సర్ ఎలిజా ఇంఫే
పిట్స్ ఇండియా చట్టం - 1784:
  1. ఈ చట్టాన్ని 1784లో ఆనాటి బ్రిటన్ ప్రధానమంత్రి విలియం పిట్ ప్రతిపాదించడం వలన దీనిని పిట్స్ (Pitt’s) ఇండియా చట్టంగా వ్వవహరిస్తారు.
  2. ఈస్ట్ ఇండియా కంపెనీ విధులను వాణిజ్య మరియు రాజకీయ విధులుగా వేరు చేశారు.
    1. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే ఒక నూతన విభాగాన్ని ఏర్పాటు చేసి, కంపెనీ రాజకీయ వ్యవహారాలను దీనికి అప్పగించారు.
    2. అలాగే, అప్పటికే ఉన్న కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ను వాణిజ్య వ్యవహారాలకే పరిమితం చేశారు.
    3. కోర్ట్ ఆఫ్ డెరెక్టర్స్ మరియు బోర్డ్ ఆఫ్ డెరెక్టర్స్ అనే రెండు స్వతంత్ర సంస్థలు ఏర్పాటు చేయడం వల్ల దీనిని ద్యంద్వ పాలనకు నాంది ప్రస్తావనగా చెప్పవచ్చు.
  3. గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలికి ప్రెసిడెన్సీ ప్రాంతాలపై ప్రత్యక్ష నియంత్రణ అధికారాన్ని ఇచ్చారు.
  4. ఈ చట్టాన్ని భారతదేశంలో కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడానికి చేయబడినదిగా మార్క్స్ మరియు ఎంగిల్స్ అభివర్ణించారు.
చార్టర్ చట్టం - 1793:
  1. చార్టర్ అంటే ఒక సంస్థ యొక్క హక్కులు, అధికారాలు, బాధ్యతలను వివరించే అధికార పత్రం.
  2. కంపెనీకిగల వ్యాపార గుత్తాధిపత్యం మరొక 20 సంవత్సరాలు పొడిగించారు.
  3. ఈ చట్టం ప్రకారం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ లోని సభ్యుల జీతాలు మరియు ఇతర ఖర్చులు భారతదేశ రెవెన్యూ నుండే చెల్లించబడతాయి.
చార్టర్ చట్టం - 1813:
  1. భారతదేశంలో కంపెనీ పాలనను మరో 20 ఏళ్లు పొడిగించారు.
  2. కంపెనీ పాలన కొనసాగినప్పటికీ కంపెనీ ప్రాంతాలపై రాణి/ చక్రవర్తి సార్వభౌమాధికారాన్ని స్పష్టంగా ప్రకటించింది.
  3. పన్నులు విధించడానికి, అవి చెల్లించని వారిపై చర్యలు తీసుకునే అధికారాన్ని స్థానిక సంస్థలకు ఇచ్చారు.
  4. భారతీయులకు మతపరమైన, విద్యాపరమైన అధ్యయనం కోసం ఒక లక్ష రూపాయలతో ఒక నిధిని ఏర్పాటు చేశారు.
  5. ఈ చట్టం ద్వారా భారత్ లో వర్తకం చేయడానికి అందరికీ అవకాశం కల్పించారు.
  6. భారత్ లో మిషనరీలు ప్రవేశించి చర్చ్ లు, ఆసుపత్రులు, విద్యాలయాలు స్థాపించడం వలన మత మార్పిడులకు అవకాశం ఏర్పడింది.
చార్టర్ చట్టం - 1833:
  1. భారతదేశంలో కంపెనీ పాలనను మరో 20 ఏళ్లు పొడిగించారు.
  2. బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాను ఈ చట్టం ద్వారా ‘గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా’గా మార్చారు.
  3. మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా: విలియం బెంటింగ్
  4. కంపెనీ వ్యాపార లావాదేవీలను రద్దు చేసి, పరిపాలనా సంస్థగా మార్చారు.
  5. సివిల్ సర్వీసుల నియామకాల్లో సార్వజనిక పోటి పద్ధతిని ప్రతిపాదించారు. కానీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకించడంవల్ల అమల్లోకి రాలేదు.
  6. ఈ చట్టాన్ని భారతదేశంలో కేంద్రీకృత పాలనకు తుది మెట్టుగా అభివర్ణిస్తారు.
  7. భారతీయ శాసనాలను క్రోడీకరించడానికి ఒక భారతీయ ‘లా (LAW) కమిషన్’ ను నియమించారు. 
    1. లా కమిషన్ మొట్టమొదటి అధ్యక్షుడు: లార్డ్ మెకాలే
    2. వివిధ లా కమిషన్‌ల సిఫారసుల ద్వారా సివిల్ ప్రోసిజర్ కోడ్ (1859), ఇండియన్ పీనల్ కోడ్ (1860), క్రిమినల్ ప్రోసీజర్ కోడ్ (1861) లను రూపొందించారు.
చార్టర్ చట్టం - 1853:
  1. చార్టర్ చట్టాల్లో ఇది చిట్ట చివరి చట్టం.
  2. అతి తక్కువ కాలం అమల్లో ఉన్న చార్టర్ చట్టం ఇదే.
  3. గవర్నర్ జనరల్ యొక్క సాధారణ మండలి అధికారాలను శాసన మరియు కార్యనిర్వాహక విధులుగా విభజించారు.
  4. శాసనాలు రూపొందించే ప్రక్రియ కొరకు ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు.
  5. ఇది బ్రిటీష్ పార్లమెంటు వలె తన విధులను నిర్వహిస్తుంది. అందుకే దీనిని మినీ పార్లమెంటు అనేవారు.
  6. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో మొదటిసారిగా స్థానిక ప్రతినిధులకు ప్రాతినిధ్యాన్ని కల్పించారు.
  7. సివిల్ సర్వీసు నియామకాలను సార్వజనిక పోటి విధానం (Open Merit) ద్వారా నియమించే పద్ధతిని ప్రవేశపెట్టారు.
    1. ఇందుకోసం లార్డ్ మెకాలె కమిటీని 1854లో ఏర్పాటు చేశారు.
భారత రాజ్యాంగ చట్టం - 1858:
  1. 1857 సిపాయిల తిరుగుబాటుతో భారతదేశంలో కంపెనీ పరిపాలన అంతమై బ్రిటీష్ రాణి/రాజు పరిపాలన ఏర్పడింది.
  2. బ్రిటీష్ రాణి విక్టోరియా భారత పరిపాలనా అధికారాన్ని నేరుగా చేపడుతూ 1858 నవంబర్ 1న ప్రకటన జారి చేసింది.
  3. 1858 నుండి రాణి/రాజు నేరుగా అధికారాన్ని చేపట్టడం వల్ల, ఆ తర్వాత చేసిన చట్టాలను/ సవరణలను భారత ప్రభుత్వ చట్టాలు/ కౌన్సిల్ చట్టాలు అంటారు.
ముఖ్యాంశాలు:
  1. 1784లో ప్రవేశపెట్టిన బోర్డ్ ఆఫ్ కంట్రోల్ మరియు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ద్వంద్వ పాలన రద్దయింది.
వైస్రాయ్:
  1. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా హోదాను వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చారు.
  2. మొదటి వైస్రాయ్: లార్డ్ కానింగ్
  3. దేశంలో బ్రిటీష్ రాణి యొక్క మొట్టమొదటి ప్రత్యక్ష ప్రతినిధి: వైస్రాయ్
  4. దేశ పాలనా బ్రిటీష్ రాణి పేరుతో ఇతను నిర్వహిస్తాడు.
  5. భారతదేశంలో అత్యున్నత స్థానాన్ని కలిగిన వైస్రాయ్‌ని రాజ ప్రతినిధిగా 5 సంవత్సరాల కాలానికి నియమించడం జరిగింది.
  6. ఇతనికి సహాయంగా ఒక కార్యనిర్వాహక మండలి ఉండేది.
  7. వైస్రాయ్ & గవర్నర్ జనరల్: రెండు హోదాలు ఒకరికే ఉంటాయి. బ్రిటీష్ రాణి/రాజు ప్రతినిధిగా ఉంటే వైస్రాయ్ అని, భారతదేశ పరిపాలనా పరంగా అధిపతిగా ఉంటే గవర్నర్ జనరల్ అని అంటారు.
భారత రాజ్య కార్యదర్శి:
  1. భారత రాజ్య కార్యదర్శి (Secretary of State for India) అనే కొత్త పదవిని సృష్టించారు. 
  2. ఇతడు బ్రిటీష్ మంత్రి వర్గానికి చెందినవాడు. అన్ని విషయాలలో ఇతనిదే తుది నిర్ణయం
  3. మొదటి భారత రాజ్య కార్యదర్శి: లార్డ్ స్టాన్లీ
భారత కౌన్సిల్ చట్టం - 1861:
  1. భారతదేశంలో శాసన నిర్మాణ ప్రక్రియలో మొదటిసారిగా భారతీయులకు ప్రాతినిధ్యాన్ని కల్పించారు.
  2. వైస్రాయ్ కొంతమంది భారతీయులను అనధికార సభ్యులుగా కౌన్సిల్‌లోకి నామినేట్ చేశారు.
  3. ఈ విధంగా నామినేట్ అయినవారిలో బెనారస్ రాజు, పాటియాలా మహారాజు, దినకర్ రావు ఉన్నారు.
  4. 1773 చట్టం ద్వారా రద్దు చేయబడిన బాంబే మరియు మద్రాస్ ప్రెసిడెన్సీల శాసనాధికారాలను పునరుద్ధరించారు.
  5. శాసన కౌన్సిళ్ళ సమ్మతి లేకుండానే ఆర్డినెన్సులను జారీ చేసే అధికారాన్ని వైస్రాయ్‌కు కల్పించారు.
భారత కౌన్సిల్ చట్టం - 1892:
  1. కేంద్ర శాసన మండలిలో అనధికార సభ్యులను 10 కి తక్కువ కాకుండా, 16 కు మించకుండా, అదే విధంగా రాష్ట్రా శాసన మండళ్ళలో 8 కి తక్కువ కాకుండా 20 కు మించకుండా నియంత్రించారు.
  2. మొదటిసారిగా పరోక్ష ఎన్నికల భావన వచ్చింది.
  3. కేంద్ర శాసన మండలికి ఎన్నికైన భారతీయ ప్రముఖులు: గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్ షా మెహతా, సురేంద్రనాథ్ బెనర్జీ, రాస్ బిహారి ఘోష్.
  4. ఈ చట్టం ద్వారా శాసన మండలి అధికారాలను విస్కృతం చేశారు.
  5. బడ్జెట్‌ను చర్చించడం, మొదలగు అధికారాలను కల్పించారు.
  6. ప్రజా ప్రయాజనాల దృష్ట్యా శాసన సభల్లో ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నలు వేయడానికి సభ్యులకు అవకాశం కల్పించారు. అయితే ఈ ప్రశ్నలను అడగడానికి గవర్నర్ మరియు గవర్నర్ జనరల్‌ల ముందస్తు అనుమతి పొందాలి.
  7. శాసన సభ (మండలి) లో తమ స్థానం నామ మాత్రమేనని గ్రహించిన భారతీయులు ఈ చట్టాన్ని వ్యతిరేకించారు.
భారత కౌన్సిల్ చట్టం - 1909:
  1. ఆనాటి భారత రాజ్య కార్యదర్శి: లార్డ్ మార్లే, భారత వైస్రాయ్: మింటో ఈ సంస్కరణలను తీసుకురావడానికి చొరవ తీసుకోవడంవల్ల, వారి పేర్లతో మార్లే-మింటో సంస్కరణలుగా ప్రచారంలోకి వచ్చాయి.
  2. కేంద్ర, రాష్ట్ర శాసన మండళ్ళలో సభ్యుల సంఖ్యను పెంచారు.
  3. వైస్రాయ్/ గవర్నర్‌ల యొక్క కార్యనిర్వాహక మండలిలో మొట్టమొదటి సారిగా భారతీయులకు సభ్యత్వాన్ని కల్పించారు.
  4. ఈ విధంగా సభ్యత్వాన్ని పొందిన మొదటి భారతీయుడు: సత్యేంద్ర ప్రసాద్ సిన్హా
  5. ముస్లింలకు, వ్యాపార సంఘాల సభ్యులకు ప్రత్యేక ప్రాతినిధ్యాన్ని కల్పించారు.
  6. ముస్లిం సభ్యులను ముస్లింలే ఎన్నుకునే వీలు కల్పించబడింది
  7. ఇందుకోసం ప్రత్యేక మతపరమైన నియోజక వర్గాలను ఏర్పాటు చేశారు
  8. ఆ విధంగా ఈ చట్టం మత తత్వానికి చట్టబద్ధత కల్పించినట్లయింది.
  9. అందుకే లార్డ్ మింటోను మత నియోజక వర్గాల పితామహుడిగా పేర్కొంటారు.
  10. హిందువులకు, ముస్లింలకు మధ్య వేర్పాటు బీజాలు వేసి, భారతదేశ విభజనకు దారితీసిందని జవహర్ లాల్ నెహ్రూ విమర్శించారు.
భారత ప్రభుత్వ చట్టం - 1919:
  1. ఆనాటి భారత రాజ్య కార్యదర్శి: లార్డ్ మాంటేగు, భారత వైస్రాయ్: ఛేమ్స్‌ఫర్డ్ ఈ సంస్కరణలను తీసుకురావడానికి చొరవ తీసుకోవడంవల్ల, వారి పేర్లతో మాంటేగు-ఛేమ్స్‌ఫర్డ్ సంస్కరణలుగా ప్రచారంలోకి వచ్చాయి. 
  2. మొదటిసారిగా బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రతిపాదించారు.
  3. రాష్ట్ర స్థాయిలో ద్వంద్వ పాలన ప్రవేశ పెట్టారు.
  4. రాష్ట్రాల అధికారాలను రిజర్వుడ్ మరియు ట్రాన్స్‌ఫర్డ్ రకాలుగా విభజించారు.
  5. దేశంలో మొట్టమొదటిసారిగా కేంద్ర స్థాయిలో ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టారు. 
  6. ఎగువ సభను రాష్ట్రాల మండలి (Counsil of States) గా, దిగువ సభను కేంద్ర శాసన సభ (Central Legislative Assembly) గా వ్యవహరిస్తారు.
  7. మత ప్రాతినిధ్యం సిక్కులకు, క్రిస్టియన్లకు, ఆంగ్లో-ఇండియన్లకు, ఐరోపా వారికి కూడా వర్తింప చేశారు.
  8. ఆస్తి, పన్ను చెల్లింపు ప్రాతిపదికపై పరిమితమైన ఓటు హక్కును మహిళలకు కూడా కల్పించారు. 
  9. 1920లో ట్రావెన్‌కోర్ మరియు కొచ్చి, 1921లో మద్రాస్ ప్రావిన్సస్ మహిళలకు ఓటు హక్కును కల్పించింది.
  10. లండన్‌లో భారత్ వ్యవహారాలను, ముఖ్యంగా రెవెన్యూ, పరిపాలన మొదలగు అంశాలను పర్యవేక్షించడానికి భారత హై కమిషనర్ అనే పదవిని సృష్టించారు.
  11. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌ను వేరు చేశారు.
  12. ఈ చట్టం అమలు తీరును సమీక్షించడానికి 10 సంవత్సరాల తర్వాత చట్టబద్ధత కలిగిన కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు.
విమర్శ:
  1. 1919 సంస్కరణలు అసంతృప్తి, నిరాశతో పాటుగా, సూర్యుడు లేని ఉదయంగా ఉంది: బాలగంగాధర్ తిలక్
  2. ఆ సంస్కరణలు బ్రిటీష్‌వారు ప్రకటించి ఉండాల్సింది కాదు, ఈ చట్టాన్ని భారతీయులు స్వీకరించడం తగదు: అనీబిసెంట్
సైమన్ కమిషన్ - 1927:
  1. భారత ప్రభుత్వ చట్టం - 1919లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సంస్కరణలను సమీక్షించడానికి 1927 నవంబర్‌లో నియమించబడింది.
  2. ఇందులో ఒక అధ్యక్షుడు, 6గురు సభ్యులు ఉంటారు.
  3. అధ్యక్షుడు: సర్ సైమన్
  4. ఇందులో ఒకానొక సభ్యుడైన క్లిమెంట్ అట్లి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే సమయానికి ఇంగ్లాండ్ ప్రధానిగా ఉన్నారు.
  5. ఈ కమిషన్‌లో సభ్యులందరూ ఆంగ్లేయులు కావడంవల్ల భారతీయులు దీనిని పూర్తిగా వ్యతిరేకించారు.
  6. ఈ కమిషన్ భారతదేశంలో రెండు పర్యాయాలు పర్యటించింది.
  7. ఈ కమిషన్ తన నివేదికను 1930లో సమర్పించింది. 
ముఖ్యాంశాలు:
  1. రాష్ట్రాలలో ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలనను రద్దు చేయడం
  2. మంత్రులు శాసన సభకు బాధ్యత వహించేలా చేయడం
  3. భారతీయులకు తమ ప్రభుత్వ నిర్వహణలో పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పించడం.
  4. ఏక కేంద్ర వ్యవస్థ భారతదేశానికి సరిపడదు కనుక సమాఖ్య వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడం
  5. మొదటిసారిగా సమాఖ్యను సూచించింది: సైమన్ కమిషన్
  6. భారత ప్రభుత్వ చట్టం - 1935లో సైమన్ కమిషన్ ప్రతిపాదించిన అంశాలను పొందుపరిచారు.
నెహ్రూ రిపోర్ట్ - 1928:
  1. భారత రాజ్య కార్యదర్శి లార్డ్ బిర్కెన్ హెడ్ 1927 నవంబర్‌లో బ్రిటీష్ ఎగువ సభలో మాట్లాడుతూ "అందరికి సమ్మతమైన రాజ్యాంగాన్ని భారతీయులు రూపొందించగలరా" అనే సవాలు విసిరారు.
  2. ఆ సవాలును స్వీకరించిన భారత జాతీయ కాంగ్రెస్ 1928 మే 19న బొంబాయిలో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించి, రాజ్యాంగ రచనకు మోతీలాల్ నెహ్రూ అధ్యక్షుడిగా 9 మంది సభ్యులతో కూడిన ఉప సంఘాన్ని 1928 మే 19న నియమించారు.
    1. ఇందులో సుభాష్ చంద్రబోస్ కూడా సభ్యుడుగా ఉన్నాడు.
    2. జవహర్ లాల్ నెహ్రూ దీనికి కార్యదర్శిగా పనిచేశారు.
  3. దీనిని భారతీయులు స్వంతంగా రాజ్యాంగ రచనకు చేసిన తొలి ప్రయత్నంగా చెప్పవచ్చు.
ముఖ్యాంశాలు:
  1. భారతదేశానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వడం.
  2. భాషా ప్రయుక్త రాష్ట్రాలు, స్వయం ప్రతిపత్తి రాష్ట్రాలు అనే రెండు అంశాల ఆధారంగా దేశంలో సమాఖ్య వ్వవస్థను ఏర్పాటు చేయడం.
  3. కార్యనిర్వాహక శాఖ, శాసన శాఖకు బాధ్యత వహించడం.
  4. అల్ప సంఖ్యాక వర్గాల వారికి శాసన మండళ్ళలో కనీసం 10 సంవత్సరాల పాటు కొన్ని స్థానాలను కేటాయించడం.
  5. 19 ప్రాథమిక హక్కుల ప్రస్తావన.
    1. మొదటిసారిగా ప్రాథమిక హక్కులను సూచించింది: నెహ్రూ రిపోర్ట్
రౌండ్ టేబుల్ సమావేశాలు:
  1. సైమన్ కమిషన్ నివేదిక, భారత్‌లో రాజ్యాంగపరమైన సంస్కరణలపై చర్చించేందుకు రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేశారు.
  2. ఇందులో పాల్గొని భారతీయుల సమస్యలు చర్చించడం కోసం అన్ని పార్టీలకు, వర్గాలకు ఆహ్వానం వస్తుందని ఆనాటి బ్రిటన్ ప్రధాని రామ్‌సే మెక్‌డొనాల్డ్ ఒక ప్రకటన చేశారు.
  3. మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైనవారు: మహ్మద్ అలీ జిన్నా మరియు డాII బి.ఆర్.అంబేద్కర్.

దీపావళి ప్రకటన (1929) :
  1. సైమన్ కమిషన్ నివేదికతో పాటు భారత్‌లో రాజ్యాంగ సంస్కరణపై చర్చించేందుకు లండన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందని, త్వరలో భారత్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించడం తమ అభిమతమని ఆనాటి భారత గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ అక్టోబర్ 31, 1929లో ప్రకటించారు. దీనినే ‘దీపావళి ప్రకటన’ అంటారు.

మొదటి రౌండ్ టేబుల్ సమావేశం:
  1. 1930 నవంబర్ 12 నుండి 1931 జనవరి 19 వరకు జరిగింది.
  2. 89 మంది పాల్గొన్నారు.
  3. ఇందులో జాతీయ కాంగ్రెస్ పాల్గొనలేదు.
  4. భారత రాజ్యాంగం సమాఖ్యంగా ఉండాలా లేదా ఏక కేంద్రంగా ఉండాలా అనే అంశం మీద చర్చ జరిగింది.

గాంధీ-ఇర్విన్ ఒప్పందం:
  1. గాంధీ మరియు భారత గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ మధ్య మార్చి 5, 1931 న జరిగింది.
  2. శాసనోల్లంఘన ఉద్యమంలో అరెస్ట్ అయిన గాంధీని విడుదల చేయడంతో గాంధీ - ఇర్విన్ మధ్య సమావేశం జరిగింది. దీనినే గాంధీ - ఇర్విన్ ఒప్పందం అంటారు.
ముఖ్యాంశాలు:
  1. రాజకీయ ఖైదీలను విడుదల చేయడం.
  2. శాసనోల్లంఘన సమయంలో స్వాధీనం చేసుకున్న ఆస్తులను తిరిగి ఇచ్చేయడం.
  3. శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేసి రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ పాల్గొనడం.
  4. కానీ భగత్‌సింగ్ ఉరిశిక్షను రద్దు చేసే అంశంపై మహాత్మ గాంధీ మాట్లాడ లేదు.

రెండవ రౌండ్ టేబుల్ సమావేశం:
  1. 1931 సెప్టెంబర్ 7 నుండి డిసెంబర్ 7 వరకు జరిగింది
  2. 107 మంది పాల్గొన్నారు.
  3. ఇర్విన్‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ తరుపున గాంధీ ఈ సమావేశానికి హాజరయ్యారు.
  4. ముస్లిం వర్గాలకు రెండు కొత్త ప్రొవిన్స్‌ (నార్త్ వెస్ట్రన్ ప్రొవిన్స్, సింద్) లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం చేత, దీనిని విభజించు, పాలించు అనే విధానంగా భావించి గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు.
  5. అల్ప సంఖ్యాక వర్గాల సమస్యపై ఈ సమావేశం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది.

కమ్యూనల్ అవార్డ్ (1932):
  1. మైనారిటీ వర్గాల ప్రాతినిధ్యానికి ఆనాటి బ్రిటన్ ప్రధాని రామ్‌సే మెక్ డొనాల్డ్ 1932 ఆగస్ట్ 4న ఒక ప్రతిపాదన చేశారు. దీనినే కమ్యూనల్ అవార్డ్ అంటారు.
  2. దీని ప్రకారం ముస్లింలకు, సిక్కులకు, క్రిస్టియన్లకు, షెడ్యూల్డ్ కులాలకు ప్రత్యేక నియోజక గణాలను ప్రతిపాదించారు.
  3. దీనిని డాII బి.ఆర్.అంబేద్కర్ సమర్థించారు.
  4. కాని గాంధీ దీనిని వ్యతిరేకిస్తూ, పూనాలోని ఎర్రవాడ జైలులో 1932 సెప్టెంబర్ 20 న ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. 
  5. రాజాజీ, మదన్ మోహన్ మాలవ్య వంటి నాయకులు చొరవ తీసుకుని అంబేద్కర్ మరియు గాంధీతో చర్చించి దీక్షను విరమింపజేశారు.
  6. 1932 సెప్టెంబర్‌లో పూనాలో అంబేద్కర్ మరియు గాంధీ మధ్య ఒప్పందం జరిగింది. దీనినే పూనా ఒప్పందం అంటారు.
  7. దీని ద్వారా కమ్యూనల్ అవార్డ్ కంటే ఎక్కువగా షెడ్యూల్డ్ కులాలకు అవకాశాలు లభించాయి.

మూడవ రౌండ్ టేబుల్ సమావేశం:
  1. 1932 నవంబర్ 17 నుండి డిసెంబర్ 24 వరకు జరిగింది.
  2. సమస్యలు సృష్టిస్తారనుకున్న వారికి బ్రిటీష్ ప్రభుత్వం ఆహ్వానం పంపలేదు. అందువల్ల కాంగ్రెస్ ప్రతినిధులు సమావేశానికి హాజరు కాలేదు.
  3. కేవలం 46 మంది పాల్గొన్నారు.
  4. ఈ సమావేశంలో చేసిన సిఫార్సుల్లో ఎక్కువ భాగం 1935 భారత ప్రభుత్వ చట్టంలో చేర్చారు.
భారత ప్రభుత్వ చట్టం - 1935:
  1. ఇది 1937 ఏప్రిల్ నుండి అమల్లోకి వచ్చింది.
  2. ఈ చట్టంలో 321 ప్రకరణలు, 10 షెడ్యూళ్ళు, 14 భాగాలు ఉన్నాయి.
ముఖ్యాంశాలు:
  1. అఖిల భారత సమాఖ్య ఏర్పాటు.
  2. కేంద్ర, రాష్ట్రాల మధ్య 3 జాబితాల ప్రకారం అధికార విభజన ఉంటుంది. కేంద్ర జాబితా (59 అంశాలు), రాష్ట్ర జాబితా (54 అంశాలు), ఉమ్మడి జాబితా (36 అంశాలు)
  3. అవశిష్ట అధికారాలను గవర్నర్ జనరల్‌కు ఇచ్చారు.
  4. రాష్ట్రాలలో ఉన్న ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి, కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రతిపాదించారు.
  5. కేంద్రంలో పాలనాంశాలను రిజర్వడు, ట్రాన్స్‌ఫర్డ్ అంశాలుగా విభజించారు.
  6. రాష్ట్ర స్థాయిలో ద్విసభా పద్ధతిని ప్రవేశ పెట్టారు. దేశంలోని మొత్తం 11 రాష్ట్రాలలో 6 రాష్ట్రాలలో ప్రవేశ పెట్టారు.
  7. భారత రాజ్య కార్యదర్శికున్న కౌన్సిల్‌ను రద్దు చేశారు. దీనికి బదులుగా సలహాదార్లను భారత రాజ్య కార్యదర్శికి సహాయంగా నియమించారు.
  8. కేంద్ర శాసన సభల పరిమాణాన్ని పెంచారు. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ - 260, లెజిస్లేటివ్ అసెంబ్లీ - 375.
  9. జనాభాలో 10 శాతానికి ఓటు హక్కును వర్తింప చేశారు.
  10. ఫెడరల్ కోర్ట్‌ను (సుప్రీం కోర్ట్) ఏర్పాటు చేశారు.
    1. ఒక ప్రధాన న్యాయమూర్తి, 6గురు ఇతర న్యాయమూర్తులు ఉంటారు.
    2. దీని తీర్పులే సర్వోన్నతం కాదు. వీటిని ఇంగ్లాండ్‌లో ఉన్న ప్రివి (Privy) కౌన్సిల్‌కు అప్పీల్ చేసుకోవచ్చు.
  11. బర్మాను భారతదేశం నుండి వేరు చేశారు.
  12. ఒరిస్సా, సింధ్ అనే రెండు కొత్త ప్రొవిన్సులను ఏర్పాటు చేశారు.
  13. కేంద్రంలో ఒక ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమీషన్‌ను, రాష్ట్రాలలో కూడా పబ్లిక్ సర్వీస్ కమీషన్‌ను ఏర్పాటు చేశారు.
  14. RBI ను కూడా ఏర్పాటు చేశారు.
చట్టం ప్రత్యేకత:
  1. బ్రిటీషువారు భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణల కోసం చేసిన చట్టాల్లో అతి పెద్ద చట్టం.
  2. భారత రాజ్యాంగాన్ని ఈ చట్టం యొక్క నమూనాగా వర్ణిస్తారు.
  3. రాజ్యాంగంలోని సుమారు 60% అంశాలు ఈ చట్టం నుండే గ్రహించారు.
  4. ఈ చట్టం ద్వారా మొదటిసారిగా కేంద్రంలో సమాఖ్య వ్వవస్థలు, రాష్ట్రాలలో ద్విసభా విధానాన్ని ప్రతిపాదించారు.
  5. ఈ చట్టం ప్రధానంగా స్వయం పాలనకు ఉద్దేశింపబడింది.
విమర్శ - వ్యాఖ్యానాలు:
  1. బానిసత్వానికి ఒక నూతన చట్టం, భారతదేశం పైన బలవంతంగా రుద్ద బడింది. ఇంజను లేకుండా కేవలం గట్టి బ్రేకులున్న యంత్రం: జవహార్ లాల్ నెహ్రూ
  2. భూస్వామ్య వ్యవస్థను ధృడం చేయడానికి బ్రిటీష్ పాలకులు ఆడిన నాటకం: సుభాష్ చంద్రబోస్
  3. ఖచ్చితంగా పిచ్చిది, సమూలంగా చెడ్డది, మొత్తానికి అంగీకారం కానిది: మహ్మద్ అలీ జిన్నా
లిన్ లిత్ గో - ఆగస్ట్ ప్రతిపాదనలు:
  1. భారత వైస్రాయ్ లార్డ్ లిన్ లిత్ గో ఆగస్టు 8, 1940న కొన్ని ప్రతిపాదనలను చేశాడు.
ముఖ్యాంశాలు:
  1. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశానికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే విషయాన్ని పరిశీలించడం.
  2. రాజకీయ పార్టీల ప్రాతినిధ్యంతో రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయడం.
క్రిప్స్ ప్రతిపాదనలు (1942):
  1. బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ 1942 మార్చి 11న ఒక ప్రకటన ద్వారా భారత రాజ్యాంగ సమస్యల విషయంలో అక్కడి నాయకులతో సంప్రదింపుల నిమిత్తం క్యాబినెట్ మంత్రి అయిన సర్ స్టాఫర్డ్ క్రిప్స్‌ను భారతదేశానికి పంపిస్తున్నట్లుగా పేర్కొన్నాడు.
  2. క్రిప్స్ 1942 మార్చి 22న భారతదేశానికి వచ్చాడు.
ప్రతిపాదనలు:
  1. భారతదేశానికి అవసరమైన కొత్త రాజ్యాంగాన్ని నిర్మించుటకై ఎన్నుకోబడిన రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటవుతుంది.
  2. భారతదేశానికి వీలయినంత త్వరలో స్వయం ప్రతిపత్తి ఇవ్వడం జరుగుతుంది.
  3. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం అమలులో ఉన్న రాజ్యాంగాన్ని కలిగి ఉంటవచ్చు లేదా నూతన రాజ్యాంగాన్ని రూపొందించుకోవచ్చు.
  4. గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో ఒక భారతీయునికి సభ్యత్వం ఇస్తారు.
ఇతర అంశాలు:
  1. రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి బ్రిటీష్ ప్రభుత్వం మొదటిసారిగా అధికారికంగా ప్రకటన చేసింది.
  2. కాంగ్రెస్, ముస్లిం లీగ్‌ల మధ్య అంగీకారం కుదరలేదు. ముస్లి లీగ్ ప్రత్యేక రాజ్యాంగ పరిషత్తుకై డిమాండ్ చేసింది.
  3. క్రిప్స్ ప్రతిపాదనలకు గాంధీజీ తీవ్రంగా విమర్శించారు. "దివాళా తీస్తున్న బ్యాంకు మీద ముందస్తు తేదీని వేసిన ఒక చెక్కు" అని వ్యాఖ్యానించారు.
సి.ఆర్.ఫార్ములా (1944):
  1. ముస్లిం లీగ్ సహకారం కోసం మరియు మత సమస్యల పరిష్కారం కొరకు 1944 మార్చిలో గాంధీజీ ఆమోదంతో సి. రాజ గోపాల చారి ఒక సూత్రాన్ని కాంగ్రెస్ తరపున ప్రతిపాదించారు.
  2. స్వయం నిర్ణయాధికార హక్కు కోసం పాకిస్తాన్‌ను ఏర్పాటు చేయాలనే ముస్లిం లీగ్ కోరికను ఆయన అంగీకరించారు.
వేవెల్ ప్రణాళిక (1945):
  1. భారత వైస్రాయ్/ గవర్నర్ జనరల్: లార్డ్ వేవెల్, ఆనాటి బ్రిటన్ ప్రధాని: విన్‌స్టన్ చర్చిల్‌తో చర్చించి కొన్ని ప్రతిపాదనలు చేశారు.
ముఖ్యాంశాలు:
  1. భారత్‌లో బ్రిటీషు వారి ప్రయోజనాలు కాపాడేందుకు ఒక హైకమీషనర్‌ను నియమించడం.
  2. భారతదేశంలోని ప్రధాన మతాలకు సంబంధించిన వారిని సముచిత ప్రాతినిధ్యం కోసం వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిని విస్తరించడం.
  3. వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో విదేశీ వ్యవహారాలను భారతీయ సభ్యుడికి అప్పగించడం.
  4. వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో ముఖ్య సైన్యాధికారి పదవికి భారతీయుడిని నియమించడం.
  5. వైస్రాయ్ కార్యనిర్వాహక వర్గం జాతీయ ప్రభుత్వంగా వ్యవహరించడం
  6. ఇందుకోసం వైస్రాయ్ 1945 జలైలో సిమ్లాలో ఒక సమావేశాన్ని నిర్వహించారు.
  7. ఈ సమావేశంలో కాంగ్రెస్ యునైటెడ్ ఇండియా కోసం పట్టుపట్టింది. ముస్లిం లీగ్ మాత్రం దేశ విభజనను సమర్థించింది.
క్యాబినెట్ మిషన్ (క్యాబినెట్ రాయబారం):
  1. క్లెమెంట్ అట్లి బ్రిటన్‌లో అధికారంలోకి రావడంతో భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో క్యాబినెట్ రాయబారాన్ని భారతదేశానికి పంపారు.
  2. బ్రిటన్‌లో క్యాబినెట్ మంత్రులయిన సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఎ.వి.అలెగ్జాండర్, లార్డ్ పెథిక్ లారెన్స్ సభ్యులుగా గల మంత్రుల బృందం భారత పర్యటన ప్రారంభించారు.
  3. ఈ రాయబారానికి సర్ పెథిక్ లారెన్స్ ఛైర్మన్‌గా వ్యవహరించారు.
  4. 1946 మే 16 న వీరు తమ ప్రణాళికను వెల్లడించారు.
ముఖ్యాంశాలు:
  1. బ్రిటీష్ పాలిత భారతదేశం, స్వదేశీ సంస్థానాలు కలిపి ఇండియన్ యూనియన్ అనే రాజకీయ వ్యవస్థ ఏర్పడుతుంది.
  2. ఆ యూనియన్ విదేశీ వ్యవహారాలు, రక్షణ, కమ్యూనికేషన్ వంటి జాతీయ ప్రాముఖ్యతగల అంశాలు నిర్వహిస్తుంది.
  3. కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేని పాలనాంశాలపై శాసనాధికారం రాష్ట్రాలకు సంక్రమిస్తుంది.
  4. స్వదేశీ సంస్థానాలు కూటమిగా శాసన నిర్మాణ శాఖ ఏర్పాటు అవుతుంది.
  5. పరిపాలనా నిర్వహణకై 14 మంది సభ్యులతో కూడిన ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటవుతుంది.
  6. పాకిస్తాన్ అనే మరొక దేశం ఏర్పడే భావన ఆచరణ సాధ్యం కాదు.
  7. రాజ్యాంగాన్ని రూపొందించేందుకు ప్రత్యేక రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటవుతుంది.
తాత్కాలిక ప్రభుత్వం (1946):
  1. బ్రిటీష్ ప్రభుత్వం 1946 ఆగస్ట్ 24న తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రకటించింది.
  2. దీనికి అనుగుణంగా 1946 సెప్టెంబర్ 2 న తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటయింది.
  3. ప్రారంభంలో సందేహించిన ముస్లిం లీగ్, 1946 అక్టోబర్ 29 న తాత్కాలిక ప్రభుత్వంలో చేరింది.
  4. తాత్కాలిక ప్రభుత్వంలో ఉన్నవారందరూ వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో సభ్యులు. వైస్రాయ్ వైవెల్ దీనికి అధ్యక్షుడిగా, జవహర్ లాల్ నెహ్రూ ఉపాధ్యక్షుడుగా వ్యవహరించారు.
అట్లి ప్రకటన (1947):
  1. బ్రిటన్ ప్రధాని అట్లి 1947 ఫిబ్రవరి 20న కామన్స్ సభలో మాట్లాడుతూ, 1948 జూన్ నాటికి బ్రటీష్ ప్రభుత్వం భారతదేశం నుంచి వైదొలగుతుందని ప్రకటించాడు. దీనినే అట్లి ప్రకటన అంటారు.
  2. ఈ ప్రకటనను బ్రిటీషువారు జారిచేసిన వాటిలో అత్యుత్తమమైనదిగా గాంధీజీ పేర్కొన్నారు.
మౌంట్ బాటన్ ప్రణాళిక (1947):
  1. వైస్రాయ్/ గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ దేశంలోని రాజకీయ ప్రముఖులతో సంప్రదింపులు జరిపి, సమైక భారతదేశ ప్రాతిపదిక మీద కాంగ్రెస్‌కు, ముస్లి లీగ్‌కు అంగీకారం కుదర్చడం సాధ్యం కాదని, దేశ విభజన ఒక్కటే మిగిలిన పరిష్కారంగా భావించి ప్రణాళిక తయారుచేశారు.
ముఖ్యాంశాలు:
  1. ఇండియన్ యూనియన్ భారత్, పాకిస్తాన్ అనే రెండు రాజ్యాలుగా విభజితమవుతాయి.
  2. 1948 జూన్‌కు బదులుగా 1947 ఆగస్టు 15న రెండు దేశాలుగా విభజితమవుతాయి.
  3. అస్సాం భారతదేశ అంతర్భాగంగా ఉండిపోగా, బెంగాల్, పంజాబ్‌లను మత ప్రాతిపదికపై విభజించడం జరుగుతుంది.
భారత స్వాతంత్ర్య చట్టం (1947):
  1. భారతదేశ వ్యవహారాల నిర్వహణ, నియంత్రణ కోసం బ్రిటీష్ ప్రభుత్వం రూపొందించిన చిట్టచివరి చట్టం ఇదే.
  2. ఇది 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి నుండి అమలులోకి వచ్చింది.
ముఖ్యాంశాలు:
  1. ఇండియా, పాకిస్తాన్ అనే రెండు స్వతంత్ర దేశాలు ఏర్పడతాయి.
  2. వీటి కోసం వేరు వేరు రాజ్యాంగ పరిషత్తులు కూడా ఏర్పాటు చేయబడ్డాయి.
  3. స్వదేశి సంస్థానాలపై బ్రిటీష్ సార్వభౌమాధికారం రద్దవుతుంది.
  4. భారత వ్యవహారాల కార్యదర్శి పదవి కూడా రద్దవుతుంది
  5. బ్రిటీష్ రాజు/రాణి కి ఉన్న భారత చక్రవర్తి అనే బిరుదు రద్దవుతుంది.
  6. వైస్రాయ్ పదవి రద్దవుతుంది.
  7. రాజ్యాంగ పరిషత్తు తాత్కాలిక పార్లమెంటుగా పనిచేసి చట్టాలను రూపొందిస్తుంది.
  8. గవర్నర్ జనరల్, రాష్ట్ర గవర్నర్లు రాజ్యాంగపరమైన అధిపతులుగా వ్యవహరిస్తారు.
  9. భారత్‌కు మొదటి గవర్నర్ జనరల్: లార్డ్ మౌంట్ బాటన్
  10. పాకిస్తాన్‌కు మొదటి గవర్నర్ జనరల్: ముహమ్మద్ అలీ జిన్నా